YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జేసీ ఫ్యామిలీకి పెద్దపీట

జేసీ ఫ్యామిలీకి పెద్దపీట

అనంతపురం, ఆగస్టు 3
రాయలసీమలో జెసి కుటుంబానిది ప్రత్యేక స్థానం. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఆ కుటుంబానిది. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆ కుటుంబం ఒక వెలుగు వెలిగింది. రాష్ట్ర విభజనతో తెలుగుదేశం పార్టీలోకి వచ్చింది. అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబంతో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా.. చంద్రబాబు ఇరు కుటుంబాలను సమన్వయం చేశారు. టిడిపిలో కొనసాగేలా చూసుకున్నారు. అయితే ఆ కుటుంబాన్ని జగన్ వేధించారు. అధికారంలోకి రాగానే వ్యాపార మూలాలను దెబ్బ కొట్టారు. జెసి ట్రావెల్స్ ను మూతపడేలా చేశారు. ఎంపీగా ఉన్న జెసి దివాకర్ రెడ్డి పై సవాల్ చేసిన గోరంట్ల మాధవ్ కు టికెట్ ఇచ్చారు. అదే దివాకర్ రెడ్డి పై మాధవ్ ను నిలిపి అవమానపరిచారు. ఎన్నో రకాలుగా కేసులు పెట్టారు. బెదిరింపులకు దిగారు. అయినా జెసి కుటుంబం టిడిపిని వదల్లేదు. టిడిపి బలోపేతానికి కృషి చేస్తూ వచ్చింది ఆ కుటుంబం. అయితే ఇప్పుడు టిడిపి అధికారంలోకి వచ్చింది. జెసి కుటుంబం తమకు జరిగిన అన్యాయంపై పోరాటం చేయడం ప్రారంభించింది. తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ఎన్నికయ్యారు. ప్రభాకర్ రెడ్డి దూకుడు పెంచారు. ఇటీవల తమపై పెట్టిన తప్పుడు కేసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. అంతటితో ఆగకుండా జగన్ తల్లి విజయమ్మను కలిసి ఆశ్చర్యపరిచారు. అయితే జెసి దివాకర్ రెడ్డి అనారోగ్యం కారణంగా పెద్దగా కనిపించడం లేదు. ఆయన కుమారుడు సైతం ఎన్నికల్లో పోటీ చేయలేదు. అస్మిత్ రెడ్డికి మద్దతుగా ప్రచారం మాత్రం చేశారువాస్తవానికి రాష్ట్ర మంత్రివర్గంలో జెసి కుటుంబానికి ప్రాతినిధ్యం దక్కుతుందని అంతా భావించారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి ఓడిపోయినా.. తాడిపత్రి మున్సిపాలిటీలో మాత్రం గెలిచింది. అంతలా పట్టు నిలుపుకున్నారు ప్రభాకర్ రెడ్డి. ఈ ఎన్నికల్లో తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. అనంతపురం ఎంపీ టికెట్ ను దివాకర్ రెడ్డి తనయుడు పవన్ రెడ్డి ఆశించారు. 2019 ఎన్నికల్లో ఆయనే పోటీ చేసినందున.. మరోసారి బరిలో దిగేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ చంద్రబాబు బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చారు. అయినా సరే పవన్ రెడ్డి టిడిపికి ప్రచారం చేశారు.తాజాగా చంద్రబాబు జెసి కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పవన్ రెడ్డిని నియమిస్తారని సమాచారం. వైసిపి హయాంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ను విజయసాయిరెడ్డి ఆక్రమించుకున్నారు. తన అల్లుడితో పాటు ఆయన సోదరుడికి ఏసీఏను అప్పగించారు. మరో బినామీతో కలిసి అడ్డగోలుగా దోపిడీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే వారందరినీ ఏసీఏ నుంచి తరలించి ప్రక్షాళన చేస్తారని సమాచారం. ఈ నెల నాలుగున ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేస్తారని తెలుస్తోంది.జెసి పవన్ రెడ్డికి క్రికెట్ రంగంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రీడాకారులతో సైతం సన్నిహితంగా గడుపుతారని తెలుస్తోంది. ఏసీఏను పవన్ రెడ్డికి అప్పగిస్తే గాడిలో పెడతారని.. క్రీడాభివృద్ధికి పాటు పడతారని చంద్రబాబు భావిస్తున్నారు. మరోవైపు ఎమ్మెస్ కే ప్రసాద్ సైతం ఏసీఏ అధ్యక్షుడిగా ఎంపిక కావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జెసి పవన్ రెడ్డి కోరితే మాత్రం చంద్రబాబు కాదనే పరిస్థితి ఉండదు. మరి ఏం జరుగుతుందో చూడాలి

Related Posts