రజనీకాంత్ సినిమా వచ్చిందనే కోలాహలం కొంత వరకూ అయితే కనిపిస్తోంది. ‘కాలా’ విడుదల సందర్భంగా తమిళనాట అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఫ్యాన్స్‌కు అయితే ఈ విధంగా పండగొచ్చింది కానీ, ఓవరాల్‌గా రజనీకాంత్ సినిమా విడుదల సమయంలో ఉండే హంగామా అయితే తగ్గినట్టుగా కనిపిస్తోంది. ప్రత్యేకించి తెలుగునాట ‘కాలా’ క్రేజ్ మరీ పతాకస్థాయికి చేరకపోవడం గమనార్హం. ఇది వరకూ రజనీకాంత్ సినిమాలు విడుదల అయినప్పుడు ఉండే మానియా ఇప్పుడు కనిపించకపోవడం గమనించాల్సిన విషయం. తెలుగునాట పరిస్థితులనే గమనిస్తే.. ‘కబాలి’ అంతకు ముందు ‘లింగా’ సినిమాల విడుదల అప్పుడు ఉన్న హైప్ అలాంటిలాంటిది కాదు. ఆ సినిమాల విడుదల గురించి జనాలు ఎంతగానో ఎదురుచూశారు. ఆ సినిమాలపై విడుదలకు ముందు నుంచి విపరీతమైన చర్చ నడిచింది. సోషల్ మీడియాలో ఆ సినిమాలపై ఆసక్తితో, ఆత్రుతతో పోస్టులు పెట్టారు తెలుగునాట ఉన్న రజనీకాంత్ ఫ్యాన్స్. సామాన్య సినీ ప్రేక్షకుల నుంచి కూడా ఆ సినిమాల పట్ల అధిక ఆసక్తి వ్యక్తం అయ్యింది. అయితే ‘కాలా’ విషయంలో మాత్రం ఆ క్రేజ్ కనిపించడం లేదు. తెలుగునాట ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి కారణం ఏమిటి అని శోధిస్తే.. ఒకటే రీజన్.. రజనీకాంత్ గత సినిమాలు ఫెయిల్యూర్స్‌గా మిగిలిపోవడం. బీభత్సమైన హైప్‌తో వచ్చిన ‘లింగా’, ‘కబాలి’ సినిమాలు ప్రేక్షకులను బాగా నిరాశపరిచాయి. పతాక స్థాయి అంచనాలతో.. అదిరిపోయేలా ఉంటాయని ఆ సినిమాలను వీక్షించిన ప్రేక్షకులు నిరాశ చెందారు. కబాలి సినిమాకు క్రేజ్‌తో కలెక్షన్లు అయితే వచ్చాయి కానీ.. రజనీ ఫ్యాన్స్‌ను అది మెప్పించలేదు. ట్రైలర్ ఆకట్టుకున్న స్థాయిలో ఆ సినిమా ఆకట్టుకోలేదు. ఇలా రెండు నిరాశపరిచిన సినిమాల అనంతరం రజనీకాంత్ ‘కాలా’గా వచ్చాడు. దీనికి దర్శకుడు కూడా కబాలిని రూపొందించిన డైరెక్టరే కావడం మరో నెగిటివ్ పాయింట్ అయ్యింది. దీంతో ‘కాలా’ పట్ల తెలుగునాట మునుపటి రజనీ సినిమాలకు ఉన్నంత క్రేజ్ కనిపించడం లేదు. అయితే పాజిటివ్ టాక్ పొందితే మాత్రం ఈ సినిమా మళ్లీ రజనీ మ్యాజిక్‌ను అందుకునే అవకాశం ఉంది.