YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

భారీగా తగ్గనున్న ఇంటర్ సిలబస్

భారీగా తగ్గనున్న ఇంటర్ సిలబస్

హైదరాబాద్, ఆగస్టు 9,
తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులపై సిలబస్ భారం తగ్గించే దిశగా ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు మొదలు పెట్టింది. జాతీయ నూతన విద్యా విధానం ప్రకారం.. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలనే లక్ష్యంతో సిలబస్‌లో మార్పులు చేయనుంది. నెల రోజుల్లో సబ్జెక్టుల నిపుణుల కమిటీల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆయా కమిటీలు ద్వారా వచ్చే సూచనల ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరం(2025-26) నుంచి కొత్త పాఠ్య ప్రణాళికతో కూడిన పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. ఎన్‌సీఈఆర్‌టీ గత మూడు సంవత్సరాల నుంచి సిలబస్‌ను హేతుబద్ధీకరణ చేస్తూ, అవసరం లేని పాఠ్యాంశాలను తొలగిస్తూ వస్తోంది. ఈ మేరకు కొత్త విద్యా ప్రణాళికను గతేడాది ఆగస్టులో విడుదల చేసింది. దీనికి అనుగుణంగా తెలంగాణ ఇంటర్ బోర్డు సిలబస్‌లో మార్పులు చేసేందుకు సమాయత్తమవుతోంది.
➥ ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య ప్రణాళిక హేతుబద్ధీకరణలో భాగంగా కెమిస్ట్రీలో కనీసం 15 శాతం పాఠ్యాంశాలను తగ్గించింది. దీని ఆధారంగానే జేఈఈ మెయిన్, నీట్ ప్రశ్నపత్రాల రూపకల్పన చేస్తారు. దీన్నిబట్టి ఇక్కడా కెమిస్ట్రీలో సిలబస్ సగటున 10-15 శాతం తగ్గుతుందని ఇంటర్ బోర్డు వర్గాలు అంచనా వేస్తున్నాయి.
➥ ప్రస్తుతం ఎంపీసీ, ఎంఈసీ గ్రూపులకు మ్యాథమెటిక్స్ సిలబస్ కామన్‌గా ఉంది. ఎంఈసీ విద్యార్థులకు అంత సామర్థ్యంతో కూడిన పాఠాలు అవసరం లేదనే ఉద్దేశంతో 2022లో ఇంటర్‌బోర్డు ప్రత్యేకంగా మ్యాథమెటిక్స్ పుస్తకాలను తీసుకురావాలని నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త పుస్తాకలు అందుబాటులోకి రానున్నాయి.
➥ ఎన్‌సీఈఆర్‌టీ ప్రకారం.. బైపీసీలో బయాలజీ మాత్రమే ఉంటుంది. ఇంటర్ బోర్డులో బోటనీ, జువాలజీ రెండు సబ్జెక్టులూ ఉంటాయి. ఈసారి ఇక్కడ కూడా ఆ తరహా మార్పులకు అవకాశం ఉంది.
➥ ఇంటర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఎన్‌సీఈఆర్‌టీకి అనుగుణంగా 2013లో మార్పులు చేశారు. మ్యాథమెటిక్స్‌లో పెద్దగా మార్పులేమీ చేయలేదు. అప్పుడు నీట్ లేకపోవడంతో బోటనీ, జువాలజీలో మార్పు చేయలేదు.
➥ ప్రస్తుతం రాష్ట్ర విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు ఒక సిలబస్, నీట్‌కు మరో సిలబస్ చదవాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను తగ్గించేలా.. సైన్స్ గ్రూపుల్లో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను అనుసరించాలి. ఎంబైపీసీ గ్రూపును అందుబాటులోకి తెస్తే రాష్ట్ర విద్యార్థులు అటు జేఈఈ, ఇటు నీట్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుంది.
➥  తెలంగాణలో ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు గతేడాది నిర్వహించిన తెలంగాణ ఎంసెట్‌లో సిలబస్‌ను తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రథమ సంవత్సరంలో 70 శాతం, ద్వితీయ సంవత్సరంలో 100 శాతం సిలబస్‌ నుంచి ప్రశ్నలు ఇచ్చారు

Related Posts