తిరుపతి, ఆగస్టు 28,
భూమన కరుణాకరరెడ్డి.. వైసీపీ సీనియర్ నేత. మాజీ ముఖ్యమంత్రి జగన్‌కి అత్యంత ఆప్తుడైన ఆయన తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని సీనియర్ లీడర్. కాంగ్రెస్‌తో పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డికి కూడా ఎంతో సన్నిహితంగా మెలిగారు. అలా అప్పట్లో 2004-2006 వరకు తుడా చైర్మన్‌గా పనిచేశారు. 2006-2008 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అలా వైఎస్ కుటుంబంతోనే తన పొలిటికల్ కెరీర్ కొనసాగిస్తూ వచ్చారు.జగన్ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన తరువాత ఆయన బాట పట్టిన భూమన వైసిపి లో కీలకంగా వ్యవహరించారు. 2019 ఎన్నికలలో రెండోసారి తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచి.. రెండోసారి టీటీడీ చైర్మన్ పదవి నిర్వహించారు. ఇలా వైఎస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో వరుసగా పదవులు అనుభవించిన భూమన.. గత ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా తన కుమారుడు భూమన అభినయ్‌రెడ్డిని తిరుపతి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయించారు. అయితే ఎన్నికల్లో కుమారుడు ఓటమి తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం తిరుపతి వైసీపీ శ్రేణులకు అంతుపట్టకుండా తయారైంది.భూమన గతంలోనే ఎన్నికలలో పోటికి దూరంగా ఉంటానని.. రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఎన్నికల్లో తన వారసుడితో పాటు వైసీపీ ఘోర ఓటమి తర్వాత మీడియా ముందుకి రాకపోవడంతో పాటు.. తిరుపతి ప్రజలకు కూడా కనిపించడం మానేశారు. దానికి కారణం ఏంటనే చర్చ జిల్లా పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది. ఓటమి తరువాత పార్టీ కీలక నేతలంతా వెళ్లి జగన్‌ని కలుస్తున్నా.. భూమన మాత్రం తాడేపల్లి వైపు తొంగి చూడలేదు. తండ్రితో పాటు తనయుడు అభినయ్‌రెడ్డి సైతం తిరుపతి వైసీపీ కార్యకలాపాల్లో కనిపించడం లేదు.అయితే భూమన కుటుంబం అంతలా సైలెంట్ అవ్వడానికి కారణంప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలే అంటున్నారు. వైసీపీ కీలక నేతలైన మాజీ మంత్రులు జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, కొడాలి నాని, వంశీ వంటి వారు అవినీతి ఆరోపణలు, దౌర్జన్యాల కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇక జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అగ్రిగోల్డ్ కేసులో జైలు పాలయ్యారు. అలా వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలోనే భూమన కరుణాకర్‌రెడ్డి జాగ్రత్తపడుతూ మౌనంగా ఉన్నారన్న చర్చ నడుస్తోంది.భూమన కుటుంబం మీద కూడా కూటమి నేతలు ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేశారు. ముఖ్యంగా తిరుపతి కేంద్రంగా జరిగిన మాస్టర్ ప్లాన్ రోడ్లకు సంబంధించి టీడీఆర్ బాండ్లలో దాదాపు 4 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఇప్పటికే సీఐడీ పోలీసులకు ఫిర్యాదు అందాయి. అందులో భూమన కుమారుడు అభినయ్‌రెడ్డి హస్తం ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఇక భుమన సైతం టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన సమయంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని.. అవసరం లేకుండా భారీ ఎత్తున నూతన భవనాలు ఏర్పాటు పేరుతో కోట్లాది రూపాయల టీటీడీ సొమ్మును దుర్వినియోగం చేశారని.. దానిపైన విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు కూటమి నేతలు.ఆఖరికి టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన ఇంటి స్థలాల వ్యవహారంలోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని.. మాజీమంత్రి రోజాతో కలసి భూమన అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తున్నారు. అలా తనతో పాటు కొడుక్కి కూడా అవినీతి ఉచ్చు బిగుసుకుంటుండటం.. పార్టీలోని సీనియర్ నేతలు అందరూ వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్న నేపద్యంలో తన దందాలకు ఆధారాలు దొరక్కుండా చేసుకునే పనిలో బిజీ అయి.. సైలెంట్‌గా పని కానిస్తున్నారంట. అందుకే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ తగలబడిపోయిన ఘటనకు సంబంధించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆరోపణలు వస్తున్నా.. పెద్దిరెడ్డి కోటరీ నేతల పై కేసులు నమోదు అవుతున్నా భూమన మాత్రం స్పందించడం లేదంటున్నారు.ఇక భూమన రాజకీయ శిష్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం రకరకాల ఇబ్బందులను ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తినానిపై జరిగిన హత్యాయత్నం కేసులో ఇప్పటికే 41 నోటీసు అందుకొని విచారణకు హాజరవుతున్నారు. రోజా సైతం ఆడదాం ఆంధ్రా కుంభకోణంలో విచారణ ఎదుర్కోబోతున్నారు. ఇలాంటి సమయంలో సీనియర్ లీడర్‌గా ముందుకొచ్చి పార్టీని నడిపించాల్సిన భూమన నాకెందుకులే అన్నట్లుగా వ్యవహరించడంపై వైసీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఇక తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీ కార్పొరేటర్లు చాలామంది పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. తిరుపతి మేయర్ పదవి కూడా వైసీపీ చేజారే పరిస్థితి ఉందంటున్నారు. తిరుపతి కార్పొరేటర్లలో అత్యధికులు భూమన అనుచరులే.. అయినా కూడా మాజీ ఎమ్మెల్యే ఇప్పటివరకు కనీసం కార్పొరేటర్లను పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. పోతే పోతారు ఉంటే ఉంటారు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అసలు తిరుపతి నగరంతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీలో ఏం జరుగుతుందో కూడా ఆయన పట్టించుకోవడం లేదని సమాచారం.తిరుపతి వైసీపీ కార్పొరేటర్లు కూడా భూమన కరుణాకరరెడ్డి, అభినయ్‌రెడ్డిలకు పెద్ద షాక్ ఇచ్చారు. టీడీఆర్ బాండ్ల స్కాం అంతా ఆ తండ్రి కొడుకులే చేశారని.. ఏకంగా కౌన్సిల్ సమావేశంలో కమిషనర్‌కు ఫిర్యాదు చేస సంచలనం సృష్టించారు. ఆ స్కామ్‌లో తమ తప్పేం లేదని అంతా వారిద్దరి నేతృత్వంలోనే మొత్తం జరిగిందని.. ఇప్పటికీ వారు తమన పట్టించుకోవడం లేదని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమన అక్రమాలపై విచారణ జరిపించాలని పలువురు కార్పొరేటర్లు బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు.ఇలా ఓవైపు కూటమి నేతలు, మరో వైపు సొంత పార్టీ కార్పొరేటర్లే ఫిర్యాదులు చేస్తూ, విచారణలకు డిమా చేస్తుండటంతో.. భూమన కేసుల భయం పట్టుకుని ఇల్లు చక్కపెట్టుకునే పనిలో పడ్డారంటున్నారు. ఆ క్రమంలో టెంపుల్ సిటీ వైసీపీ కేడర్ భూమనపై తవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అధికారంలో ఉన్నన్నాళ్ళు పదవులు అనుభవించి.. తమ పరిస్థితి క్లిష్టంగా ఉన్న సమయంలో కనీసం పిలిచి కూడా మాట్లాడటం లేదని భూమనపై జగన్‌కు ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది