YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కూలిపోయిన సినిమా చెట్టు...

కూలిపోయిన సినిమా చెట్టు...

రాజమండ్రి, ఆగస్టు 6
గోదారి గట్టుంది...గట్టుమీద చెట్టు ఉంది..చెట్టుకొమ్మన పిట్టుంది పాట విన్నాం కదా ఆ చెట్టు ఏదో కాదు..వందలాది సినిమాల్లో కనిపించి  సినిమా చెట్టుగా యమ ఫేమస్‌ అయిన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కుమారదేవం గ్రామంలో ఏటిగట్టును ఉన్న నిద్రగన్నేరు చెట్టే. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఏ సినిమాలో అయినా సరే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లు ఉన్నా లేకపోయినా...ఈ చెట్టు క్యారెక్టర్‌ మాత్రం ఉండాల్సిందే. అంత ఫేమస్ అయిన ఈ సినిమా చెట్టు శాశ్వతంగా షూటింగ్‌లకు పేకప్‌ చెప్పేసింది. గోదావరి వరదలకు కుప్పకూలిపోయింది.పాతతరం మూగమనసులు నుంచి నేటితరం రంగస్థలం వరకు వందకుపైగా సినిమాల్లో కనిపించి గోదావరి ఏటిగట్టును అందంగా మార్చిన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కుమారదేవం గ్రామంలోని సినిమా చెట్టు కూలిపోయింది. దాదాపు శతాబ్ధంన్నర పాటు గ్రామప్రజలకు నీడనివ్వడమేగాక...వందకు పైగా చిత్రాల్లో కనిపించి గోదావరి జిల్లావాళ్లకే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సినిమా చెట్టు(శాశ్వతంగా కనుమరుగైంది. గోదావరి వరదలకు ఏటిగట్టు కోతకు గురవ్వడంతో ఈ చెట్టు నిట్టనిలువుగా చీలిపోయి పడిపోయింది.  
సినిమా షూటింగ్‌లకు ఫేమస్‌
పాతతరం సినిమాల్లో గోదావరి అందాలను చూపించాలన్నా...హీరో కోసం హీరోయిన్ ఏటివైపు ఎదురుచూడాలన్నా...బ్యాక్‌డ్రాప్‌లో ఈ చెట్టు ఉండాల్సిందే. మూగమనసులు చిత్రంలో జమున( ఆడిపాడింది ఈ చెట్టుకిందే. అలాగే సీతారామయ్యగారి మనుమరాలు చిత్రంలో సమయానికి తగు మాటలాడి పాట మొత్తం ఈ చెట్టు కిందే చిత్రీకరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చెట్టు కింద తీసిన చిత్రాల జాబితా వందకు పైగా చేరుతుంది. కళాతపస్వి విశ్వనాథ్‌, అగ్రదర్శకులు దాసరి, రాఘవేంద్రరావు,జంధ్యాలతోపాటు తూర్పుగోదావరి జిల్లా వాసి అయినటువంటి ఈవీవీ సినిమాల్లో ఈ చెట్టును చాలా అందంగా చూపించారు. గలగలపారే గోదావరి ఏటి సవళ్లు ఒకవైపు ఆ పక్కనే గట్టుమీద విశాలమైన పచ్చని నిద్రగన్నేరు చెట్టు...దాని కింద అరుగు. ఇంతకన్నా గోదావరి పల్లెను అందంగా చూపించడానికి ఏం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్క సినీ దర్శకుడు కనీసం ఒక్క సీను అయిన ఈ చెట్టుకింద, దీని పరసరాల్లో తీయాలని అప్పట్లో ఉవ్విళ్లూరేవారు. పెద్దపెద్ద హీరోలు సైతం ఈ చెట్టుకింద నటించారు. ఇక గోదావరి అంటే పడిచచ్చిపోయే వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు గోదావరి అన్నా...ఆ ఏటిగట్లు అన్నా, ఆ పల్లెలన్నా వల్లమాలిన పిచ్చి. ఇక ఇంత ఫేమస్‌ అయిన ఈ సినిమా చెట్టును ఎందుకు వదులుతాడు. అందుకే ఆయన ఏకంగా ఈ చెట్టుకింద 18 సినిమాలు చిత్రీకరించాడంటే ఆ చెట్టు అంటే ఆయనకు ఎంత ప్రాణమో చెప్పాల్సిన పనిలేదు. వంశీ ఈ ప్రాంతానికి వస్తే చాలు షూటింగ్ లేకపోయినా ఆ చెట్టుకిందకు చేరి మధ్యాహ్న భోజనం అక్కడే చేసేవాడంటే ఈ చెట్టంటే ఆయనకు ఎంత ప్రాణమో చెప్పాల్సిన పనిలేదు. ఏటిగట్టు పైనుంచి గోదవారిలో పారే నీటిని తాకుతూ ఉండే ఈ చెట్టు కొమ్మలు చూస్తుంటే ఎంతో చూడముచ్చటగా ఉంటుందని వంశీ చెప్పేవారన్నారు.
రక్షణ కరవు
సినిమా చెట్టుగా ఎంతో ఫేమస్ అయిన ఈ చెట్టును రక్షించాలని...వరద తాకిడికి ఏటిగట్టు కోతకు గురవ్వకుండా చుట్టూ రాతికట్టడం కట్టించాలని ఈ గ్రామప్రజలు ఎన్నోసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దశాబ్దాల తరబడి ఎన్నో చిత్రాల్లో కనిపించి కనువిందు చేసిన ఈ చెట్టును కాపాడుకుని పర్యాటకంగా తీర్చిదిద్దాలని కోరారు. అయినప్పటికీ పాలకులు పట్టించుకోకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు వరదనీరు పోటెత్తి...గోదావరి ఏటిగట్టు కోతకు గురైంది. దీంతో ఈ సినిమా చెట్టు నిట్టనిలువుగా చీలిపోయి కూలిపోయింది.ఈ సినిమా చెట్టును 150 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన శింగులూరి తాతబ్బాయి అనే వ్యక్తి నాటాడని గ్రామస్తులు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ చెట్టును గ్రామస్తులు సంరక్షించుకుంటూ వస్తున్నారు. గోదావరికి ఎన్నో వరదలు వచ్చినా, భీకరగాలులు వీచినా చెక్కుచెదరని ఈ చెట్టు...ఏటిగట్టు కోతకు గురవ్వడంతో కూకటి వేళ్లతో సహా కూలిపోయింది.

Related Posts