YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇలా అయితే ఎలా...

ఇలా అయితే ఎలా...

హైదరాబాద్, ఆగస్టు 7,
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. పార్టీ క్యాడర్ ను కూడా ఆయన పట్టించుకోవడం లేదు. కనీసం ప్రజల ముందుకు వచ్చేందుకు కూడా ఆయన ఇష్టపడటం లేదు. ప్రస్తుతం ఎన్నికలు లేవు కాబట్టి ఆయన వచ్చినా ఏం ప్రయోజనం అంటున్నారు పార్టీ నేతలు. అనవసర ఖర్చు తప్పించి ఎందుకు ఆయన బయటకు రావడం అంటూ కొందరు నేరుగానే చెబుతున్నారు. మరో వైపు పార్టీ నేతలు వరసగా వీడి వెళ్లిపోతున్నా ఆయన తన ఇంట్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమవుతున్నారు కానీ జనంలోకి వచ్చి పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేయడంలేదు. పార్లమెంటు ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన కేసీఆర్ ఆ తర్వాత అసెంబ్లీలో ఒకరోజు తళుక్కుమని మెరిసి మాయమయిపోయారు. నిజానికి జనంలో పట్టు సంపాదిస్తేనే నేతల వలసలు ఆగుతాయి. జనంలోకి కేసీఆర్ వస్తున్నారంటే అప్పుడు నేతల్లో కూడా ఒకింత భయం ఏర్పడుతుంది. తాము పార్టీ మారితే నియోజకవర్గాల్లో ఏమవుతుందోనన్న ఆందోళన వారిలో కలుగుతుంది. పార్లమెంటు ఎన్నికల్లో తన సొంత జిల్లా మెదక్ ను కూడా చేజార్చుకోవాల్సి వచ్చింది. ఒక్క పార్లమెంటు సీటు కూడా రాకపోయె. ఇంతదారుణమైన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. ఢిల్లీలో ఆర్భాటంగా బీఆర్ఎస్ పార్టీని ప్రారంభించిన కేసీఆర్ హస్తిన వైపు కూడా చూడటం లేదు. అసలు పార్టీ కార్యాలయం అక్కడ ఉందా? లేదా? అన్న డౌట్ కూడా చాలా మందిలో కలగక మానదు.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు మీద ఉంది. రైతు రుణమాఫీ అమలు చేసింది. అయితే కొందరికే దక్కిందన్న ప్రచారం జరుగుతుంది. రైతులు కూడా కొన్ని చోట్ల ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ బయటకు వచ్చి రైతులకు అండగా నిలబడాల్సిన పరిస్థితి ఉంది. కింది స్థాయి క్యాడర్ లో కూడా కేసీఆర్ బయటకు రావాలని కోరుకుంటున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఇప్పుడు వచ్చి చేసేదేమీ లేదన్న ధోరణితో ఉన్నారు. కేటీఆర్, హరీశ్ రావులు చూసుకుంటారులే అన్న ధీమాలో ఉన్నారు. ఆయన వస్తే కొంత ప్రభుత్వానికి చెక్ పెట్టవచ్చన్న భావన కనిపిస్తుంది. నేతలు కూడా అదే కోరుకుంటున్నారు. కానీ కేసీఆర్ మాత్రం బయటకు కనిపించడానికి ఇష్టపడటం లేదు.  మొన్నటి వరకూ కాలు బాగా లేక ఆయన విశ్రాంతి తీసుకున్నారని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్యానికి ఢోకా లేదు. కనీసం జిల్లాల పర్యటనలు చేస్తే క్యాడర్ లో ధైర్యం ఉంటుంది. నూతన నాయకత్వానికి కొంత చేయూత నిచ్చినట్లవుతుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సమయంలో వస్తే జనం పెద్దగా నమ్మరు. అందుకే ఇప్పుడే కేసీఆర్ తమ ఇలాకాకు వస్తే పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశముందని నేతలు భావిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఇంటి నుంచి కాలు బయటపెట్టడం లేదు. మరి ఎప్పటికి కారు పార్టీ తిరిగి బలం పుంజుకుంటుందన్న భావన గులాబీ శ్రేణుల్లో నెలకొని ఉంది.

Related Posts