YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ముగిసిన రేవంత్ టూర్

ముగిసిన రేవంత్ టూర్

హైదరాబాద్, ఆగస్టు 14,
అమెరికా, దక్షిణ కొరియా పర్యటనల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా పర్యటన విజయవంతంగా ముగిసిందని శ్రేణులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం విదేశీ పర్యటన సాగగా.. చాలా రోజుల తర్వాత రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆగస్టు 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికాకు వెళ్లింది. 10న అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియా లోని సియోల్‌ కి చేరుకున్నారు. దక్షిణ కొరియాలో రెండ్రోజుల పాటు రేవంత్ రెడ్డి పర్యటించారు. పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించారు. అక్కడ పలు కంపెనీలతో ఎంవోయూలు చేసుకున్నారు. అందులో భాగంగా కాగ్నిజెంట్‌తో చేసుకున్న ఒప్పందం మేరకు.. వచ్చి రాగానే కోకాపేటలో కొత్త క్యాంపస్‌కి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 5న తెలంగాణ సర్కార్‌తో కాగ్నిజెంట్ సంస్థ అమెరికాలో ఎంవోయూ చేసుకుంది. ఆ మేరకు 10 రోజుల్లోనే విస్తరణకు శ్రీకారం చుట్టారు. అమెరికా వేదికగా తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన వచ్చింది. తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా అమెరికా లోని పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించారు. పర్యటనలో భాగంగా 50కి పైగా సమావేశాలు, 3 రౌండ్ టేబుల్ మీటింగ్‌లు నిర్వహించి పలు కంపెనీ లను క్షేత్ర స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. తెలంగాణ లో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ రంగాల్లో పేరొందిన భారీ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ పర్యటనలో 31 వేల 532 కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం 19 కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. దీంతో, రాష్ట్రంలో 30 వేల 750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి.
దక్షిణ కొరియాలో
దక్షిణ కొరియాలో పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు సీఎం రేవంత్ రెడ్డి. కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. శాంసంగ్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, జీఎస్ కల్టెక్స్, సెల్ ట్రయాన్ కంపెనీ ప్రతినిధుల తోనూ సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. హన్ రివర్ ప్రాజెక్టును సందర్శించి సియోల్ డిప్యూటీ మేయర్‌  తో భేటీ అయ్యారు. శామ్‌సంగ్ హెల్త్ కేర్ యూనిట్‌తో సమావేశమై చర్చలు జరిపారు. అలాగే కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సీఎం రేవంత్‌ రెడ్డి బృందం సందర్శించింది. కాల్‌ టెక్స్ కంపెనీ ప్రతినిధులతో పెట్టుబడులపై చర్చలు జరిపింది. ఇప్పటికే వరంగల్ టెక్స్టైల్స్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియా ఫెడరేషన్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీ సానుకూలంగా స్పందించింది.
88 వేల కోట్ల పెట్టుబడులు
వల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికెషన్ (టీజీ ఐపాస్) లో అనుమతులు, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దావోస్, ఇటీవలి అమెరికా, దక్షిణకొరియా పర్యటనల ద్వారా రూ.88,432 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. అలాగే కొత్తగా 1,13,724 కొలువులు లభించేలా రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టేందుకు సంస్థలు ముందుకొచ్చాయి. ఐటీ, ఫార్మా, బయోటెక్, పవర్, టెక్స్టైల్స్ రంగాలకు చెందిన సంస్థలు ఇన్వెస్ట్మెంట్స్కు ముందుకు వచ్చాయి.టీజీ ఐపాస్ ద్వారా భారీగా అనుమతులను ఇచ్చారు. నిరుడు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 1,764 సంస్థలకు టీజీ ఐపాస్ ద్వారా అనుమతులు లభించాయి. వాటి ద్వారా రూ.16,672.81 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్టయింది. 47,974 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఈ పీరియడ్లో మార్చిలోనే అత్యధికంగా రూ.11,072.47 కోట్ల మేర పెట్టుబడులు రావడం గమనార్హం. ఆ నెలలో 247 సంస్థలకు పర్మిషన్లు వచ్చాయి. ఇందులో పలు భారీ పరిశ్రమలున్నట్టు అధికారులు చెబుతున్నారు.