విశాఖపట్టణం, ఆగస్టు 8,
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత ఇప్పుడిప్పుడే వైసిపి కోలుకుంటోంది. ఇప్పుడిప్పుడే పార్టీ శ్రేణులు గాడిలో పడుతున్నాయి. అయితే ఓటమి మాత్రం నేతల్లో నైరాశ్యం పెంచింది. కోలుకొని పూర్వవైభవం సాధిస్తుందని ఎక్కువమంది భావించడం లేదు. అధినేత జగన్ వైఖరి భిన్నంగా ఉండడమే అందుకు కారణం. పైగా జాతీయస్థాయి రాజకీయాలు ఏపీపై ప్రభావం చూపుతున్నాయి. అందుకే పార్టీలో ఉండడం కంటే.. వేరే పార్టీలో చేరడం ఉత్తమమని చాలామంది ఒక నిర్ణయానికి వస్తున్నారు. అధికార పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఆ పార్టీలో చేరిపోతున్నారు. 2019 ఎన్నికల్లో 151 స్థానాలు విజయం సాధించింది వైసిపి. 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారింది. కేవలం 11 స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితం అయ్యింది. క్యాడర్ కు ఊహించని పరాజయం ఎదురు కావడంతో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు సైతం వైసీపీని వీడెందుకు సిద్ధపడుతున్నారు. పెద్ద నేతలు సైతం ఇప్పటికే పార్టీని వీడెందుకుసిద్ధంగా ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సినీ నటుడు అలీ వైసీపీకి గుడ్ బై చెప్పారు. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు కిలారి రోశయ్య, మద్దాలి గిరి వైసిపికి రాజీనామా ప్రకటించారు. ప్రకాశం జిల్లాకు చెందిన శిద్దా రాఘవరావు సైతం పార్టీని వీడారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానున్నారు. ఆయన కుమారుడును టిడిపిలోకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చాలామంది వైసీపీ సీనియర్లు రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధపడుతున్నారు వైసీపీ నుంచి చేరికల విషయంలో కూటమి పార్టీలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటున్నాయి. గత ఐదేళ్లుగా వైసిపి హయాంలో ఇబ్బంది పెట్టిన నేతలను చేర్చుకోకూడదని భావించాయి.కానీ విశాఖ జిల్లాలో ఎన్నికల దృష్ట్యా స్థానిక వైసిపి ప్రజాప్రతినిధులను కూటమి పార్టీల్లోకి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం. అందులో భాగంగా విశాఖ నగరపాలక సంస్థలో ఐదుగురు వైసిపి కార్పొరేటర్లు జనసేనలో చేరారు. ఇప్పటికే 12 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడారు. ఈ ఐదుగురితో కలుపుకుంటే ఆ సంఖ్య 17 కు చేరనుంది. అదే జరిగితే విశాఖ నగరపాలక సంస్థ టిడిపి కూటమి కైవసం చేసుకోవడం ఖాయం.మరోవైపు విశాఖ నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగనున్నాయి. విజయవాడ, కర్నూలు నగరపాలక సంస్థల్లో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసిపి విజయం సాధించింది. వాస్తవానికి అక్కడ వైసీపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. టిడిపి కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలిచేసరికి వైసిపి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది. అందుకే విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల విషయాన్ని టిడిపి కూటమి సీరియస్ గా తీసుకుంది. కార్పొరేటర్లు పార్టీలో చేరిన తర్వాత పవన్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు.విశాఖ స్థాయి సంఘఎన్నికల్లో టిడిపి కూటమి గెలవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.ప్రస్తుతం విశాఖలో రెండు ఎన్నికలు జరగనున్నాయి. ఒకటి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, రెండోది స్థానిక సంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. ఇప్పటికే వైసీపీ మాజీమంత్రి బొత్స సత్యనారాయణ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈనెల 30న పోలింగ్ జరగనుంది. కూటమి పార్టీలు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విశాఖలో వైసిపి ప్రజాప్రతినిధుల చేరికలు పెరగడం విశేషం.
క్యాంప్ పాలిటిక్స్... ప్రారంభం
జిల్లాలో రాజకీయ వాతావరణం.. టోటల్ ఏపీనే వేడిఎక్కింది. అటు GVMC స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, ఇటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార ఎన్డీఏ కూటమి ప్రతిపక్ష వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఎలాగైనా ఈ రెండు ఎన్నికల్లో గెలిచి తీరాలనే లక్ష్యంతో అప్పుడే క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టాయి. 97 మంది కార్పొరేటర్లు ఉన్న జీవీఎంసీలో 10 వార్డులకు ఒకరు చొప్పున మొత్తం 10 మందిని స్టాండింగ్ కమిటీగా ఎన్నుకుంటారు. బుధవారం జరిగే ఈ GVMC స్టాండింగ్ కమిటీ ఎన్నికలో క్లీన్ స్వీప్ చేయాలని అటు కూటమి, ఇటు వైసీపీ నేతలు వ్యూహ ప్రతి వ్యూహాల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే వైసీపీకి చెందిన 12 మంది టీడీపీ, జనసేన వైపు వెళ్లారు. తాజాగా విశాఖకు చెందిన ఐదుగురు వైసీపీ కార్పొరేటర్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. మరికొంత మంది వైసీపీ కార్పొరేటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో GVMC స్టాండింగ్ కమిటీ ఎన్నిక రసకందాయంలో పడింది. బలం లేకపోయినా అక్రమంగా గెలిచేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు ఎంపీ విజయసాయిరెడ్డిమరోవైపు విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఈ ఎన్నికని పాలక, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని ఇప్పటికే వైసీపీ ఖరారు చేసింది. ఆర్ధికంగా, సామాజికంగా బలమైన నేత కావడం.. స్థానిక సంస్థల ప్రతినిధులను ప్రభావితం చేయగలుగుతారన్న నమ్మకంతో బొత్సవైపే వైసీపీ అధినేత జగన్ మొగ్గు చూపారు. టీడీపీ అభ్యర్థిగా పీలా గోవింద్ పేరు దాదాపు ఖరారయ్యే అవకాశం ఉంది.సంఖ్యా పరంగా చూస్తే విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కంటే వైసీపీకి మూడురెట్ల బలం ఉంది. కానీ కూటమి నేతలు ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నివాసంలో సమావేశానికి అరకు, పాడేరు నుంచి దాదాపు 60 మంది వైసీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు హాజరయ్యారు. మరికొంతమందిని టచ్‌లోకి తెచ్చుకునే వ్యూహాల్లో ఉన్నారు కూటమి నేతలు. అటు.. వైసీపీ సైతం అప్రమత్తమైంది. ఓటు హక్కు ఉన్న సభ్యులతో వైసీపీ అధినేత జగన్ బుధవారం సమావేశం కానున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైసీపీ నేతలతో ఇప్పటికే బొత్స భేటీ అయ్యారు. బలం లేకపోయినప్పటికీ డబ్బుతో ఓట్లు కొనాలని చంద్రబాబు చూస్తున్నారనీ.. ఇది మంచి పద్ధతి కాదనీ అన్నారు బొత్స సత్యనారాయణ. మొత్తంగా ఇరువర్గాల వ్యూహ, ప్రతివ్యూహాలతో రాజకీయం రంజుగా సాగుతోంది. పోటాపోటీ సమావేశాలు, శిబిరాలతో రాజకీయం హాట్ హాట్‌గా నడుస్తోంది.