YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సెప్టెంబర్ 21, 25, 30 తేదీల్లో పంచాయితీ ఎన్నికలు..?

సెప్టెంబర్ 21, 25, 30 తేదీల్లో పంచాయితీ ఎన్నికలు..?

హైదరాబాద్, ఆగస్టు 10 
తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పంచాయతీ పాలకవర్గాల కాలపరిమితి ముగిసి ఆరు నెలలు దాటడంతో ఇక ఆలస్యం చేయకూడదని భావిస్తోంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారాన్ని బట్టి పంచాయతీ ఎన్నికలను రాష్ట్రంలో మూడు దశల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు దాదాపుగా సెప్టెంబర్ 21, 25, 30 తేదీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.ఇందుకు అనుగుణంగా పంచాయతీరాజ్ శాఖ కసరత్తు చేస్తోంది. అధికారులు ఎన్నికలు నిర్వహించే తేదీలు, ఓటర్ల జాబితా ప్రస్తుత పరిస్థితి తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. వారం రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు బయలు దేరి వెళ్లారు. ఆయన తిరిగి వచ్చేసరికి పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశం కొలిక్కి వస్తుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి రాగానే ఆయన ఆదేశాలతో ఎన్నికలకు నగరా మోగుతుంది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుంది.సెప్టెంబర్ నెలలో ఎన్నికలకు వెళ్లేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై పంచాయతీరాజ్ శాఖ అధ్యనం చేస్తోంది. ఇప్పటికే గ్రామ పంచాయతీల సర్పంచ్‌ల పదవీ కాలం ఫిబ్రవరి 2న ముగిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన ప్రవేశ పెట్టింది. నాటి నుంచి నేటి వరకు గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. అయితే సర్పంచ్ ఎన్నికలు ఇప్పటికే నిర్వహించాల్సి ఉండగా ప్రభుత్వం దాన్ని పోస్ట్ ఫోన్ చేస్తూ వస్తుంది. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం రుణమాఫీ అనంతరం గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రెండు విడతల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. అలాగే ఆగస్టు నెల చివరి వరకు మూడో విడత రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం హామి ఇచ్చింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు పలుమార్లు సర్పంచ్ ఎన్నికలపై సమావేశం అయ్యారు. మాజీలుగా మారిన సర్పంచ్‌లు రోడ్డెక్కారు.తమ హయాంలో అప్పులు చేసి పనులు చేశామని, బిల్లులు రాక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సచివాలయం ముట్టడికి యత్నించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించి అనంతరం కొత్త పాలకవర్గాలు కొలువుదీరితే ఆర్థిక సంఘం నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్రం నుంచి వచ్చే నిధులతో సర్పంచ్‌లకు ఉన్న బకాయిలు చెల్లించడం ద్వారా సమస్య నుంచి బయటపడవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఎన్నికలు వీలైనంత వేగంగా సెప్టెంబర్ 21, 25, 30 తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ వర్గాల సమాచారం. ఎన్నికలు పూర్తయిన వెంటనే ఫలితాలు వెలువడగానే కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచ్‌లు అక్టోబర్ మొదటి వారంలో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది.

Related Posts