గుంటూరు, ఆగస్టు 8,
వైసీపీ అధినేత జగన్ కొత్త ప్లాన్ ఏంటి? చంద్రబాబు సర్కార్‌ను ఇబ్బందిపెట్టడమేనా? జగన్ వేసిన కొత్త పాచికలు వర్కవుట్ అయ్యేనా? మళ్లీ బూమరాంగ్ అయ్యేనా? జగన్ ఎత్తుకు సీఎం చంద్రబాబు పైఎత్తు వేస్తున్నారా? ఇంతకీ ఆ స్కెచ్ ఏంటి? వైసీపీ అధినేత, మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జగన్ కొత్త స్కెచ్ వేశారు. మా పార్టీ కార్యకర్తలపై పదే పదే దాడులు జరుగుతున్నాయంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మాజీ సీఎం. అంతర్గతంగా ఏపీలో ఎలాంటి దాడులు జరగకపోయినా.. టీడీపీ నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతే దాన్ని భూతద్దంలో చూపించాలన్నది అసలు ఆలోచన. జగన్ ఎత్తుగడలను ముందే పసిగట్టిన సీఎం చంద్రబాబు.. నేతలను, కార్యకర్తలను శాంతపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాడులకు దిగవద్దని, చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుందామని చెబుతున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కార్యకర్తల కంటే ముందు.. ఆ పార్టీ నేతలపై కూటమి సర్కార్ దృష్టిపెట్టింది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ సైతం కేడర్‌ను సముదాయిస్తున్నారు. ప్రజలు గెలిపించింది రివేంజ్ తీర్చుకునేందుకు కాదని, మంచి పాలన అందిస్తారని భావిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. గతంలో మనల్ని ఇబ్బందులు పెట్టినవారిపై కచ్చితంగా చర్యలు తప్పవని కుండబద్దలు కొట్టేశారు. జగన్ మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారీ నవ్వుకోవడం ఏపీ ప్రజల వంతైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు నెలలు అవుతోంది. ఇప్పటివరకు 30కి పైగానే హత్యలు జరిగాయంటూ మీడియా ముందు తెగ గగ్గోలు పెడుతున్నారు అధినేత. అల్లరి మూకల దాడిలో గాయపడిన కార్యకర్తలను మంగళవారం విజయవాడలో జగన్ పరామర్శించారు. హత్యకు గురైనవారి జాబితా ఇవ్వాలని మీడియా పదేపదే అడిగినప్పటికీ దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు.. చేస్తున్నారు పులివెందుల ఎమ్మెల్యే. నేతలు, బాధిత కుటుంబాలను పరామర్శించ డానికి వెళ్లిన జగన్.. కేవలం 30 సెకన్లు మాత్రమే వారి గురించి మాట్లాడారు. మిగతా 10 నిమిషాలు ఎప్పటి మారిదిగానే తమ ప్రభుత్వ పథకాల గురించి చెప్పడంతో.. నవ్వుకోవడం ప్రజల వంతైంది. మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారీ జగన్ కాస్త ఇబ్బందిపడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఒకప్పుడు నవ్వుతూ కూల్‌గా చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పేవారు. ఇప్పుడు అది మచ్చుకైనా కనిపించలేదని, మరి విషయం ఏంటో తెలీదంటున్నారు. జగన్‌కు ఏమైనా సమస్యలు ఉండే వుండవచ్చని ప్రత్యర్థుల నుంచి సెటైర్లు పడిపోతున్నాయి. మొత్తానికి జగన్ వేస్తున్న కొత్త పాచికలు సీఎం చంద్రబాబు ముందు చిత్తవుతున్నట్లు కనిపిస్తున్నాయి.