YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పవన్ స్వరంలో మార్పు

పవన్  స్వరంలో మార్పు

విజయవాడ, ఆగస్టు 6
నాయకుడు.. పాలకుడుగా మారితే స్వరంలో మార్పు వస్తుంది. వ్యవహార శైలిలో మార్పు వస్తుంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఒక ఉదాహరణ. జనసేన అధినేతగా పవర్ ఫుల్ వాయిస్ వినిపించారు పవన్. అదే పవన్ డిప్యూటీ సీఎం గా మారారు. 50 రోజుల కిందట బాధ్యతలు చేపట్టారు. కానీ మునుపటిలా ఆ స్వరం వినిపించడం లేదు. మాటల వేడి కూడా తగ్గింది. సినీ రంగంలో అనతి కాలంలోనే ఎదిగారు పవన్. తనకంటూ ఒక మేనరిజం ఏర్పాటు చేసుకున్నారు. అందుకే సక్సెస్ అయ్యారు. సినిమాల సక్సెస్ తో పని లేకుండా.. తెలుగు పరిశ్రమలో అగ్రనటుడుగా వెలుగొందారు. పవర్ స్టార్ అన్న బిరుదు దక్కించుకున్నారు. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత కూడా అదే పవర్ ను కొనసాగించారు. 2014 నుంచి 2019 వరకు ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినా..బలమైన రెండు ప్రాంతీయ పార్టీలకు దీటుగా తన రాజకీయాన్ని నడిపించారు. 2019లో పోటీ చేశారు. తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయారు. కేవలం ఒకే ఒక స్థానంలో తన పార్టీ గెలిచింది. అయినా సరే 151 స్థానాలు దక్కించుకున్న వైసీపీకి గత ఐదేళ్లుగా చుక్కలు చూపించారు. ఆయన ప్రజల్లోకి వచ్చిన ప్రతిసారి అప్పటి మంత్రులు, వైసీపీ నేతలకు నిత్యం పనే. పవన్ విమర్శలకు ఎలా తిప్పి కొట్టాలో తెలియక సతమతమయ్యేవారు. అంతలా అప్పుడు రాజకీయాలను శాసించారు పవన్. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట తూటాలా మారేది. ప్రత్యర్థి గుండెలను చీల్చుకుంటూ పోయేది. అయితే అటువంటి వ్యక్తి చేతికి అధికారం వచ్చేసరికి సమూల మార్పులు ఉంటాయని అంతా భావించారు. కానీ గత 50 రోజుల్లో కేవలం సమీక్షలు, సమావేశాలు కొనసాగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి రావడం లేదు పవన్ డిప్యూటీ సీఎం తో పాటు నాలుగు మంత్రి పదవులను స్వీకరించి 50 రోజులు దాటుతోంది. కానీ గతం మాదిరిగా చురుకుతనం, పవర్ ఫుల్ నేతృత్వం కనిపించడం లేదు. అయితే అది అధికారంలో ఉన్నప్పుడు చెల్లదు కూడా. ఒక అధినేతగా పవర్ ఫుల్ నేతగా ఎదిగిన పవన్.. అధికారం చేపట్టాక ఆ స్థాయిలో ప్రతాపం, ప్రభావం చూపలేకపోతున్నారు. చేతిలో ఆరు మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. ఆపై డిప్యూటీ సీఎం హోదా ఉంది. అయినా సరే అధికార దర్పం చూపేందుకు పవన్ ఇష్టపడడం లేదు. వాస్తవానికి పవన్ కూటమి ప్రభుత్వంలో హోం మంత్రి పదవి నిర్వర్తిస్తారని అంతా భావించారు. సీఎం తరువాత అంతటి పెద్ద పదవి అదే. సహజంగానే జనసైనికులు సైతం హోం మంత్రి పదవిలో పవన్ ను చూడాలనుకున్నారు. కానీ పవన్ మాత్రం దర్పం కంటే..ప్రజలకు మెరుగైన పాలన అందించే శాఖల కే ఇష్టపడ్డారు. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖలను ఎంచుకున్నారు. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యాటక, అటవీ శాఖ.. ఇలా పల్లెపాలనకు సంబంధించిన అన్ని రకాల శాఖలను  తన వద్ద ఉంచుకున్నారు. అయితే మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ దూకుడు తగ్గింది. సహజంగానే ఇది జనసైనికులకు మింగుడు పడని అంశం. అందుకే పవన్ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని వారు ఆశిస్తున్నారు. గతం మాదిరిగా సమకాలీన రాజకీయ అంశాలపై స్పందించాలని కోరుకుంటున్నారు. అయితే శాఖలపై పట్టు పెంచుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. తన చుట్టూ యువ, నిజాయితీ అధికారులను నియమించుకుంటున్నారు. ప్రతిపక్షం మాదిరిగా అధికారంలో ఉన్నవాళ్లు మాట్లాడడం కుదరని పనిగా తేల్చి చెబుతున్నారు. శాసనసభలో సైతం ఇదే విషయాన్ని ప్రకటించారు. తాను తప్పు చేసినా.. కఠిన చర్యలు తీసుకోవాలని నేరుగా స్పీకర్ నే కోరారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించే స్థాయిలో ఉంటారు. అధికారంలోకి వస్తే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ విషయం తెలుసు కనుక పవన్ తనపని తాను చేసుకుంటున్నారు. అవసరమైతేనే మాట్లాడుతున్నారు.

Related Posts