అమరావతి,
ఎన్నికల ప్రచారం నాడు చంద్రబాబు చేసిన ప్రకటనలు ఇవి. గత ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో సంక్షేమ పథకాల అమలు మాటున లూఠి జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. గత ఐదేళ్లుగా అవే ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ ఒక శ్రీలంక మాదిరిగా తయారయిందని.. రాష్ట్ర అభివృద్ధి 20 సంవత్సరాల పాటు వెనక్కి నెట్టారని.. అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు అవసరమా అంటూ చంద్రబాబు ఊరువాడా ప్రచారం చేశారు. కానీ తీరా ఎన్నికలు వచ్చేసరికి ప్లేట్ ఫిరాయించారు. సంక్షేమ పథకాలు అందిస్తానని చెబితేనే ప్రజలు యూటర్న్ తీసుకుంటారని భావించారు. అందుకే రెట్టింపు సంక్షేమ పథకాలు అంటూ ప్రచారం చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకు సాయం. 18 సంవత్సరాలు నిండిన మహిళలు ఉంటే నెలకు 1500 రూపాయలు సాయం. మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. ఆర్టీసీ బస్సు ఎక్కితే ఫ్రీ.. ఇలా ఆల్ ఫ్రీ మాటలు చెప్పారు. నేను జగన్ మాదిరిగా కాదు.. అప్పులు చేయను.. అభివృద్ధి చేస్తాను.. ఆపై సంపద సృష్టించి మీ అందరికీ పంచుతాను.. అంటూ ప్రజలకు అంతులేని హామీలు ఇచ్చారు. ప్రజలు కూడా చంద్రబాబు మాటలను నమ్మారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాలుక మడత పెట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని ప్రకటనలు చేస్తున్నారు. జగన్ చేసిన అప్పులు చూస్తుంటే ఆందోళనగా ఉందంటున్నారు. నీకు చాలా హామీలు ఇచ్చానని గుర్తు చేస్తున్నారు. వాటిని అమలు చేయగలనా? లేదా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజల్లో టెన్షన్ ప్రారంభమైంది. పథకాల అమలు ఉంటుందా? లేదా? అని వారు భయపడుతున్నారు. మారిన ప్రకటనలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు చంద్రబాబు చేసిన ప్రకటనలు ఒకలా ఉన్నాయి. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాడు ఒకలా మారాయి. బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇంకోలా వ్యవహార శైలి ఉంది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏకంగా ఐదు ఫైళ్లపై సంతకం చేశారు. ఇక పథకాల అమలులో తిరుగు లేదన్నట్టు ప్రవర్తించారు. కానీఇప్పుడిప్పుడే క్లారిటీగా మాట్లాడుతున్నారు. అసలు విషయాలను వెల్లడిస్తున్నారు. శ్వేత పత్రాలతో సరి
పథకాలు అమలు చేయకముందే జగన్ సర్కార్ వైఫల్యాలపై మాట్లాడడం ప్రారంభించారు చంద్రబాబు. వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేశారు. జగన్ సర్కార్ ప్రజాధనాన్ని దోచుకుందని ఆరోపణలు చేశారు. పెద్ద ఎత్తున అప్పులు చేసిందని గణాంకాలు చూపించారు. ఈ పరిస్థితుల్లో తాను ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని బాంబు పేల్చారు. అసలు పథకాలు అమలు చేయడం కష్టమని చేతులెత్తేశారు.
సోషల్ మీడియాలో ట్రోల్
అయితే చంద్రబాబు హామీల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభమైంది. వైసిపి సోషల్ మీడియా విభాగం దీనిపై ట్రోల్ చేస్తోంది. పెద్ద ఎత్తున కామెడీ మీమ్స్ తో జత చేసి చేస్తున్న ప్రచారం ఆకట్టుకుంటుంది. దీనిపై నెటిజన్లు సైతం భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. పథకాల విషయంలో చంద్రబాబు ఎప్పుడు మాట మీద ఉన్నారు కదా? అని ఎక్కువమంది ప్రశ్నిస్తున్నారు. పథకాలపై ఆశలు వదులుకోవాల్సిందేనని తేల్చి చెబుతున్నారు.