YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చార్జింగ్ సమయంలో ట్యాంపరింగ్....

చార్జింగ్ సమయంలో ట్యాంపరింగ్....

విజయవాడ, ఆగస్టు 9,
 దేశంలో మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. 400 పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ బరిలో దిగింది. బిజెపి ఒంటరిగా 300 స్థానాలు దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ బిజెపి ప్రయత్నాలు తలకిందులయ్యాయి. ఆ పార్టీ కేవలం 244 స్థానాలకి పరిమితం అయ్యింది. దీంతో మిత్రపక్షాలైన తెలుగుదేశం, జెడియు మద్దతుతో మోడీ మూడోసారి అధికారంలోకి రాగలిగారు. గత రెండు ఎన్నికల్లో సునాయాసంగా అధికారంలోకి వచ్చారు మోడీ. మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన స్థానాలను సొంతంగానే దక్కించుకున్నారు. అప్పట్లోనే ఈవీఎంల ట్యాంపరింగ్ పై రకరకాల అనుమానాలు నడిచాయి. అయితే గత రెండు ఎన్నికలకు భిన్నంగా.. బిజెపికి స్థానాలు తగ్గాయి. ఇండియా కూటమి పార్టీలకు సీట్లు పెరిగాయి. దీంతో జాతీయస్థాయిలో ఈవీఎంల ట్యాంపరింగ్ పై అనుమానాలు తగ్గాయి. కానీ ఏపీలో మాత్రం తెలుగుదేశం పార్టీ కూటమి ఏకపక్ష విజయం దక్కించుకోవడంతో కొత్త అనుమానాలు ప్రారంభమయ్యాయి. వై నాట్ 175 అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్లిన వైసిపి దారుణంగా దెబ్బతింది. ఆ పార్టీకి కేవలం 11 స్థానాలు వచ్చాయి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అయితే ఈ స్థాయి ఓటమి ఎదురయ్యేసరికి ఏపీలో వైసీపీ నేతలు ఈవీఎంల ట్యాంపరింగ్ పై అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై కూటమి పార్టీలు ఎదురు దాడి చేశాయి. 2019 ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ తోనే మీరు గెలిచారా అంటూ ప్రశ్నించేసరికి.. సోషల్ మీడియా వేదికగా రచ్చకు దారితీసింది.భారీ ఓటమితో వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తెర వెనుక ఏదో జరిగిందన్న అనుమానాలతో ఉన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 20వేల మెజారిటీ తగ్గకుండా.. 95 వేల వరకు గరిష్టంగా నమోదు కావడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఈవీఎంలలో కుట్ర జరిగిందన్న అనుమానాలతోనే ఎక్కువ మంది ఉన్నారు. మరోవైపు ఈవీఎంల చార్జింగ్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మే 13న పోలింగ్ జరిగింది. అక్కడకు మూడు వారాల తర్వాత జూన్ 4న ఓట్లను లెక్కించారు. అయితే విజయనగరం పార్లమెంట్ స్థానంలో చాలా ఈవీఎంలలో చార్జింగ్ 99% ఉన్నట్లు వైసీపీ నేతలు గుర్తించారు. దీనిపైనే అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు.విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్ ఈవీఎంల చార్జింగ్ పై ఫిర్యాదు చేశారు. విచారణ కోసం జూన్ 10న రూ. 94,400 ఫీజు కూడా చెల్లించారు. అలాగే ఒంగోలు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. 12 ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు గాను రూ. 5,66,400 ఫీజు చెల్లించారు. బొబ్బిలి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి శంబంగి చిన్న అప్పలనాయుడు కూడా ఇదే తరహాలో ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతల అనుమానాలను నివృత్తి చేయడానికి ఈనెల 25 నుంచి 28 వరకు ఈవీఎంలు తయారుచేసిన కంపెనీ ప్రతినిధులు, ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టనున్నారు.అయితే విచారణకు ముందు ఇప్పుడు ఎన్నికల అధికారుల వ్యవహరిస్తున్న తీరు హాట్ టాపిక్ గా మారుతోంది. చాలామంది అధికారులు నేరుగా ఫిర్యాదుదారులకు ఫోన్ చేసినట్లు సమాచారం. ఫిర్యాదులను వెనక్కి తీసుకుంటేచెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.తనకు నేరుగా ఎన్నికల అధికారులే ఫోన్ చేశారని.. విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్ చెబుతున్నారు. తాను మాత్రం ఫిర్యాదును వెనక్కి తీసుకోనని చెప్పినట్లు ఆయన చెప్పుకొస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts