YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ట్రాప్ లో వైసీపీ...

ట్రాప్ లో వైసీపీ...

విజయవాడ, ఆగస్టు 5,
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చంద్రబాబు ఎందుకు చెబుతున్నట్టు? క్లిష్ట పరిస్థితుల్లో పథకాలు అమలు చేయలేమని అనుమానం ఎందుకు వ్యక్తం చేస్తున్నట్టు? దీని వెనుక వ్యూహం ఉందా? లేకుంటే వైసీపీని ఇరికించే ప్రయత్నమా? మరి లేకుంటే ట్రాప్ చేస్తున్నట్టా? పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. వాటికి మించి కొన్ని రకాల హామీలు ఇచ్చారు. కానీ ఇంతవరకు అమలు చేయలేకపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు గడుస్తున్నా సంక్షేమ పథకాల విషయంలో ఆశించిన స్థాయిలో అడుగులు వేయలేకపోతున్నారు. పనిలో పనిగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. అంతటితో ఆగకుండా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వైసిపి దారుణంగా మార్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనినే వైసిపి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నారని పోస్టులు పెడుతోంది. అయితే ఈ క్రమంలో వైసిపి చంద్రబాబు ట్రాప్ లో పడినట్లు తెలుస్తోంది. పథకాలు అమలు చేయకపోవడంపై విస్తృత ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో కొన్ని పథకాలను అమలు చేసి వైసిపిని ఇరుకున పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. అయితే అది తెలియని వైసీపీశ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే చంద్రబాబు పథకాలు అమలు చేయకపోవడం కంటే.. వైసిపి హయాంలో ఆర్థిక పరిస్థితి దిగజారింది అన్న అంశమే ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. ఇది తప్పకుండా మైనస్ చేస్తుందని.. చంద్రబాబు ఆడుతున్న మైండ్ గేమ్ ను అర్థం చేసుకుంటే వైసీపీకే నష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.సామాజిక పింఛన్ మొత్తాన్ని పెంచి అమలు చేయగలిగారు చంద్రబాబు. వృద్ధాప్య వితంతు పింఛన్ ను 3000 నుంచి 4 వేల రూపాయలకు పెంచగలిగారు. దివ్యాంగులకు సంబంధించి 6 వేలకు పెంచారు. అనారోగ్యం గురైన వారు, మంచానికి పరిమితమైన వారి విషయంలో సైతం పింఛన్ అమాంతం పెంచి అందించగలిగారు. వైసిపి రాష్ట్రాన్ని ఆర్థికంగా దిగజార్చినా తాను అమలు చేసిన విషయాన్ని ఇప్పుడు చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు. వరుసగా రెండో నెల సైతం పింఛన్లు విజయవంతంగా అందించి ప్రజల్లో వ్యతిరేకత లేకుండా చేసుకోగలిగారు.అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా 100 క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. వీటికి సంబంధించి ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. కచ్చితంగా ఆగస్టు 15 నాటి నుంచి అన్న క్యాంటీన్లలో భోజనాలు, అల్పాహారాలు ప్రారంభం కానున్నాయి. దీనిని కూడా ప్రచారాస్త్రంగా మార్చుకోనున్నారు చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా తాను అమలు చేసి చూపించానని చంద్రబాబు చెప్పుకొనున్నారు.ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం ప్రారంభించేందుకు కసరత్తు పూర్తయింది. ప్రతినెల 250 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చంద్రబాబు. అయితే ఆధార్ కార్డుతో ప్రయాణానికి వీలు కల్పించాలా? లేకుంటే ప్రత్యేక కార్డులు జారీ చేయాలా? అన్నది నిర్ణయించనున్నారు. దీనిని సైతం చంద్రబాబు ప్రచారానికి వాడుకునే అవకాశం ఉంది. జగన్ ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసినా.. ఈ రాష్ట్ర ప్రజల కోసం తాను ఈ పథకాలను అమలు చేస్తున్నానని చెప్పుకునే అవకాశం ఉంది. ఇది తెలియని వైసిపి.. చంద్రబాబు పథకాలు అమలు చేయడం లేదని ప్రచారం చేయడం ద్వారా.. చంద్రబాబు ట్రాప్ లో పడినట్లు అయింది. దీనిని వైసిపి ఎలా అధిగమిస్తుందో చూడాలి.

Related Posts