దేశంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. సంక్షేమ రంగంలో అత్యంత కీలకమైన వాటికి కోత విధించి కార్పొరేట్ కంపెనీలకు సబ్సీడీలుగా కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే మన దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం పెంచుతూ పోతోందని విమర్శించారు. జీఎస్‌టీ ద్వారా కొత్త పన్నులతో ప్రజలను పీడిస్తున్నారని ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియా తో దేశ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలపై మతతత్వ శక్తులు దాడులకు పాల్పడుతున్నాయన్నారు. మోదీ నాలుగేళ్ల ప్రజా వ్యతిరేక పాలనపై ఆగస్టు 1 నుంచి 14 వరకు సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజల్ని చైతన్యవంతం చేస్తామన్నారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 20న దేశవ్యాప్తంగా అధిక ధరల పోరాట దినంగా పాటిస్తామని ఆయన వెల్లడించారు. ఉద్యోగ నియామకాలు నత్తనడకన సాగుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటించిన నోటిఫికేషన్‌లో వయో పరిమితి తక్కువగా ఉండడంతో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోలేక పోతున్నారని ప్రభుత్వం స్పందించి వయో పరిమితిని ఐదేళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు.