తనను తిరుమల శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకుడిగా కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని రమణ దీక్షితులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం గౌరవ ప్రధాన అర్చకుడి పదవి నుంచి ఏవీ రమణ దీక్షితులను జగన్ ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. టీడీడీ ధర్మకర్తల మండలి, అధికారులు, సీనియర్, జూనియర్ పిఠాధిపతులపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, తద్వారా ప్రతిష్టకు కోలుకోలేని నష్టం కలిగిందని రమణ దీక్షితులను శ్రీవారి ఆలయం గౌరవ ప్రధాన అర్చకుడి పదవి నుంచి టీటీడీ తొలగించింది. ఈ మేరకు గత ఈవో ధర్మారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులను రమణ దీక్షితులు సవాల్ చేశారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకుడిగా తనను కొనసాగించేలా టీటీడీని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తనను పదవి నుంచి తొలగించారని అభ్యంతరం వ్యక్తం చేశారు.. సహజ న్యాయ సూత్రాలను దృష్టిలో ఉంచుకుని ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషనను విచారించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని దేవాదాయశాఖ ముఖ్యదర్శితో పాటు టీటీడీని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
అయితే 2018లోనే ఆయన పదవీ విరమణ చేశారు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక ఆయనకు తిరుమల శ్రీవారి ఆలయం గౌరవ ప్రధాన అర్చకుడి పదవిని ఇచ్చింది.