విజయవాడ, ఆగస్టు 3,
వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మళ్లీ బెంగుళూరుకు ప్లాన్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు గన్నవరం నుంచి విమానంలో నేరుగా బెంగుళూరు వెళ్లనున్నారు. జగన్, ఆయన సతీమణి భారతి గురువారం విజయవాడ పాస్‌పోర్టు ఆఫీసుకు వచ్చారు. సాయంత్రం పాస్‌పోర్టును రెన్యువల్ చేయించుకుని తిరిగి వెళ్లిపోయారు. దీంతో ఆయన ఫారెన్ టూర్‌కి వెళ్తున్నారా అన్న సందేహాలు అప్పుడు మొదలయ్యాయి. జగన్ వ్యాపారాలు అన్నీ బెంగుళూరులోనే ఉన్నాయని అంటున్నారు. ఆ వ్యవహారాలు చక్కబెట్టేందుకు అక్కడికి వెళ్తున్నారని చెబుతున్నారు. గడిచిన రెండురోజులు కార్యకర్తల పేరిట తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రజా దర్బార్ నిర్వహించారు. చాలామంది తమ సమస్యలను విన్నవించుకున్నారు. వారి నుంచి అన్ని విషయాలు తెలుసుకున్న జగన్.. కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉంటే బెటరని ఆలోచనకు వచ్చినట్టు ఆ పార్టీలో వార్తలు జోరందుకున్నాయి. పార్టీలోని కీలక నేతలకు సూచనలు, సలహాలు అధినేత జగన్ ఇచ్చినట్టు సమాచారం. అధికార పక్షాన్ని ధీటుగా ఎలా ఎదుర్కోవాలో చెప్పినట్టు తెలుస్తోంది. కొద్దిరోజులు తాను బెంగుళూరులో ఉంటానన్న విషయాన్ని బయటపెట్టారట జగన్. మిగతా కార్యక్రమాలు అందరూ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని సలహా ఇచ్చారట. దీంతో యలహంక ప్యాలెస్‌లో ఏం జరుగుతోంది? అక్కడి అధికార-విపక్షాల నేతలను కలుస్తున్నారా? ఫ్యూచర్ రాజకీయాలకు అక్కడి నుంచే స్కెచ్ వేయనున్నారా? ఇలా రకరకాల ప్రశ్నలు వైసీపీ కార్యకర్తలను వెంటాడుతున్నాయి.