విజయవాడ, ఆగస్టు 6,
అటు తెలంగాణలో కేసీఆర్, ఇటు ఏపీలో జగన్ అధికారం శాశ్వతమన్నట్లు వ్యవహరించారు. పాలనలో వన్ మాన్ షో చేసిన ఆ ఇద్దరికి తెలుగు ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు. ఆ ఎఫెక్ట్‌తో తెలంగాణలో బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది. అదే సీన్ ఏపీలో వైసీపీ విషయంలో కూడా రిపీట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీకి ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు షాక్ ఇవ్వబోతున్నారన్న ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం వైసీపీలో ఉన్న ప్రజాప్రతినిధుల్ని చేర్చుకోవడానికి టీడీపీ, జనసేనలు సిద్దంగా లేవు. దాంతో పార్టీ మారాలని చూస్తున్న వైసీపీ నేతలు కొత్త రూటు పడుతున్నారంట. వైసీపీకి త్వరలో ఆ పార్టీ రాజ్యసభ ఎంపీలు ఝలక్ ఇవ్వడం ఖాయమన్న ప్రచారం జరుగుతుంది. రానున్న రోజులలో జగన్‌కు భారీ షాక్ తప్పదని అంటున్నారు. వైసీపీకి రాజ్యసభలో 11 మంది, లోక్ సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. వారిలో మెజారిటీ రాజ్యసభ సభ్యులు పార్టీ మారేందుకు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ సర్కారుకి రాజ్యసభలో అవసరమైన బలంలేదు. కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లులు రాజ్యసభ బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందాలంటే ఎన్డీఏలో లేని పార్టీల మద్దతు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎన్డీఏ సర్కారుకి రాజ్యసభలో బయట పార్టీల మద్దతు అవసరమైన నేపధ్యంలో వైసీపీకి ఉన్న 11 మంది, బీఆర్ఎస్‌కు ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులు కీలకంగా మారారు. ఎన్డీఏ కూటమిలో లేకపోయినా బీఆర్ఎస్, వైసీపీలు తాము అధికారంలో ఉన్నప్పుడు అంశాల వారీ మద్దతంటూ.. మోడీ సర్కారుకు అన్ని విధాలా సహకరించాయి. అయితే ఈ సారి అలా బయట నుంచి మద్దతు తీసుకోవడం కంటే. ఎంపీలను పార్టీలో చేర్చుకోవడమే మేలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారంట. ఏపీలో టీడీపీ, జనసేనలకు వైసీపీ వాసన అంటేనే గిట్టదు. ఇప్పుడా రెండు పార్టీలు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ రాజ్యసభ ఎంపీల మద్దతు తీసుకుంటే.. కూటమిలో బీజేపీ పరిస్థితి డెలిగేట్‌గా మారుతుంది. అందుకే బయటనుంచి మద్దతు కంటే. వైసీపీ ఎంపీల్ని కలిపేసుకోవడమే బెటర్ అని బీజేపీ బాస్‌లు భావిస్తున్నారంట. గతంలో టీడీపీ రాజ్యసభ పక్షాన్ని విలీనం చేసుకున్నట్లు వైసీపీని మెర్జ్ చేసుకోవాలని చూస్తున్నారంట. అదే సమయంలో జగన్ తీరుతో తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్న పలువురు వైసీపీ ఎంపీలు బీజేపీతో టచ్ లోకి వెళ్లారంటున్నారు. పరాజయం పాలైనా వైసీపీ అధినేత జగన్ స్టైల్ మారడం లేదన్న అసంతృప్తి ఎంపీల్లో కనిపిస్తోందంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పడు తాడేపల్లి ప్యాలెస్‌లోకి నలుగురైదుగురికే డైరెక్ట్ ఎంట్రీ ఉండేది. సజ్జల, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, విజయసాయి వంటి వారు మాత్రమే డైరెక్ట్‌గా జగన్‌తో మాట్లాడగలిగే వారంటారు. ఇక మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు జగన్‌ని కలవాలంటే అపాయింట్‌మెంట్ కోసం పడిగాపులు పడాల్సి వచ్చేది. ఇప్పుడు ఓడిపోయాక కూడా జగన్ అదే వైఖరి ప్రదర్శిస్తుండటం రాజ్యసభ ఎంపీలకు మింగుడుపడటం లేదంట. నలభై అయిదు రోజుల వ్యవధిలో జగన్ నాలుగో సారి బెంగళూరు ప్యాలెస్‌కు వెళ్లిపోయారు. దాంతో ఆయన ఎఫ్పుడు తాడేపల్లిలో ఉంటారో? ఎప్పుడు యలహంక కోటకు వెళ్తారో? అంతుపట్టక అసలు పార్టీ భవితవ్యం ఏంటో అర్థంకాక ఎంపీలు తమ రాజకీయ భవిష్యత్తుపై బెంగ పెట్టుకుంటున్నారంట. రాష్ట్రంలో శాంతి భద్రతలు అద్వానం అంటూ జగన్ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ధర్నా అట్టర్ ప్లాప్ కావడం, గత ఐదేళ్లలో ఇష్టారాజ్యంగా నాయకులు దోచుకున్నట్లు రోజుకోక కుంభకోణం బయటపడుతుండటంతో వైసీపీ నేతల్లో భయాలు మొదలయ్యాంట. ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి కారణం జగన్ వైఖరే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దాంతో ఇక ఆయనతో ఉంటే తమ ఫ్యూచర్‌కే ప్రమాదమని వైసీపీ ఎంపీలు పార్టీ మారే యోచనలో ఉన్నారంటున్నారు. ఇంకా వైసీపీతో, జగన్ తో అంటకాగితే రాజకీయ జీవితం సమాధి కావడం తప్ప మరో ప్రయోజనం ఉండదని భావిస్తున్నారంట.. అయితే వారు టీడీపీ, జనసేనల వైపు ఆశగా చూస్తున్నా అటు నుంచి ఎలాంటి పాజిటివ్ సంకేతాలు రావడం లేదంట. తెలుగుదేశం, జనసేనలతో టచ్ లోకి వెళ్లేందుకు దారులు కనపడక .. బీజేపీ ద్వారా ఆ పార్టీలకు దగ్గర కావాలన్న ప్రయత్నాలు మొదలెట్టారని అంటున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యులు టీడీపీ, జనసేనల్లో ఏ పార్టీ తీర్థం పుచ్చుకున్నా రాజ్యసభలో ఎన్డీఏ సర్కారుకి ప్లస్సే అందుకే బీజేపీ నేతలు కూడా రాయబారం నడిపే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్న వైసీపీకి 8 మంది హ్యాండ్ ఇస్తే ఇక పార్టీ విలీనమైనట్లే.. మొత్తమ్మీద త్వరలోనే జగన్‌కి రాజ్యసభ ఎంపీల షాక్ తగలబోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.