YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

బీజేపీకి 2019 టెన్షన్?

బీజేపీకి 2019 టెన్షన్?
2019 ఎన్నికల్లో బీజేపీకి కష్టమేనా? కాషాయపార్టీ రేస్ లో వెనకబడిపోతుందా? అంటే అవుననే కామెంట్సే ఎక్కువగా వినిపిస్తున్నాయి. విపక్షాలన్నీ కలిసికట్టుగా ఉంటే.. బీజేపీకి గడ్డుకాలం ఖాయమన్న విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, మిత్రపక్షాల అధినేతలను కలుసుకుంటున్నారని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలవుతామన్న భయంతోనే అందరినీ ప్రసన్నం చేసుకునే కార్యక్రమం మొదలు పెట్టిందని అంటున్నాయి. బీజేపీలో ఈ తరహా మార్పుకు ఇటీవలి ఉప ఎన్నికల రిజల్టే కారణమని విశ్లేషకులు అంటున్నారు. దేశవ్యాప్తంగా సాగిన ఈ ఎలక్షన్స్ లో కమలదళానికి చేదు అనుభవం ఎదురైంది. విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడంతో కాషాయ వర్గానికి భంగపాటు తప్పలేదు. సెమీఫైనల్ పోరుగా చెప్పుకుంటున్న ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రభ పనిచేయలేదు. దేశంలో ప్రధాని మోడీ జైత్రయాత్ర కొనసాగుతుందంటూ చెప్పుకుంటున్న కమలనాథులు విపక్షాల దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూశారు. చెప్పాలంటే ఇటీవలి బైపోల్ రిజల్ట్ బీజేపీకి ఎదురుదెబ్బే. ఉప ఎన్నికలంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా స్థానికంగా అధికారంలో ఉన్న పార్టీలకు అనుకూలంగా చాలావరకూ ఓటరు తీర్పులు వచ్చేస్తుంటాయి. కానీ ప్రస్తుత ఉప ఎన్నికలు కాస్త ప్రత్యేకం. వచ్చేఏడాది జనరల్ ఎలక్షన్లు ఉండడం... ఇటీవలే కర్ణాటక ఎన్నికలు జరగడంతో బైపోల్స్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
కర్ణాటకలో బీజేపీ అధికారానికి దూరమవడంతో.. ఉప ఎన్నికల్లో ఆ పార్టీ మంచి పర్ఫార్మెన్స్ చూపాల్సిన పరిస్థితి. అయితే.. ఈ పోరులో కాషాయ పార్టీ వెనకబడింది. 14 స్థానాల్లో ఎన్డీయే కూటమికి దక్కింది మూడే స్థానాలు. మొత్తమ్మీద ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని మోడీ, అమిత్ షాల వైఖరిలో మార్పు వచ్చింది. నాలుగేళ్లుగా బీజేపీ ఏ ఇతర పార్టీ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా సొంతంగా లోక్ సభలో ఆధిక్యంతో కొనసాగింది. వచ్చే ఏడాది సాగే సార్వత్రిక ఎన్నికల్లో ఈ తరహా ఆధిపత్యం దక్కదన్న భయం కమలం పార్టీని వెన్నాడుతోంది. ఇప్పటికే ప్రాంతీయ పార్టీలు ఏకమవుతుండడం కాంగ్రెస్ కూడా వివిధ రాష్ట్రాల్లో మిత్ర పక్షాలను ఆకట్టుకునే పనులు ముమ్మరం చేయడంతో మోడీ, అమిత్ షాలు బీజేపీని బలపరచే పని మొదలు పెట్టారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇటీవల అమిత్ షా పార్టీ కురువృద్ధుడు ఎల్ కే అద్వాని, మరో సీనియర్ నేత మురళీమనోహర్ జోషిలను కలిశారని, వివిధ రాష్ట్రాల్లోని మిత్ర పక్షాల అధ్యక్షులను కలుస్తూ వారితో స్నేహాన్ని పటిష్టం చేసుకునే కార్యక్రమం సాగిస్తున్నారని అంటున్నారు.  

Related Posts