హైదరాబాద్
పరిపాలనకు గుండెకాయ వంటి సచివాలయ ప్రాంగణంలో డిసెంబరు 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన మిలియన్ మార్చ్ తరహాలో లక్షలాది మంది తెలంగాణ బిడ్డల సమక్షంలో ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహా ప్రతిష్టాపనకు భూమి పూజ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భూమి పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించాలనుకున్నామని, వేద పండితులను సంప్రదిస్తే ఈ రోజు మినహా దసరా వరకు మంచి రోజులు లేవని చెప్పారన్నారు. ముందుగా నిర్ణయించిన మేరకు ఉప ముఖ్యమంత్రి కేరళ పర్యటనకు వెళ్లడం, మంత్రుల ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో హడావుడిగా కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వచ్చిందన్నారు.
సంకల్పం, పట్టుదల ఉంటే సాధ్యం కానిది లేదని తెలంగాణ ఉద్యమకారులు నిరూపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కరీంనగర్‌లో ఇచ్చిన మాట మేరకు సోనియా గాంధీ 60 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చారని ముఖ్యమంత్రి కొనియాడారు. 2014లో తెలంగాణ ఏర్పాటు కావడం సువర్ణాక్షరాలతో లిఖించదగిన అంశమన్నారు. 2014 నుంచి 2024 వరకు పదేళ్లు తెలంగాణను పాలించిన వారు ఎన్నెన్నో నిర్మించామని, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచామని గొప్పలు చెప్పకున్నారని,
కానీ తెలంగాణ తల్లిని తెరమరుగు చేసే ప్రయత్నం చేశారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. తామే తెలంగాణకు సర్వస్వమని భావించారని, తానే తెలంగాణ... తెలంగాణే తాను అనే విధంగా విధంగా గత పాలకులు వ్యవహరించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అలాంటి విధానాలకు విరుద్ధమన్నారు. ప్రగతి భవన్ పేరిట గడీ నిర్మించుకొని, భారీ కంచెలు ఏర్పాటు చేసుకొని వందలాది మంది పోలీసు పహారా పెట్టుకొని తెలంగాణ ప్రజలను అందులోకి రాకుండా నిషేధించారని, తాము అధికారంలో వచ్చాక ప్రగతి భవన్ పేరును ప్రజా భవన్‌గా మార్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గడీగా మారిన ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చి దేశానికి ఆదర్శంగా నిలిచామని, ఇప్పుడు ఎవరైనా ప్రజా భవన్‌లో స్వేచ్ఛగా వెళ్లవచ్చని ముఖ్యమంత్రి అన్నారు.
పాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని తాము నిర్ణయించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర పాలనకు సంబంధించిన నిర్ణయాలన్నీ ఇక్కేడ జరుగుతాయని, ప్రజలు తమ సమస్యలను తెలుపుకొనే అవకాశం ఇక్కడే ఉందని ముఖ్యమంత్రి అన్నారు. పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా, మంత్రులుగా ఉన్న వారు సచివాలయంలోకి ప్రజలకు ప్రవేశం కల్పించలేదని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో రూ.22.50 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిన వారికి రూ.కోటి పెట్టి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేందుకు మనసు రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఈ దేశం, రాష్ట్రం కోసం ఎంతో చేసిన అంబేడ్కర్, ఇందిరా గాంధీ, అంజయ్య, పి.వి.నరసింహారావు, కాకా వెంకటస్వామి విగ్రహాలు, జైపాల్ రెడ్డి సమాధి ఉన్నాయని, వీటి మధ్య రాజీవ్ గాంధీ విగ్రహం లేని లోటుగా కనిపించిందని ముఖ్యమంత్రి అన్నారు. సచివాలయం ఎదుట ప్రదేశాన్ని తమ స్వార్ధ ప్రయోజనాల కోసం కొందరు ఉంచుకోవాలని భావించారని, కానీ మేధావుల సూచన మేరకే తాము అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. దేశం కోసం ఎంతో చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తెలంగాణ తల్లి విగ్రహంతో ముడిపెట్టి దానిని వివాదం చేసేందుకు ప్రయత్నించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.