బెంగళూరు, ఆగస్టు 28,
వరుస స్కామ్‌ల ఆరోపణలు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సర్కార్ మెడకు చుట్టుకుంటున్నాయి. దీంతో కాంగ్రెస్ సర్కార్ అడకత్తెరలో పడింది. ఇప్పటికే ముడా, వాల్మీకి కుంభకోణం సెగలు ముఖ్యమంత్రి పీఠాన్ని కదిలించే స్థాయికి వెళ్లాయి. ఇప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకి చెందిన ట్రస్టుకు సర్కార్ అప్పనంగా భూములు కేటాయించిందన్న వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. దీంతో ఏ నిమిషానికి ఏం జరుగుతుందోననే టెన్షన్ వెంటాడుతోంది. ఈ అవినీతి ఆరోపణలు సీఎం సిద్ధరామయ్య సీటుకు ఎసరుపెట్టేలానే ఉన్నాయి.ముడా, వాల్మీకి కార్పొరేషన్ స్కామ్‌ల ఆరోపణలు ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్‌ను కుదిపేస్తున్నాయి. ఇప్పుడు మరో వ్యవహారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మెడకు గట్టిగా చుట్టుకుంటోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెందిన సిద్ధార్థ విహార ట్రస్టుకు రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా భూమి కేటాయించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుకు సమీపంలోని హైటెక్ డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్‌లో కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్‌మెంట్ బోర్డు.. KIADBకి చెందిన 5 ఎకరాలను కేటాయించారన్న వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో మరో కలకలకం సృష్టిస్తోంది కేఐఏడీబీకి చెందిన దాదాపు 50 ఎకరాల్లో మల్లికార్జున ఖర్గే ట్రస్టుకు 5 ఎకరాలు ప్రభుత్వం కేటాయించిందనేది బీజేపీ ప్రధాన ఆరోపణ. కేఐఏడీబీ భూమిని పొందేందుకు ఖర్గే కుటుంబం ఏరోస్పేస్ ఎంటర్ప్రెన్యూర్గా ఎప్పుడు మారిందని బీజేపీ గట్టిగా ప్రశ్నిస్తోంది. ఈ వ్యవహారంలో భారీస్థాయిలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కమలనాథులు.సిద్ధార్థ విహార ట్రస్టులో ట్రస్టీలుగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఆయన భార్య రాధాభాయ్, కుమారులు ప్రియాంక్ ఖర్గే, రాహుల్ ఖర్గే, అల్లుడు గుల్బర్గా ఎంపీ రాధాకృష్ణ ఉన్నారు. ప్రజా సౌకర్యాల కోసం ఉద్దేశించిన భూమిని ట్రస్టు ఎస్సీ కోటా కింద పొందిందని బీజేపీ ఆరోపిస్తోంది. ఇది అధికారి దుర్వినియోగం, బంధుప్రీతి కాదా? అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఈ అక్రమ కేటాయింపుపై వెంటనే విచారణ జరపాలనే డిమాండ్ తీవ్రమవుతోంది.ఇప్పటికే ముడా, వాల్మీకి స్కాంలు సీఎం సిద్ధరామయ్య రాజకీయ భవిష్యత్తుకు ప్రశ్నార్థకంగా మారాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ రోజురోజుకీ ఆందోళనల్ని తీవ్రతరం చేసింది. దీనికి పోటీగా కాంగ్రెస్ నేతలు కూడా నిరసనల బాట పట్టారు. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరిగిందంటూ సీఎం, ఆయన కుటుంబ సభ్యులపై విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. ముడా స్కామ్ ద్వారా సిద్దరామయ్య, ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర 4 వేల కోట్ల రూపాయలు భారీ భూకుంభకోణానికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. సొంత జిల్లా మైసూరులో సీఎం తన సతీమణి పార్వతమ్మ పేరిట చట్టవిరుద్ధంగా కోట్ల విలువజేసే భూములు కేటాయించుకున్నారంటోంది. ఈ కుంభకోణంలో మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ.. ముడా ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉందంటున్నారు. ముఖ్యమంత్రికి తెలియకుండానే ఇంత పెద్ద కుంభకోణం జరిగిందా అన్నతి బీజేపీ సహా విపక్షాల ప్రధాన ప్రశ్న.మరోపక్క కర్ణాటకలోని వాల్మీకి కార్పొరేషన్‌లో వెలుగు చూసిన 187 కోట్ల రూపాయల స్కామ్ ఆరోపణలు సీఎం మెడకే చుట్టుకున్నాయి. దీంతో ఈడీ, సీబీఐ, సిట్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహించారు. ఇదే సమయంలో కార్పొరేషన్ సూరింటెండెంట్ చంద్రశేఖరన్ ఆత్మహత్యకు పాల్పడటం పెను దుమారానికి తెరలేపింది. విపక్షాల వత్తిడితో సీఎం సిద్ధరామయ్య విచారణకు సిట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో పెద్ద తలకాయలు ఉన్నాయని.. ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా ఇందులో లింకులున్నాయని బీజేపీ సహా ఇతర విపక్షాలు కర్ణాటక ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.తెలంగాణలోనూ వాల్మీకి స్కాం ప్రకంపనలు రేపాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు 180 కోట్లు అక్రమంగా దారి మళ్లాయని.. హైదరాబాద్‌లోని 9 బ్యాంక్ అకౌంట్లకు 45 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని బీఆర్ఎస్.. తెలంగాణ కాంగ్రెస్ నేతలపైన ఆరోపణలు చేస్తోంది. కర్ణాటక గవర్నర్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటం.. సర్కారుకు, రాజ్‌భవన్‌కు మధ్య దూరం పెరగడంతో సీఎం సిద్ధరామయ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. ఇదిలా ఉండగానే సీఎంను మార్చాలనే డిమాండ్ కొత్తగా తెరపైకి వస్తోంది. దీంతో అక్కడ రాజకీయం ఎప్పుడేం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి.