శ్రీకాకుళం, ఆగస్టు 26
శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి చర్చనీయాంశమవుతున్నారు. మనిషి కాస్త పలచగా కనిపిస్తున్నా నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం గట్టిగానే ఉంటున్నారు. ఎస్పీగా మొదటి పోస్టింగ్ కావటం, యువరక్తం ఉరకలవేస్తుండటంతో తన మార్క్ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జనాల్లోకి మరింత వెళ్లేలా ట్రై చేస్తున్నారు. ఒకవైపు నేరాల అదుపు చేసే ప్రయత్నాల్లో ఉంటూనే డిపార్ట్‌మెంట్‌లోని గంజాయి మొక్కలను గుర్తించి వారికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఐపీఎస్ ట్రైనింగ్, ఆ తరువాత మావోయిస్టుల ఏరివేత ప్రక్రియలో ఓఎస్డిగా పని చేశారు మహేశ్వరరెడ్డి. అయితే క్షేత్ర స్థాయి పరిస్థితులు వేరు కావడంతో కాస్త తడబడుతున్నారు. మహేశ్వరరెడ్డి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే డిపార్ట్మెంట్లోని ‘చేతివాటం' అధికార్లుపై దృష్టి పెట్టారు. ఉన్నతాధికారులకు తొత్తులుగా ఉంటూ పోలీస్ స్టేషన్లను సెటిల్మెంట్ కేంద్రాలుగా మార్చేసిన ఎస్‌ఐలు, సీఐలను గుర్తించి గట్టి వార్నింగ్‌లే ఇస్తున్నారు. తమకు బదిలీ వేటు తప్పదని గ్రహించి ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉంటున్నారు. అయితే ఏ స్టేషన్లో ఉన్నా ఎస్పీ పర్యవేక్షణలోనే ఉండాలి కనుక కాస్త జాగ్రత్తగా ఉంటున్నారు. రికమండేషన్స్‌తో పోస్టింగ్స్ తెచ్చుకుంటున్న వారు ఆటలు కూడా ఎస్పీ ముందు సాగడం లేదని టాక్. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తూ..బాధితుల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారిని చూసి పోలీస్ సబ్ డివిజన్‌లలో కూడా వినతులు స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. జిల్లా కేంద్రానికి బాగా దూరంగా ఉన్న ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాల బాధితులకు అందుబాటులో ఉండేలా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో వినతులు స్వీకరించాలని డిసైడ్ అయ్యారు. ప్రతి శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కు స్వయంగా హాజరై ప్రజల ఇబ్బందులు వినబోతున్నారు మహేశ్వరరెడ్డి. ప్రతి శుక్రవారం ఉదయం 11.30 గంటల నుంచి అందుబాటులో ఉంటానని ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, వజ్రపుకొత్తూరు, మందస, పలాస, నందిగాం, టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, మెళియాపుట్టి మండలాల ప్రజలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.శ్రీకాకుళం జిల్లా సముద్ర తీర ప్రాంతంలో ప్రత్యేక గస్తీకి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ప్రతి కాలేజీకి వెళ్లి యువతతో నేరుగా మాట్లాడుతున్నారు ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే ఫోన్ చేయండి అంటూ శివమణి స్టైల్‌లో నెంబర్ ఇస్తున్నారు. మామూలు తీసుకునే సిబ్బందిని టార్గెట్ చేస్తూ వస్తున్నారని తెలుస్తోంది. అక్రమాలకు అలవాటు పడిన సిబ్బందిని టార్గెట్ చేయడంపై పొలిటికల్ ప్రెజర్ మహేశ్వర్‌రెడ్డిపై పడుతోందట. వాళ్లు ఎస్పీకి ఫోన్ చేస్తే సరే చూద్దాం సార్ అని కూడా చెప్పి నిందితులకు మాత్రం ట్రీట్మెంట్ ఇచ్చే పంపిస్తున్నారని అంటున్నారు. జిల్లాకు ఎంతోమంది ఎస్పీలు వచ్చి వెళ్లారు కానీ మహేశ్వర్‌రెడ్డి స్పెషల్ అంటున్నారు కొందరు ఖాకీలు. ఎస్పీ సార్ వస్తున్నారు అంటే చాలు స్టేషన్లో ఏ స్టేషన్ కి వెళ్తారో తెలియదు. సడన్‌గా ఏదో స్టేషన్‌కు వెళ్లి అక్కేడ బాధితులతో నేరుగా మాట్లాడుతున్నారు. ఇది లోకల్ సిబ్బందిని కూడా అలర్ట్ చేస్తోంది. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి సరఫరాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారని అంటున్నారు. మొత్తానికి కుర్ర ఎస్పీ సిక్కోలులో కొత్త శివమణిలా మారిపోయారని అంటున్నారు.