అనంతపురం, ఆగస్టు 10
జీవన్మృతుల పార్ధివ దేహాలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అవయవదానంతో పలువురికి జీవదాతలుగా నిలిచిన వారి పార్థివ దేహాలకు గౌరవప్రదమైన వీడ్కోలు తెలపాలని, వారి కుటుంబాలకు రూ.10,000 పారితోషికాన్ని అందజేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను వివరిస్తూ వైద్యఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి .కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారుఅవయవ దాతల భౌతిక కాయాల అంతిమ సంస్కారాన్ని గౌరవ ప్రదంగా నిర్వహించాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకు రూ.10 వేలు పారితోషికాన్ని అందజేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఉత్తర్వులు వెలువడేలా చర్యలు తీసుకుంటానని జులై రెండో తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ అవయవ దాన దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయా జిల్లాల్లో జిల్లా కలెక్టర్ లేదా ఎస్పీ అంత్య క్రియలకు హాజరయ్యేలా ఆదేశాలిస్తామని మంత్రి సత్యకుమార్ సభావేదిక నుండి ప్రకటించారు. మంత్రి చొరవతో ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.అవయవదానంతో పలువురికి జీవన దానం చేసిన జీవదాతల భౌతిక కాయాలకు గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక్కొక్కరికీ రు.10 వేల వంతున పారితోషికాన్ని మంజూరు చేసిందని, దీనితో పాటు అవయవ దాతల కుటుంబ సభ్యుల్ని గౌరవిస్తూ వారిని శాలువా, ప్రశంసాపత్రం, పుష్పగుచ్ఛాలతో సత్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను అనుసరించాలని అధికారులకు సూచించారు.బ్రెయిన్ డెడ్ వ్యక్తి భౌతిక శరీరం నుండి అవయవాలను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి లేదా సంబంధిత (ప్రైవేటు) ఆస్పత్రి ప్రధానాధికారి ద్వారా సేకరించిన తరువాత సంబంధిత జిల్లా కలెక్టర్ వారి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందచేయాలని సూచించారు. అవయవ సేకరణ అనంతరం భౌతిక కాయాన్ని తగిన సమయంలో సగౌరవంగా అంతిమ సంస్కారాలను నిర్వహించాల్సి వుంటుందన్నారుఅవయవాల సేకరణ తరువాత దాత భౌతిక దేహానికి రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి సంబంధిత జిల్లా కలెక్టర్ హాజరు కావాలని, ముందుగా నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలతో హాజరు కాలేకపోతే జిల్లా స్థాయి సీనియర్ అధికారిని పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.అంతిమ సంస్కార కార్యక్రమానికి హాజరైన అధికారి మరణించిన జీవదాత భౌతిక దేహంపై పుష్పగుచ్ఛాన్ని వుంచి గౌరవించాలన్నారు. మరణించిన దాత కుటుంబ సభ్యులకు గౌరవచిహ్నంగా శాలువా, ప్రశంసాపత్రం, ఒక పుష్పగుచ్ఛాన్ని అందచేసి ప్రభుత్వం తరపున వారిని గౌరవించాలి. ఇందుకోసం దాత ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల వ్యయానికి ప్రభుత్వం అనుమతించింది.అంతిమ సంస్కార వ్యయం కింద రు.10వేల రూపాయలను వారి కుటుంబ సభ్యులకు అందచేయాల్సి వుంటుంది. దాతల కుటుంబ సభ్యులకు ప్రశంసాపత్రాన్ని జ్ఞాపికను కూడా అందచేస్తారు. అవయవ సేకరణ అనంతరం ఆస్పత్రి నుండి దాత నివాసం లేదా స్మశాన వాటికకు భౌతిక కాయాన్ని ఉచితంగా తరలించే ఏర్పాట్లు చేయాలి.జీవదాత భౌతిక దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించటానికి ముందు రాష్ట్రప్రభుత్వం తరపున కార్యక్రమానికి హాజరైన ఉన్నతాధికారి, స్థానికి ప్రజా ప్రతినిధుల వంటి వారు గౌరవ వందనంతో అంతిమ వీడ్కోలు పలకాలని సూచించారు. అనంతరం దాతకు సంబంధించిన ఫొటోతో ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలతో జిల్లా కలెక్టర్ ప్రతికా ప్రకటన జారీ చేయాలని క్రిష్ణబాబు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.