ఇక, అత్యధికంగా ఫిబ్రవరిలో 262 సంస్థలకు అనుమతులు ఇవ్వగా.. ఆ నెలలో రూ.1,331.83 కోట్లు పెట్టుబడుల రూపంలో వచ్చాయి. డిసెంబర్లో 179 కంపెనీలకు అనుమతివ్వగా.. రూ.244.58 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జనవరిలో 193 కంపెనీలకు అనుమతిస్తే రూ.897.11 కోట్లు, ఏప్రిల్లో 193 కంపెనీలకు అనుమతిస్తే రూ.447.40 కోట్లు, మేలో 216 కంపెనీలకు అనుమతులివ్వగా రూ.960.41 కోట్లు, జూన్లో 195 కంపెనీలకు అనుమతులిస్తే.. రూ.973.09 కోట్లు, జులైలో 201 కంపెనీలకు అనుమతులివ్వగా రూ.607.83 కోట్లు, ఆగస్టులో ఇప్పటివరకు 78 కంపెనీలకు అనుమతులివ్వగా.. రూ.138.12 కోట్ల మేర పెట్టుబడుల రూపంలో వచ్చినట్టు పరిశ్రమల శాఖ వర్గాలు చెప్తున్నాయికాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులు దావోస్ టూర్కు వెళ్లారు. వారికది తొలి దావోస్ టూర్ కూడా కావడం విశేషం. ఆ తొలి దావోస్ టూర్ను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఆ టూర్లో రూ.40,232 కోట్ల వరకు పెట్టుబడులను రాబట్టగలిగారు. ఇక, తాజాగా అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా 19 సంస్థలతో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబులు భేటీ అయి పెట్టుబడులు సాధించడంలో సక్సెస్ అయ్యారు. రూ.31,532 కోట్ల పెట్టుబడులతో పాటు.. 30,750 మందికి ఉపాధి కల్పించేలా కృషి చేశారు.
కేటీఆర్ టూర్ల కన్నా ఎక్కువే
కేటీఆర్ ఐటీ, ఇండస్ట్రీస్ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన దావోస్ టూర్లలో మొత్తం కలిపినా రూ.24,500 కోట్ల పెట్టుబడులే రావడం గమనార్హం. 2020 టూర్లో రూ.500 కోట్లు, 2022 టూర్లో రూ.4,128 కోట్లు, 2023 పర్యటనలో రూ.19,900 కోట్ల విలువైన పెట్టుబడులనే ఆకర్షించగలిగారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జరిగిన రెండు టూర్లలోనే రూ.71 వేల కోట్ల విలువైన పెట్టుబడులు రావడం విశేషం.
భారీ స్వాగతం
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి టీమ్ హైదరాబాద్ చేరుకుంది. బుధవారం ఉదయం 12 గంటలకు శంషాబాద్ ఎయిర్‌‌పోర్టులో రేవంత్ టీమ్‌కు ఘన స్వాగతం పలికారు నేతలు, కార్యకర్తలు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు చేపట్టిన టూర్ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఫుల్‌ఖుషీగా ఉన్నాయి. డప్పు చప్పుళ్ల మధ్య పూల బొకేలు, శాలువాలతో ఆయన్ను ముంచెత్తారు. చిరునవ్వులతో అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు సీఎం.తెలంగాణకు పెట్టుబడులను రప్పించడమే లక్ష్యంగా ఆగష్టు రెండున సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా, దక్షిణ కొరియాకు బయలుదేరింది. 10 రోజులపాటు అమెరికాలో పర్యటించిన ముఖ్యమంత్రి, వ్యాపారవేత్తలు, వివిధ కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. కొన్ని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మరికొన్ని కంపెనీల ప్రతినిధులు తెలంగాణ పర్యటనకు వస్తామని చెప్పారు. దాదాపు 40 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అనంతరం అక్కడి నుంచి దక్షిణకొరియా వెళ్లారు. తెలంగాణలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొస్తాయని అక్కడి వ్యాపారవేత్తలు చెప్పారుహైదరాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే మీడియాతో మాట్లాడిన మంత్రి శ్రీధర్‌బాబు, బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇదేమీ పోటీ పర్యటన కాదని, రాష్ట్ర అభివృద్ధి కోసమే మా ప్రయత్న మన్నారు. రెండుసార్లు వారు ఫ్లాప్ అయ్యారని, అయినా బుద్ధి రాలేదు. ఇలాగే మాట్లాడితే మరోసారి ఫ్లాప్ అవ్వడం ఖాయమన్నారు. మా పర్యటనలపై బీఆర్ఎస్ విషప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.ఫారెన్ టూర్ ఫ్లాప్ షో అన్న బీఆర్ఎస్ నేతలపై తనదైన శైలిలో కౌంటరిచ్చారు మంత్రి శ్రీధర్‌‌బాబు. అమర్‌ రాజా బయటకు వెళ్తోందని వారికేమైనా చెప్పిందా? అంటూ ప్రశ్నించారు. ఆనాడు ఆ కంపెనీని అక్కడ నుంచి పంపిస్తే.. ఇక్కడకు వచ్చారని, బీఆర్ఎస్ ఏమీ తీసుకురాలేదన్నారు. పరిశ్రమలకు సంబంధించి
అన్ని సదుపాయాలు కల్పిస్తామని, వారికి విశ్వాసం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి. మొత్తానికి రేవంత్‌రెడ్డి టీమ్ ఫారెన్ టూర్ సక్సెస్ అయ్యింది.

Related Posts