తెలంగాణ రాష్ట్రంలోని ఐటిఐలలో ప్రవేశాలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్నామని హోం, కార్మిక, ఉపాధి కల్పనా మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు.రాష్ట్రంలోని 64 ప్రభు త్వ ఐటిఐలలో 8,182సీట్లు, ప్రైవేట్ రంగంలోని 222 ఐటిఐలలో 33,980 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఈ సీట్లన్నీ ఆన్‌లైన్ విధానంలోనే భర్తీ చేస్తామని వెల్లడించారు.ఐటిఐ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని నాయిని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన టిఎస్‌పాస్ ద్వారా ఇప్పటికే 350 కొత్త కంపెనీలు ఏర్పాటు చేసేందుకు అనుమతించామన్నారు. వీటిలో 150 పనిచేయడం ప్రారంభమైందని, వీటిలో 50 వేల మందికి ఉద్యోగాలు లభించాయని చెప్పారు. మరో 150 కంపెనీలు ప్రారంభం కాబోతున్నాయని, వీటిలో కూడా 50 వేల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. విదేశాల్లో ఉద్యోగం, ఉపాధికోసం వెళ్లేవారికి చట్టబద్దత కల్పించేందుకు తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ (టాంటాం) ద్వారా సహకారం అందిస్తున్నామని తెలిపారు. దీని ద్వారా ఇప్పటి వరకు వెయ్యి మందికి ఉద్యోగాలు లభించాయని వివరించారు.