విశాఖపట్టణం, ఆగస్టు 3,
సరిగ్గా ఎన్నికలకు ముందు అంటే దాదాపు 4 నెలల క్రితం విశాఖ తీరానికి భారీ మొత్తంలో డ్రగ్స్‌తో ఓ కంటైనర్ రావడం ఏపీవ్యాప్తంగా సంచలనం రేపింది. అదే డ్రగ్స్ ఇష్యూని ఎన్నికల ప్రధానాంశంగా మార్చుకున్న అప్పటి పాలక, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం మారింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎన్డీయే.. అధికారంలోకి వచ్చినా కూడా దానిపై దర్యాప్తు చేపట్టలేదు. ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా.. 4 నెలలుగా ఎలాంటి పురోగతి లేకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది.బ్రెజిల్ నుంచి 25 వేల కిలోల డ్రై ఈస్ట్‌తో మార్చి 16న కంటైనర్ విశాఖ పోర్టుకు చేరింది. దీనిపై ఇంటర్‌పోల్ సమాచారంతో ఆపరేషన్ గరుడ పేరుతో ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు కంటెయినర్‌ను తెరిచి బ్యాగ్‌లను పరిశీలించారు. మత్తు పదార్థాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆ తర్వాత మార్చి 19న డ్రగ్స్ నమూనాలు సేకరించి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపి కంటెయినర్‌కు సీల్ వేశారు.విశాఖ డ్రగ్ కంటైనర్‌పై సీబీఐ దర్యాప్తు విషయాల్లో ప్రతిపక్ష వైసీపీ.. అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అయితే ఈ కంటైనర్ షిప్‌ను సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ.. బ్రెజిల్ నుంచి తీసుకొచ్చినట్లు సీబీఐ గుర్తించింది. దీంతో వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.తాజాగా ఈ కేసుపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై ఫైరయ్యారు. నాలుగు నెలలైనా కేసు దర్యాప్తు ముందుకు కదలడం లేదు ఎందుకు అని ప్రశ్నించారు. ఈ కేసు ఫైల్ చేసినపుడు తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని ఆరోపణలు చేశారన్న ఆయన.. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి సర్కార్ విశాఖ డ్రగ్ కంటైనర్ ఘటనపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కేసు విచారణ జరుగుతుందని.. సీబీఐ దగ్గర నుండి దర్యాప్తు వివరాలు తీసుకుని మీడియాకు వెల్లడిస్తానని హోం మంత్రి వంగలపూడి అనిత అంటున్నారు.సీజ్ చేసిన కంటెయినర్.. ఇంకా విశాఖలోని ఎగ్జామిన్ పాయింట్‌లోనే ఉంది. దీనికి సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తోంది. డిఆర్ఐ సీజ్ చేసిన 10 కంటెయినర్లు సైతం అక్కడే ఏడెనిమిదేళ్లుగా పడి ఉన్నాయి. బ్రెజిల్ నుండి కంటైనర్‌లో విశాఖకు డ్రగ్స్ వస్తున్నాయని ఇంటర్పోల్ నుండి సమాచారం తెలియడంతో విశాఖ, చెన్నై పోర్టులో హడావుడి చేసిన గత అధికారులు.. ఇప్పుడు దాని ఊసే ఎత్తకపోవడంతో ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసు కూడా అలాగే మరుగున పడిపోతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.