YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఫైల్స్ లెక్కేంటీ..... మాయం... పైఆరా

ఫైల్స్  లెక్కేంటీ..... మాయం... పైఆరా

విజయవాడ, ఆగస్టు 5,
అమరావతి రాజధాని నిర్మాణానికి నాడు టిడిపి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సిఆర్డి ఏ)ను ఏర్పాటు చేసింది. అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా చేసిన చంద్రబాబు.. అక్కడ నిర్మాణ పనులు ప్రారంభించారు. సిఆర్డిఏ ను మరింత పటిష్టం చేశారు. అప్పట్లో టిడిపి ప్రభుత్వం అమరావతికి సంబంధించి కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. అయితే ఇప్పుడు అదే కార్యాలయంలో టిడిపి హయాంనాటి ఫైళ్లు మాయం కావడం ఆందోళన కలిగిస్తోంది. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కేంద్రంగా అవినీతి జరిగిందని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టిడిపి ముఖ్య నేతలపై కేసులు కూడా నమోదయ్యాయి. అప్పట్లో సిఆర్డిఏ ఫైళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విచారణ కోసం పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో కొన్ని ఇప్పుడు కనిపించడం లేదు. దీంతో సిఆర్డిఏ అధికారులు ప్రభుత్వానికి ప్రత్యేకంగా నివేదించినట్లు సమాచారం. ఇటీవల రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత.. ఎక్కడికక్కడే ఫైళ్లు మాయం కావడం.. అగ్ని ప్రమాదాలు సంభవించి దగ్ధం కావడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం అమరావతి నిర్మాణాలపై నిపుణుల నివేదికలు, మరోవైపు సిఆర్డిఏ సమీక్షలు సీరియస్ గా జరుగుతున్న వేళ.. ఫైళ్లు మాయం కావడం ఆందోళన కలిగిస్తోంది.నాడు విచారణ పేరుతో తీసుకెళ్లిన ఫైళ్లను మాయం చేసి ఉంటారన్న అనుమానాలు పెరుగుతున్నాయి. కేవలం కేసుల భయంతోనే ఇలా చేసి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి.సిఆర్డిఏ వ్యవహారాలకు సంబంధించి మంత్రి నారాయణ సమీక్షిస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణాలకు సంబంధించి ప్రత్యేక బాధ్యతలు తీసుకుంటున్నారు. ఈ తరుణంలో సిఆర్డిఏ కార్యాలయంలో ఇంజనీరింగ్, ప్లానింగ్, రెవెన్యూ, ఎస్టేట్.. ఇలా పలు విభాగాల ఫైల్స్ కనిపించడం లేదు. దీనిపై అధికారులు మంత్రి నారాయణ కు ఫిర్యాదు చేశారు. ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అంశంపై గత వైసిపి ప్రభుత్వం కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుపై అక్రమ కేసుల్లో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఒకటి. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలో అవకతవకలకు పాల్పడ్డారు అన్నది అప్పటి వైసీపీ ప్రభుత్వ ఆరోపణ. ఆ కేసులో చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణ పేరును కూడా చేర్చారు. అప్పట్లో విచారణ నిమిత్తం సి ఆర్ డి ఏ నుంచి చాలా ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు అవే ఫైళ్లు కనిపించకపోవడం విశేషం.మొన్ననే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక ఫైళ్లు దగ్ధమయ్యాయి. ఈ కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సిఐడి దర్యాప్తు సైతం కొనసాగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే సిఆర్డిఎఫ్ ఫైళ్లు సైతం మాయం కావడం ఆందోళన కలిగిస్తోంది.

Related Posts