విజయవాడ, ఆగస్టు 5,
ఏపీలో కూటమి ప్రభుత్వం ఆర్భాటాలకు పోవడం లేదు.అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ పాలనపై దృష్టి పెట్టారు. మంత్రుల సైతం తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.అమరావతి రాజధాని నిర్మాణం పై సైతం చంద్రబాబు దృష్టి పెట్టారు.కేంద్రం నుంచి 15 వేల కోట్ల రూపాయలు సాయం పొందగలిగారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సైతం వేగవంతం అవుతున్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ప్రత్యేక నిధులు ప్రకటించింది.అక్కడ సైతం మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అన్నీ బాగానే ఉన్నా.. సంక్షేమ పథకాల విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రకటనలు రావడం లేదు.ఈ తరుణంలో ఒక ప్రచారం అయితే జరుగుతోంది.ఆగస్టు 15 నుంచి మూడు కీలక పథకాలకు సంబంధించి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అన్న క్యాంటీన్ల ప్రారంభం, అమ్మకు వందనం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఈ మూడు పథకాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టునున్నట్లు తెలుస్తోంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కసరత్తు చేస్తున్నారు. సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు కీలకమైన ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఇప్పటికే పింఛన్ల పెంపును అమలు చేసి చూపించారు. డీఎస్సీ పోస్టులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దుచేసి అనుకున్నది సాధించారు. ఇప్పుడు కీలకమైన మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, అన్న క్యాంటీన్లు, తల్లికి వందనం పథకాలను ప్రకటించి అనుకున్న హామీలను నెరవేర్చిన ఘనతను అందుకోనున్నట్లు తెలుస్తోంది.2014 టిడిపి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. ముఖ్యంగా నగరాలతో పాటు పట్టణాల్లో క్యాంటీన్లు సక్సెస్ అయ్యాయి. ఐదు రూపాయలకే భోజనం తో పాటు అల్పాహారం అందించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు నిలిచిపోయాయి. ఆ భవనాలు సైతం మూలకు చేరాయి. అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లు తెరిపిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఈ ఆగస్టు 15న దాదాపు 100 క్యాంటీన్లను తెరవనున్నారు. సెప్టెంబర్ లో మిగతా 83 తెరుచుకోనున్నాయి. డిసెంబర్ నాటికి మరో 40 క్యాంటీన్లను జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది. కర్ణాటక తో పాటు తెలంగాణ ప్రభుత్వాలు సైతం ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేస్తున్నాయి. దీంతో ఏపీ అధికారులు ఆ రెండు రాష్ట్రాలకు వెళ్లి అధ్యయనం చేశారు. ఈ పథకం అమలు చేయడం ద్వారా నెలకు సగటున 250 కోట్ల రూపాయల భారం పడుతుందని ఒక అంచనా వేశారు. అయితే ఆధార్ కార్డు ప్రాతిపదికన ప్రయాణం కల్పించాలా? లేకుంటే ప్రత్యేక కార్డులు జారీ చేయాలా? అని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ పథకాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభించి అవకాశము ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.తల్లికి వందనం పథకం సైతం ఆగస్టు 15 నుంచి ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 20 వేల రూపాయల చొప్పున చదువుకు సాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమై 50 రోజులు దాటుతోంది. దీంతో ఈ పథకం అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ పథకానికి సంబంధించి అదేరోజు కార్యాచరణ ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ఎన్నికల్లో ఇచ్చిన మూడు హామీలకు సంబంధించి పథకాలు అమలు చేస్తుండడం విశేషం.