YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హడలెత్తిస్తున్న హైడ్రా

హడలెత్తిస్తున్న హైడ్రా

హైదరాబాద్, ఆగస్టు 27,
హైడ్రా.. ఇప్పుడు హైదరాబాద్‌లో పలువురిని హడలెత్తిస్తోంది. ఎప్పుడు, ఎక్కడ ఏ కూల్చివేత చూడాల్సి వస్తోందోనని వణికిపోతున్నారు. కబ్జాలు చేసి, అక్రమార్జనతో చేసిన నిర్మాణాలను కూల్చివేస్తుంటే సామాన్యులు చప్పట్లు కొట్టారు. అయితే.. అలాంటి సామాన్యులకు సైతం ఇప్పుడు హైడ్రా కూల్చివేతల భయం పట్టుకుంది. దశాబ్దాలుగా తాము నివాసం ఉంటున్న ఇంటిని ఎక్కడ కూల్చివేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు తదితరులను కలిసి తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. ‘పెద్దోళ్ల కట్టడాలు కూల్చుకో.. కానీ పేదోళ్ల కట్టడాల దగ్గరికి వచ్చేందుకు నీకు అధికారం ఎవరిచ్చారు?’ అంటూ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. రాయదుర్గంలో ఓ వ్యక్తి ఇంటిని కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. అది తమ తాతల కాలం నాటి ఆస్తి అని, 80 ఏళ్లుగా తాను ఆ ఇంట్లో ఉంటున్నానని బాధితుడు చెబుతున్నాడు. చిన్నపిల్లలను, ఆడవాళ్లను బయటకి పంపించి.. సామాన్లన్నింటిని బయటపడేసి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా బుల్డోజర్లతో తన ఇంటిని నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.హైకోర్టులో తాము వేసిన రిట్ పిటిషన్ విచారణ పెండింగ్‌లో ఉందని.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా లెక్కచేయకుండా ఇంటిని కూల్చివేశారని బాధితుడు చెబుతున్నాడు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం పరిధిలోని ఆ స్థలంలో తన ముత్తాత 1943లో ఒక ఫ్యాక్టరీని నిర్వహించాడని ఆయన తెలిపాడు. ‘రేవంత్ రెడ్డి గారిని చేతులు జోడించి వేడుకుంటున్నా.. ఇలాంటి కూల్చివేతలు ఆపించండి’ అని బాధితుడు కోరుతున్నాడు.ఘటనతో.. చెరువులు, ప్రభుత్వ స్థలాల సమీపంలో ఇళ్లు నిర్మించుకొని, 40 - 60 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారిలో వణుకు పుడుతోంది.హైదరాబాద్ నగరం మాత్రమే కాదు. రాష్ట్రంలో ఉన్న అన్ని నగరాలు, పట్టణాల్లో 70-80 శాతం విస్తీర్ణం ఒకప్పుడు అడవులు, చెరువులకు సంబంధించిన భూమేనని అందరికీ తెలుసు. వాటన్నింటినీ కూల్చివేస్తారా? ఈ పరిమితులను ఎవరు? ఎప్పుడు? నిర్ణయిస్తారు’ అని ఓ జర్నలిస్టు ట్వీట్ చేశారు.‘రేప్పొద్దున ఆ నిర్మాణం అక్రమం కాదని తీర్పు వస్తే.. ఆ కుటుంబానికి ఎలా న్యాయం చేస్తారు? హైకోర్టు కంటేనూ హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎసెట్స్‌ మానిటరింగ్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ) ఉన్నతమైందా? హైడ్రా ఎన్నేళ్ల వరకు ఉంటుంది? ఇంకో 50 ఏళ్లు, 100 ఏళ్ల ఇదే విధానాన్ని అమలు చేస్తారా? 80 ఏళ్ల కిందట నిర్మించిన ఇంట్లో ప్రస్తుతం నివాసం ఉంటున్న వారి వారసులు ఏం పాపం చేశారు?’ అంటూ నెటిజన్లు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.

Related Posts