YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

వానొస్తే.. భయమే..

వానొస్తే.. భయమే..
ప్రజారోగ్యానికి తెలంగాణ సర్కార్ ప్రాధాన్యతనిస్తోంది. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు సమర్ధవంతమైన వైద్య సేవలు లభించేలా చర్యలు తీసుకుంటోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. భవనాలపైనా కాస్త దృష్టి పెట్టాలన్న విజ్ఞప్తులు కరీంనగర్ లో వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే జిల్లా ఆసుపత్రి ఇబ్బందులకు నిలయంగా మారిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రధానంగా పైకప్పు పరిస్థితి బాగాలేదని, వానాకాలం వస్తే దారుణంగా మారుతోందని పలువురు అంటున్నారు. వర్షాకాలంలో జిల్లా ఆసుపత్రిలోని పలు వార్డుల భవన పై కప్పు పెచ్చులూడి పడటం సాధారణంగా మారింది. గతంలో అనేకమంది త్రుటిలో ప్రమాదాలు తప్పించుకున్న సంఘటనలు సైతం ఉన్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసే అధికారులు.. ఆపై ఆ మాటే మరచిపోతుంటారని అంతా విమర్శిస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం సమీపిస్తుండడంతో జనాల్లో మళ్లీ ఆందోళనలు నెలకొన్నాయి. హాస్పిటల్ లో పెచ్చులూడుతున్న ఐడీ, సర్జికల్‌, పే రూంలల్లో మరమ్మతు చర్యలు చేపట్టకపోవడంతో చికిత్స పొందుతున్న రోగులు, వారికి సాయంగా వచ్చిన వారు భయాందోళనల్లో గడుపుతున్న దుస్థితి నెలకొంది. 
వాస్తవానికి హాస్పిటల్ ను పటిష్ట పరచేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. గతేడాది మార్చిలో జిల్లా ఆసుపత్రిని సందర్శించిన పాలనాధికారి ఆసుపత్రిలో మరమ్మతు పనుల నిమిత్తం రూ.80 లక్షలు మంజూరు చేశారు. త్వరితగితిన మరమ్మతు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్ జాప్యం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గడువు ముగిసి నెలలు గడుస్తున్నా.. సదరు గుత్తేదారు క్యాజువాలిటీ పనులు మినహా, మిగిలిన మరమ్మతు పనులు ప్రారంభించలేదన్న ఆరోపణలూ ఉన్నాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో వర్షాలు మరింత ఉధృతంగా ఉండే అవకాశాలే ఎక్కువ. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా సంబంధిత అధికారులు మరమ్మతుల పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. పై కప్పు లీకేజీ మరమ్మతు పనులు త్వతిగతిన చేపడితే వర్షాలు జోరయ్యే నాటికి పెద్దగా సమస్య ఉండదని చెప్తున్నారు. మరోవైపు చిన్నపాటి వర్షానికే ఐడీ, సర్జికల్‌, పే రూంల్లో పెచ్చులూడుతున్నట్లు అంతా అంటున్నారు. ఈ గదుల్లోనూ పై కప్పు మరమ్మతు చేపట్టాలని రోగులు, సిబ్బంది కోరుతున్నారు.

Related Posts