YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కోర్టుల్లో పిటిషన్ల వెనుక జగన్ వ్యూహం ఏమిటి ?

కోర్టుల్లో పిటిషన్ల వెనుక జగన్ వ్యూహం ఏమిటి ?

విజయవాడ, ఆగస్టు 7
వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి  ఇటీవలి కాలంలో రెండు అంశాల్లో కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. అందులో ఒకటి తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకర్‌ను ఆదేశించాలని .. మరొకటి తనకు సీఎం స్థాయి సెక్యూరిటీ కల్పిచాలని ఆదేశించాలని కోరుతూదాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లు కాస్త అతిశయంగా ఉన్నాయని కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికి అర్థమవుతుంది. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోర్టులు ఆదేశించలేవు...  అలాగే సీఎంలకు మాత్రమే సీఎం స్థాయి సెక్యూరిటీ ఇస్తారు కానీ ఇతరులకు ఇవ్వరు. ఈ విషయాలపై కనీస అవగాహన జగన్ లీగల్ టీమ్‌కు ఉండదా ..?.  అయినా ఎందుకు పిటిషన్లు దాఖలు చేశారు ?చీఫ్ మినిస్టర్ అంటే ప్రభుత్వాధినేత. ఆయనకు ఇచ్చే  భద్రతను ప్రతిపక్ష నేత హోదా కూడా లేని తనకు కేటాయించాలని..  తాను సీఎంగా ఉన్నప్పుడు అంటే జూన్ మూడో తేదీన తనకు ఉన్న సెక్యూరిటీని తనకు కల్పించాలని జగన్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.  రాజకీయ నేతలకు హోదాల ప్రకారం భద్రత కల్పించేందుకు పక్కా నిబంధనల ఉన్నాయి. అలాగే పోలీసు డిపార్టుమెంట్ సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఉంటుంది. ఎవరికి భద్రత. .. ఎంత మేర కల్పించాలో డిసైడ్ చేస్తారు. జగన్ మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తున్నారు. కానీ జగన్ తనకు సీఎం స్థాయి సెక్యూరిటీ కావాలని.. కనీసం 900 మందితో సెక్యూరిటీ కల్పించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇది చాలా అతిశయోక్తిగా ఉందని.. కోర్టు ఏ విధంగానూ ఆయనకు సీఎం రేంజ్ సెక్యూరిటీ కల్పించాలని ఆదేశించలేదని టీడీపీకి చెందిన న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. 2019లో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత ఆయన సెక్యూరిటీని భారీగా తగ్గించారు.  ఫోర్ ప్లస్ ఫోర్‌కు తగ్గించారు. చంద్రబాబుకు కేంద్ర ప్రభత్వం ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ కల్పించింది. దేశంలో అతి కొద్ది మందికి మాత్రమే ఈ సెక్యూరిటీ ఉంటుంది. ఆయనపై ఓ సారి నక్సల్స్ హత్యాయత్నం చేశారు. ఇంత క్రిటికల్ అయినప్పటికీ చంద్రబాబుకు రాష్ట్ర పరంగా భద్రత తగ్గించారు.  ఎన్‌ఎస్జీ భద్రత ఉన్నప్పటికీ ఆయనపై రాళ్ల దాడులు జరిగాయి. ఆ రాళ్లు వేయడాన్ని అప్పటి డీజీపీ ప్రజాస్వామ్య ప్రక్రియలో నిరసనగా చెప్పి సమర్థించారు కూడా.  కుప్పంలో.. అంగళ్లులో.. మార్కాపురంలో..  నందిగామలో చంద్రబాబుపై రాళ్ల దాడులు జరిగాయి. ఆ సమయంలో భద్రతాధికారులు గాయపడ్డారు కూడా. తన సెక్యూరిటీపై చంద్రబాబు పలుమార్లు  హైకోర్టుకు వెళ్లారు.  కానీ నిబంధనల ప్రకారం   భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది.  చివరికి భద్రత సరిపోవడం లేదని కేంద్రం ఎన్ఎస్‌జీ సిబ్బందిని రెట్టింపు చేయాల్సి వచ్చింది.  చంద్రబాబుకు ఇవ్వలేని సెక్యూరిటీ ఇప్పుడు తనకు కావాలని జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ కొసమెరుపేమిటంటే జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు.జగన్ మాజీ సీఎం హోదాలో మాత్రమే ఉన్నారు.  ప్రతిపక్ష నేతగా కూడా లేరు. ఆ హోదా కూడా కోర్టే ఇప్పించాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.  ఆ పిటిషన్‌కు అసలు విచారణ అర్హతా ఉందా లేదా అన్నది తేల్చాలని కోర్టు నిర్ణయించింది. ఒక వేళ విచారణ అర్హత ఉంటే... అప్పుడు తదుపరి విచారణ జరుపుతారు. కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి జరిగిన .. జరుగుతున్న రాజకీయాలను చూస్తే... స్పీకర్ ను ఏ విషయంలోనూ ముఖ్యంగా సభా వ్యవహారాల విషయంలో కోర్టులు ఆదేశించలేవని అర్థం చేసుకోవచ్చు. జగన్ కు సాధారణంగా ప్రతిపక్ష నేత హోదాకు అర్హత ఉంటే.. రాజ్యాంగపరంగా లభిస్తుంది. అలాంటి చాన్స్ లేదు కాబట్టే ఆయన కోర్టుకు వెళ్లారు.  పదేళ్లుగా కేంద్రంలో ప్రతిపక్ష గుర్తింపు ఉన్న పార్టీ లేదు.  అక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇలాంటి పిటిషన్లు దాఖలైనా అనుకూల ఫలితం రాకపోతే సైలెంట్ అయిపోయారు. అందుకే జగన్ వేసిన పిటిషన్‌కు విచారణార్హతే ఉండనది టీడీపీ గట్టిగా వాదిస్తోంది. వైసీపీ అధినేత రాజకీయ వ్యూహంలో భాగంగా న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తున్నారన్న అభిప్రాయం  వినిపిస్తోంది. కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగిలితే  వైసీపీ నేతలు సహజంగానే చంద్రబాబు కోర్టుల్ని మేనేజ్ చేశారన్న ప్రచారాన్ని ప్రారంభిస్తారు. గతంలో పలుమార్లు ఇదే తరహా ఆరోపణలు చేశారు. అదే సమయంలో తమకు న్యాయం జరగడం లేదని ప్రజల వద్దకు వెళ్లి సానుభూతి కోసం ప్రయత్నించేందుకు ఓ అస్త్రంగా వాడుకుంటారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే ఎదురు దెబ్బలు తగులుతాయని తెలిసి కూడా అసాధారణమైన పిటిషన్లు దాఖలు చేస్తున్నారని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి.

Related Posts