YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ప్రమాదాలకు నెలవుగా రహదారి అంచులు

ప్రమాదాలకు నెలవుగా రహదారి అంచులు
గ్రామీణ ప్రాంతాలు ప్రగతి పథంలో నిలవాలంటే రహదారుల అభివృద్ధి కీలకం. ఈ నేపధ్యంలో ఉపాధి హామీ పథకం నిధులు, ఇతర నిధులతో కలిపి రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో సిమెంటు రహదారులు వెలుస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట పరిధిలోరహదారులతో పాటు అంతర్గత రహదారులను కూడా సిసి రహదారిగా అభివృద్ధి చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా ప్రభుత్వం కోట్ల వెచ్చించి రహదారులు నిర్మిస్తున్నా మార్జిన్లు నిర్మించడంలో నిర్లక్ష్యం తాండవిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్జిన్లు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని అంతా అంటున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదాల సంఖ్య మరీ అధికంగా ఉంటోందని చెప్తున్నారు. మండలంలో ఆర్‌అండ్‌బి రహదారు నుండి గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన చిన్నరహదారుల వరకు ఇదే దుస్థితి. నిర్మాణ పనులు పూర్తి చేసిన వెంటనే మార్గానికి ఇరనువైపులా అంచుల్ని గ్రావెల్‌తో నింపాలి. కానీ కాంట్రాక్టర్లు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో రహదారులు ప్రమాదకరంగా మారుతున్నాయి. చాలా చోట్ల రహదారుల అంచున లోతుగా ఉండడంతో కిందకు దిగాలన్నా పైకి ఎక్కాలన్నా ప్రయాణికులు నానాపాట్లు పడుతున్నారు. కొత్తగా నిర్మించిన రహదారులు సైతం అంచుల లేకపోవడంతో అవి త్వరగా పాడవుతున్నాయి. పాలకులు అధికారులు రహదారులను నిర్మించడంలో చూపిన శ్రద్ధ అంచులపై చూపడంలో విఫలమవుతున్నారని ప్రజలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి రహదారుల పటిష్టతకు చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

Related Posts