నెల్లూరు, ఆగస్టు 6,
నెల్లూరు జిల్లాలో థర్మల్ పవర్ ప్రాజెక్టుకు చెందిన బూడిద చెరువుకు గండి పడింది. దీంతో నీటితో కలిసిన బూడిద దిగువ ప్రాంతాలకు చేరింది. పంట పొలాలను బూడిద కమ్మేసింది. ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తు్న్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శనివారం బూడిద చెరువుకు గండి పడింది. జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు సమీపంలోని దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఏపీ జెన్‌కో)కు చెందిన యాష్‌పాండ్ (బూడద చెరువు)కు గండిపడటంతో ప్రజలు ఆందోళనల్లో ఉన్నారు. బూడిద చెరువుకు గండిపడటంతో బూడిద నీరు సమీప పొలాలను ముంచెత్తుతోంది. ఈ చెరువుకు దిగువన ఉన్న సమీప గ్రామాల్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ప్రతి రోజు బొగ్గు ఆధారంగా 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. విద్యుత్ ఉత్పత్తిలో వినియోగించిన బొగ్గు, వినియోగం అయిపోయిన తరువాత నీరు, నల్ల బూడిద కలిసి పైపుల ద్వారా బయటకు వస్తుంది. ఈ బూడిదను నిల్వ చేయడానికి 300 ఎకరాల్లో యాష్‌పాండ్ (బూడిద చెరువు)ను ఏర్పాటు చేశారు. ఆ నీటితో కలిసిన నల్ల బూడిద పైపుల ద్వారా ఆ చెరువులోకి వచ్చి పడుతోంది. అయితే బూడిద చెరువు కట్టలు బలహీనంగా ఉండటంతో శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఏకంగా 16 అడుగుల కట్ట తెగిపడింది. ఈ ఇది బూడిద చెరువుకు ఎడమవైపు గండికొట్టింది. దీంతో నీటితో కలిసిన నల్ల బూడిద చెరువుకు దిగువుకు కొట్టుకుపోతుంది.ఆయుదాలపాడు, మిట్టపాలెం, ముసునూరివాని పాలెం తదితర గ్రామాల పొలాల్లోకి బూడిద నీరు కొట్టుకురావడంతో పొలాలన్నీ బూడిదతో నిండిపోయాయి. పంటనష్టం జరిగే అవకాశం ఉందని రైతులు, సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలతో ఉన్నారు. అయితే సమాచారం తెలుసుకున్న జెన్‌కో అధికారులు చెరువు వద్దకు చేరుకుని పరిశీలించారు. గండిని పూడ్చే పని చేపట్టారు. అయితే శనివారం అర్ధరాత్రి వరకు గండి పూడ్చలేకపోయారు. దీంతో ప్రవహిస్తున్న బూడిద గ్రామాలను, పొలాలను చుట్టేస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతోందనని ఆయా గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
దీంతో శనివారం అర్ధరాత్రి అయినప్పటికీ గండిపూడ్చలేకపోయారు అధికారులు. ఈ బూడిద పొలాలను నాశనం చేస్తుందని, పంటలు నష్టపోతాయని రైతులు, ప్రజలు అంటున్నారు. బూడిద చెరువు కట్ట బలహీనంగా ఉండటాన్ని ముందుగా గ్రహించకపోవడంతోనే ఈ విపత్తు తలెత్తిందని స్థానిక ప్రజలు అంటున్నారు. గండిని వెంటనే పూడ్చాలని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆదివారం ఉదయం గండి పూడ్చే పనులు చేపట్టారు అధికారులు.