YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

చక్రం తిప్పేస్తున్న పొంగులేటీ

చక్రం తిప్పేస్తున్న పొంగులేటీ

ఖమ్మం, ఆగస్టు 6,
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మంత్రి కొండా సురేఖ సీనియర్‌ నాయకురాలు. తొలి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న సురేఖ మధ్యలో పార్టీ మారినా… కాంగ్రెస్‌లో తానే సిన్సియర్‌ లీడర్ అని భావిస్తుంటారు. ఇక జిల్లాలో తన మాటే చెల్లుబాటు కావాలన్నట్లు సురేఖ రాజకీయం చేస్తుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉండగా, జిల్లాలో మంత్రి సురేఖ చక్రం తిప్పారు. ఇక వైఎస్‌ మరణాంతరం పార్టీలు మారినా… 2018 ఎన్నికలకు ముందు సొంత గూటికి చేరారు సురేఖ. ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డికి మద్దతుగా నిలిచి…. మరోసారి మంత్రి పదవి చేపట్టారు. ఇంతవరకు అంతా తాను అనుకున్నట్లే చక్రం తిప్పిన సురేఖ ఈ మధ్య తన మాట చెల్లుబాటు కావడం లేదని ఫీల్‌ అవుతున్నారట… జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించడం… అంతా ఆయన అనుమతి ప్రకారమే నడుచుకోవాలని సీఎం సూచించడంతో సురేఖ చేతులు కట్టేసినట్లైందని చెబుతున్నారు ఆమె అనుచరులు. తన సొంత నియోజకవర్గానికి సంబంధించిన నిర్ణయాలను కూడా తాను స్వయంగా తీసుకోలేకపోవడం వల్ల రాజకీయంగా నష్టం జరుగుతోందని మంత్రి సురేఖ ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు.ముఖ్యంగా గ్రేటర్‌  వరంగల్‌ నగరాభివృద్ధిలో తన ప్రమేయం తగ్గిపోతుందని మంత్రి సురేఖ మదనపడుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అదేవిధంగా తన నియోజకవర్గానికి చెందిన మేయర్‌ గుండు సుధారాణి కాంగ్రెస్‌లో చేరిన విషయం తనకు తెలియజేయలేదని మంత్రి బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమే ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో మంత్రి సురేఖ ఫోన్‌లో వాదులాటకు దిగడం ఆ మధ్య వైరల్‌గా మారింది.కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండగా, తాను మంత్రిగా పనిచేస్తుండగా, తన జిల్లా.. తన నియోజకవర్గంలో తన ప్రమేయం లేకుండా నిర్ణయాలు జరిగిపోతుండటమే మంత్రి సురేఖకు అసంతృప్తికి గురిచేస్తోందని చెబుతున్నారు. అదేవిధంగా ఇటీవల కాకతీయ యూనివర్సిటీలో కొన్ని టెండర్ల వ్యవహారంలోనూ తమకు సమాచారం లేదని మంత్రితోపాటు, కొందరు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పొంగులేటికి ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించినా.. తమ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటే బాగుండేదని… మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నట్లు చెబుతున్నారు.జిల్లాలో అందరూ సీనియర్లే కావడం… పైగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో నేరుగా సంబంధాలు ఉండటంతో ఎవరూ ఈ విషయంలో బహిరంగ వ్యాఖ్యలు చేయనప్పటికీ… మంత్రి పొంగులేటి తమను కలుపుకుని వెళితే ఇంకా బాగుంటుందని చెప్పుకుంటుండటమే హాట్‌టాపిక్‌గా మారింది. మంత్రులు, ఎమ్మెల్యేల ఆవేదన ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి దృష్టికి వెళ్లిందో? లేదో? కానీ, ఉమ్మడి  వరంగల్‌లో ఏ ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు కలిసినా ఇదే విషయం చర్చించుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రుల అసంతృప్తిని ఎలా సరిదిద్దుతారనేది ఆసక్తికరంగా మారింది.

Related Posts