అమరావతి,
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు పూర్తైనా. ఇప్పటివరకు రాష్ట్రానికి సరైన రాజధాని లేదు. 2015 అక్టోబర్‌లో అమరావతి రాజధాని నిర్మాణానికి పునాది పడింది. ఆ తర్వాత రాజధాని ప్రాంతంలో రహదారుల నిర్మాణం, భవనాల నిర్మాణం చేపట్టారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అభ్యంతరం చెప్పకపోవడంతో అమరావతి నిర్మాణం పనులు మరింత వేగం పుంజుకుంటాయని అంతా భావించారు. కానీ మూడు రాజధానుల పేరిట జగన్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ వచ్చింది. దీంతో ఇప్పటివరకు ఏపీకి నిర్ధిష్ట రాజధాని లేకుండా పోయింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి భారీ విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దీంతో రాజధాని నిర్మాణంపై ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అమరావతి నిర్మాణంపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అమరావతి ప్రాంతంలో ప్రపంచస్థాయి రాజధాని నిర్మించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.