YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మళ్లీ తెరపైకి జన్వాడ ఫాంహౌస్

మళ్లీ తెరపైకి జన్వాడ ఫాంహౌస్

హైదరాబాద్, ఆగస్టు  28  
హైడ్రా ఏర్పాటైన తర్వాత అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. నింబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన వారు ఎంతటి వారైనా కూల్చివేతలకు వెనుకాడటం లేదు. కేటీఆర్‌ లీజుకు తీసుకున్నానని చెప్తున్న జన్వాడ ఫాంహౌస్ మరోసారి వార్తల్లోకెక్కింది. ఇరిగేషన్ అధికారులు కేటీఆర్ ఫాంహౌస్‌కి వెళ్లారు. అక్కడ కొలుతలు కూడా తీసుకున్నారు. ఫాంహౌస్‌ వ్యవహారంపై ఇరిగేషన్ శాఖతోపాటు హైడ్రాకు పలు ఫిర్యాదులు అందాయి. దీంతో వారు రంగంలోకి దిగారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలపై హైడ్రా గత కొంతకాలంగా కొరడా ఝుళిపిస్తోంది. గండిపేట్‌ జలాశయం ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న ఫాంహౌ‌స్‌లను కూల్చివేసేందుకు వివరాలు సేకరిస్తోంది. జన్వాడ ఫాంహౌస్ కూల్చివేసే విషయంలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. జీవో 99 ప్రకారమే నడుచుకోవాలని హైడ్రాను ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించి ఎఫ్‌టీఎల్ పరిధిలో ఫాంహౌస్ ఉంటే తానే దగ్గర ఉండి కూల్చివేయిస్తానని కేటీఆర్ చెప్పారు. అయితే, అక్కడ నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు అధికారులు గతంలోనే తేల్చారు.2020లోనే ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. బుల్కాపూర్ నాలాను కబ్జా చేసినట్లు రిపోర్ట్ ఇచ్చారు. స్వేచ్ఛ – బిగ్‌ టీవీ దగ్గర జన్వాడపై జరిపిన సర్వే రిపోర్ట్ ఉంది. బుల్కాపూర్‌ నాలా పక్కనే ఉన్న ఈ ఫాంహౌస్ ఉంది. మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ అక్కడే ఉండేవారు. ఫాంహౌస్ చుట్టూ కేటీఆర్ భార్య, సన్నిహితుల భూములు ఉన్నాయి. బుల్కాపూర్ నాలాను కబ్జా చేస్తూ ఫాంహౌస్ గేటు నిర్మాణం చేశారు. గేటు కారణంగా నాలా కుచించుకుపోయిందనేది రిపోర్ట్ సారాంశం. 2020లో రిపోర్ట్ తయారైనా గతంలో అధికారులు చర్యలు తీసుకోలేదు. నాలాకు 9 మీటర్ల వరకూ బఫర్ జోన్‌ ఉంది. నిబంధనల ప్రకారం బఫర్‌ జోన్‌లోనూ ఎలాంటి కట్టడాలు ఉండకూడదు. భారీ ప్రహారీ గోడను కట్టి గేటు ఏర్పాటు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఫాంహౌస్ నిర్మించారు. ఇరిగేషన్ అధికారులు కొలతలు తీసుకున్న నేపథ్యంలో జన్వాడ ఫాంహౌస్ కూల్చేస్తారనే ప్రచారం జరుగుతోంది.చాంద్రాయణగుట్టలో సలకం చెరువులో 12 ఎకరాలు కబ్జా చేసి ఒవైసీ కాలేజీ నిర్మాణం చేసినట్టు హైడ్రాకు ఫిర్యాదులు అందుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కాలేజీని కూల్చివేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో విచారణ చేపట్టిన అధికారులు ఇప్పటికే కాలేజీకి నోటీసులు పంపారు. మంగళవారం సలకం చెరువును పరిశీలించినట్టు తెలుస్తోంది. దీంతో రేపోమాపో దీన్ని కూడా కూల్చివేస్తారని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఒవైసీ కాలేజీ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఒవైసీ పెద్ద బంగ్లా నిర్మించారని, ఆయన ఇల్లు ప్రభుత్వ భూమిలో ఉండొచ్చని అన్నారు. దానిపై ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మద్దతుతోనే చెరువు కబ్జా చేసి కాలేజీ కట్టారని, 30 ఎకరాల చెరువుల్లో 12 ఎకరాలు ఆక్రమించారని ఆరోపించారు. ఒవైసీ బ్రదర్స్ ఎడ్యుకేషన్ పేరుతో కోట్లు కొల్లగొడుతోందన్న రాజాసింగ్, చెరువుల పరిరక్షణకు సీఎం చేస్తున్న పనిని అభినందిస్తున్నానని అన్నారు. సీఎంను అక్బరుద్దీన్ భయపెట్టాలని చూస్తున్నారని, ఆయన భయపడకుండా ముందుకు వెళ్లాలని సూచించారు. మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఇలాగే బెదిరిస్తే ఆయన అరెస్ట్ చేయించారని గుర్తు చేశారు. తన నియోజకవర్గంలో ఎంఐఎం నేతలు హైదరాబాద్ కలెక్టర్ మద్దతుతో ప్రభుత్వ భూములను ఆక్రమించారని ఆరోపించారు. వాటిపైనా ఎంక్వైరీ చేసి గవర్నమెంట్ ల్యాండ్‌ను కాపాడాలని కోరారు
ఎవరైనా ఒక్కటే....
హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒవైసి అయినా మల్లారెడ్డి అయినా హైడ్రాకు ఒక్కటే అన్నారు. చెరువుల్లో కాలేజీలు కడితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఒవైసి బ్రదర్స్ సలకం చెరువులో నిర్మించిన కట్టడాలను తొలగించాలని ఫిర్యాదు చేసిన బీజేపీ కార్పొరేటర్లతో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. చెరువుల్లో కాలేజీలు కట్టి ఉంటే చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని కొంత సమయం ఇస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు.రాజకీయ చదరంగంలో హైడ్రా పావు కాదన్నారు. రంగనాథ్ ను కలిసిన బీజేపీ కార్పొరేటర్లు ఓల్డ్ సిటీ చెరువులపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరారు. చెరువును ఆక్రమించి ఒవైసి సోదరులు కట్టిన భవనాలను కూల్చేయాలన్నారు.

Related Posts