YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాజముద్ర మార్పుపై గరం.. గరం...

రాజముద్ర మార్పుపై  గరం.. గరం...

వరంగల్, ఆగస్టు 28 
తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం (రాజముద్ర)లో ప్రభుత్వం మార్పులు చేసింది! తెలంగాణ ఏర్పడిన కొత్తలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాకతీయ కళాతోరణం.. ఛార్మినార్‌లతో కూడిన రాజముద్రను రూపొందించగా.. అందులో రాచరిక ఆనవాళ్లు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయించారు. మే నెలలో చిత్ర కారుడు రుద్ర రాజేశంతో చర్చించి మార్పులు, చేర్పులపై కసరత్తు చేశారు.జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లోగోను రిలీజ్ చేస్తారని అంతా భావించారు. కానీ.. వివిధ కారణాల నేపథ్యంలో రాజముద్ర ఆవిష్కరణను వాయిదా వేశారు. ఇదిలా ఉంటే.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన.. ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ ఫ్లెక్సీపై గత రాజ ముద్ర స్థానంలో కొత్త లోగో దర్శనం ఇచ్చింది. దానికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. అధికారికంగా లోగోను రిలీజ్ చేసినట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఛార్మినార్, కాకతీయ కళాతోరణాలతో రాష్ట్ర అధికార చిహ్నాన్ని రూపొందించింది. అందులో రాచరిక ఆనవాళ్లు ఉన్నాయని, అందులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులతో సమావేశమై అధికార చిహ్నంపై పలుమార్లు చర్చలు జరిపారు. 1969లో తొలి దశ ఉద్యమం జరగగా, ఆనాటి ఆనవాళ్లు, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా అధికార చిహ్నం ఉండాలని తీర్మానించారు.ఈ మేరకు రాజముద్రలో మార్పులు, చేర్పులపై చిత్ర కారుడు రుద్ర రాజేశంతో చర్చించి, రాష్ట్ర అధికారిక చిహ్నానికి తుది రూపు తీసుకొచ్చారు. కాగా జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అధికారిక చిహ్నాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయగా.. లోగో మార్పుపై బీఆర్ఎస్ నేతల అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార చిహ్నం నుంచి ఛార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగించడంపై ఆందోళనలు కూడా నిర్వహించారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో మరో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.వరంగల్‌లో కొత్త లోగో కనిపించడంతో.. ప్రభుత్వం అధికార చిహ్నాన్ని మార్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ నేతల నుంచి నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో.. సైలెంట్‌గా ప్రభుత్వం మార్పులు చేసి, రిలీజ్ చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ముద్రలో జాతీయ చిహ్నం నాలుగు సింహాల స్తూపం రాజముద్ర పైభాగంలో ఉండగా.. కింది భాగంలో అమర వీరుల స్తూపం ఉంది. అమర వీరుల స్తూపానికి ఇరువైపులా వరి గొలుసు ఉండగా.. లోగో చుట్టూ సర్కిల్ లో తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూలో రాసి ఉంది. ఇప్పటికే ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది

Related Posts