విజయవాడ, ఆగస్టు 8,
గతం మాదిరిగా తనకు భద్రత కల్పించాలని మాజీ సీఎం జగన్ కోరుతున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గత ఐదేళ్లుగా ఆయనకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండేది. కానీ ఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సీన్ మారింది. జగన్ కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో ప్రోటోకాల్ ప్రకారం భద్రతను తగ్గించింది. అయితే రాజకీయ దురుద్దేశంతోనే తనకు భద్రత తగ్గించారని జగన్ వాపోయారు. పలుమార్లు బాహటంగానే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో తాజాగా ఆయన భద్రతను పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. జగన్ భద్రతపై చర్చ నడుస్తోంది. అసలు జగన్ కు ఎంత మంది భద్రత కల్పించేవారు? దాని కయ్యే ఖర్చు ఎంత? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య దీనిపై వార్ నడుస్తోంది. తాము నిబంధనల మేరకు నడుచుకున్నామని.. అందులో ఎటువంటి సక్సెస్ సాధింపు లేదని ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. ఇందులో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని తేల్చి చెప్పారు. అయితే తనకు ఎట్టి పరిస్థితుల్లో జూన్ 3 ముందు ఉన్నట్టుగానే భద్రత కల్పించాలని జగన్ వాదిస్తున్నారు. ఏకంగా హైకోర్టు తలుపు తట్టారు. న్యాయస్థానం తీర్పు ఎలా వస్తుందో చూడాలి. అయితే జగన్ కు భద్రత ఎందుకు తగ్గింది? అందుకు గల కారణాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. కోర్టుకు తెలియజేయనుంది. న్యాయస్థానానికి అన్ని వివరాలు తెలియజేసింది. జగన్ కు కల్పిస్తున్న భద్రత, అందుకు అయ్యే ఖర్చు వివరాలను బయటపెట్టారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు. మాజీ సీఎం జగన్ భద్రతకు ఏటా 90 కోట్లు అవసరమా అని ప్రశ్నించారు. మొత్తం 900 మంది భద్రతా సిబ్బందికి నెలకు రూ. 7.50 కోట్లు ఖర్చవుతుందని.. ఏడాదికి 90 కోట్లు ఖర్చు అవుతుందని లెక్కలు చెబుతున్నాయని చెప్పుకొచ్చారు. జగన్ ప్రాణాలకు ప్రజల వల్ల ముప్పు లేదని.. ప్రతిపక్షంలో ఉన్న ఆయన ప్రజలతో కలిసి వెళ్లాల్సిన సమయం వచ్చిందన్నారు. 900 మంది సెక్యూరిటీని పెట్టుకుంటే ఆయన ఎక్కడికి వెళ్ళగలరని? ప్రజలను ఎలా కలుస్తారని? ఆయనను ఎవరు ముట్టుకుంటారని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. అంతటితో ఆగని రఘురామ విదేశాల్లో ఉన్న ఆయన కుమార్తెలకు భద్రత అవసరమా అంటూ ప్రశ్నించారు. మరోవైపు ఈ ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత సైతం స్పందించారు. ఓ మాజీ ముఖ్యమంత్రికి 980 మందితో భద్రత అవసరమా అని ప్రశ్నించారు. భద్రతా సిబ్బంది సంఖ్య చూస్తే ఓ చిన్న గ్రామం ఓటర్లతో సరిపోతుందని ఎద్దేవా చేశారు. సీఎం స్థాయిలో భద్రత ఎలా కల్పిస్తామని ప్రశ్నించారు. జగన్ కు కోడి కత్తి కేసు ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని నిలదీశారు. ప్రస్తుతం హోమ్ శాఖ మంత్రి అనిత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అనవసరంగా జగన్ భద్రత విషయంలో అభాసు పాలవుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు భద్రత ఉంది. ఓడిపోయిన వెంటనే ఆయన ప్రైవేటు భద్రత సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. తనకు ప్రభుత్వ భద్రత అవసరం లేదన్నట్టు వ్యవహరించారు. ఇప్పుడు మాత్రం సీఎం హోదాతో సమానంగా తనకు భద్రత కల్పించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే జగన్ చేసిన నిర్వాకంతో.. ఆయన భద్రత కోసం ఏకంగా ఏడాదికి 90 కోట్లు అవుతున్న విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.