YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాష్ట్రంలో నైరుతీ రుతుపవనాలు..విస్తారంగా వర్షాలు అధికారులు అప్రమత్తంగా ఉండాలి సిఎస్ ఆదేశం

రాష్ట్రంలో నైరుతీ రుతుపవనాలు..విస్తారంగా వర్షాలు      అధికారులు అప్రమత్తంగా ఉండాలి సిఎస్ ఆదేశం
తెలంగాణ రాష్ట్రంలో నైరుతీ రుతుపవనాల ద్వారా 90 శాతం నుండి 99 శాతం వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన నేపధ్యంలో వివిధ శాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలనిప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  డా.ఎస్.కె.జోషి ఆదేశించారు.గురువారం సచివాలయంలో సౌత్ వెస్ట్ మాన్ సూన్స్ సన్నద్ధత పై మున్సిపల్, పోలీసు, మిలటరీ, ఎయిర్ ఫోర్స్, రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, వ్యవసాయ, పశుసంవర్ధక, వైద్య, వాతావరణ, విద్యుత్, రైల్వేస్, ఫైర్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ వాతావరణ శాఖ ద్వారా వర్షాలపై అందించే సమాచారాన్నివివిధ శాఖలు నిరంతరం షేర్ చేసుకొని అప్రమత్తంగా ఉండటంతో పాటు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా వర్షాకాల సీజన్ లో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండటంతో పాటు అవసరమైన మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచుకొని సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ ద్వారా ప్రజల కోసం వాతావరణ వివరాలు తెలిసేలా ఒక యాప్ ను అతిత్వరలో ప్రారంభించనున్నట్లు సి.యస్ వివరించారు.వాతావరణ శాఖ ద్వారా వర్షపాతంపై అలర్ట్స్ ను రోజూ పంపిస్తున్నామని, 31 జిల్లాలలో వర్షపాతాన్ని నమోదు చేసి, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేధిక సమర్పించాలని సి.యస్ తెలిపారు. ఉరుములు, మెరుపులపై 45 నిముషాలు ముందుగా సమాచారాన్ని పంపిస్తున్నామన్నారు. వెబ్ సైట్, వాట్సాప్ గ్రూపు ద్వారా వాతావరణ శాఖ ప్రతిరోజు వాతావరణ వివరాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నామని, సాధారణ ప్రజలకు తెలిసేలా మీడియాద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని సి.యస్ తెలిపారు.హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసి ద్వారా లోతట్టు ప్రాంతాలపై  ప్రత్యేక దృష్టి  సారించడమే కాకుండా ప్రత్యేక టీం ల ద్వారా ప్రజలకు వెంటనే సేవలందేలా చూడాలని సి.యస్  అన్నారు. వర్షాలు కురుస్తున్నప్పుడు జిహెచ్ఎంసి ద్వారా వార్డుల వారిగా సేవలందిస్తున్నందుకు ఈ సందర్భంగా సి.యస్ అభినందించారు. అధిక వర్షాలు కురిసినప్పుడు నష్టం పెరగకుండా చూడాలని, వివిధ శాఖల అధికారులతో  కంట్రోల్ రూం ద్వారా పనులన్నీ సమన్వయంతో  చేపట్టాలన్నారు. బస్తీ దవాఖానాల్లో మందులను అందుబాటులో ఉంచాలని, యాంటీలార్వా ఆపరేషన్లను చేపట్టాలని, నాలాల పూడికలు తీయాలని, తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేయలన్నారు. అతి తక్కువ సమయంలో అత్యధిక వర్షపాతం నమోదైన సందర్భాలలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసు కంట్రోల్ రూం ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షించాలన్నారు.  విద్యుత్ శాఖ ద్వారా ప్రత్యేక టీం లతో వెంటనే  పునరుద్ధరణ చర్యలు చేపట్టేలా సిద్ధంగా ఉండాలన్నారు. అధిక వర్షాలు కురిసిన సమయంలో స్ధానిక బస్తీ వాసుల సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలన్నారు.  వారికి భాగస్వామ్యం కల్పించాలన్నారు.ఇండియా డిజాస్టర్ రెస్పాన్స్ నెట్ వర్క్ కు సంబంధించిన పాస్ వర్డ్ లను కలెక్టర్లు తీసుకొని జిల్లాలలో ఉన్న వాహానాలు,సామాగ్రిల వివరాలు తెలుసుకోవాలన్నారు. మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపినందున వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా పశుగ్రాసం, వ్యాక్సిన్లను అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. పంచాయతీ రాజ్ శాఖా ద్వారా రోడ్లకు మరమ్మత్తులు, ఇరిగేషన్ శాఖ ద్వారా చెరువులు, కుంటలు,ట్యాంకులకు పటిష్టచర్యలు, పౌరసరఫరాల శాఖ ద్వారా నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మున్సిపల్ శాఖ ద్వారా స్వచ్ఛమైన మంచినీరు తదితర చర్యలు చేపట్టాలన్నారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఎన్.డి.ఆర్.ఎఫ్ ద్వారా సేవలు అందిచడానికి సన్నద్దంగా ఉండాలన్నారు.ఈ సమావేశంలో వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతి కుమారి, పంచాయతీ రాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ ముఖ్యకార్యదర్శి ఆర్.వి. చంద్రవదన్,జిహెచ్ఎంసి కమీషనర్ బి.జానార్ధన్ రెడ్డి, హైదరాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్, రాచకొండ సి.పి మహేష్ భగవత్, వాకటి కరుణ, టి.కె.శ్రీదేవి, జితేందర్ లతో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts