YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇండియా చేతిలో మరో బ్రహ్మస్త్రం

ఇండియా చేతిలో మరో బ్రహ్మస్త్రం

బెంగళూరు, ఆగస్టు 30,
ప్రపంచంలో భారత్ ప్రభావవంతమైన శక్తిగా ఎదుగుతోంది. అంతర్జాతీయ వేదికలపై భారత్ అభిప్రాయానికి వేయిటేజీ కూడా పెరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. అగ్ర దేశాలు కూడా భారత్‌ అంటే ఆచి తూచి అడుగేస్తున్నాయి. చివరికి, సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధాన్ని సైతం భారత్ ఆపగలదనే అభిప్రాయానికి వచ్చేశాయి అన్ని దేశాలు. ఇలాంటి వాతావరణం మధ్య భారత్ తన సొంత రక్షణ వ్యవహారాలపై కూడా సీరియస్‌గానే ఉంది. ఇది యుద్ధాల యుగం కాదని సూచిస్తున్నప్పటికీ.. పక్కలో బల్లెం లాంటి పాకిస్తాన్, చైనాలను తేలికగా తీసుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి, సరిహద్దుల్లో చొరబాట్లను, శత్రువులను అడ్డుకోడానికే కాక.. వివిధ ఆపరేషన్లలో దేశ విద్రోహులను కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది. దీని కోసం భారత్ సైన్యానికి మరింత ఆయుధ సహకారం అవసరం ఉంది. ఇప్పటికే, భారత్ స్వయంగా తయారు చేస్తున్న రైఫిళ్లు ఉండగా.. అంతకుమించిన అవసరం ఉండగా.. తాజాగా అమెరికా నుండి 73 వేళ సిగ్ సాయర్ 716 రైఫిళ్లను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరింది.ఫిబ్రవరి 2019లో రూ.700 కోట్ల ఒప్పందం కింద సేకరించిన 72 వేల 400 ఎస్ఐజీ-716 అస్సాల్ట్ రైఫిల్స్‌లో 66 వేల 400 తుపాకులను భారత్ సైన్యం ఇప్పటికే అందుకుంది. అయితే, అమెరికాకు చెందిన సిగ్ సాయర్ కంపెనీ నుండి మరో 73 వేల ఎస్ఐజీ 716 రైఫిల్స్ కోసం రెన్యువల్ ఆర్డర్‌పై భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల సంతకం చేసింది. ఈ కొత్త కొనుగోలుకు సంబంధించిన డెలివరీలు 2025 చివరి నాటికి పూర్తవుతాయని తెలుస్తోంది. అయితే, ఈ ఒప్పందం 2024 జూన్‌లోనే ఖాయమయ్యింది. కాగా, కాంట్రాక్ట్ ముగిసిన 18 నెలలలోపు డెలివరీ చేయాల్సి ఉంది. భారత సైన్యాన్ని ఆధునీకరించే ప్రయత్నంలో మరిన్ని కోనుగోళ్లకు భారత్ ఆసక్తి చూపిస్తున్న తరుణంలో ఈ డీల్ చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది. భారత రక్షణ మంత్రిత్వ శాఖలో ఆధునీకరణ లక్ష్యాల వల్ల ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సైన్యంగా ఉన్న భారత్‌కు వీటిని విక్రయించడం గర్వంగా ఉందని సిగ్ సాయర్ కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ రాన్ కోహెన్ వెల్లడించారు. 716 మోడల్ రైఫిల్స్, ఇప్పటికే పలు సంఘర్షణ ప్రాంతాల్లో తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాయి. పాకిస్తాన్‌తో ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ నుండి చైనాతో ఉన్న వాస్తవ నియంత్రణ రేఖ వరకు.. అలాగే, జమ్మూ కశ్మీర్‌లో తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలలో కూడా ఇవి కీలకంగా పనిచేశాయి. ఇక, తాజాగా ఆర్డర్ చేస్తున్న 73 వేల అదనపు రైఫిళ్లతో భారత సైన్యంలోని మొత్తం సిగ్ సాయర్ రైఫిల్స్ సంఖ్య సుమారు లక్షా 45 వేల 400కి చేరుకుంటుంది. ఇది భారతదేశ ఫ్రంట్‌లైన్ సైనికుల ఫైర్‌పవర్‌ను గణనీయంగా పెంచుతుంది. అయితే, మరిన్ని సిగ్ సాయర్ రైఫిల్‌లను కొనుగోలు చేయాలనే నిర్ణయం కేవలం సంఖ్యకు మాత్రమే సంబంధించినది కాదు. ఇది  ఎస్ఐజీ 716 ఆయుధం పనితీరు, విశ్వసనీయతకు కూడా సంబంధించినదని భారత రక్షణ దళాలు చెబుతున్నాయి.ఇక, ప్రస్తుతం వాడుకలో ఉన్న స్వదేశీ తుపాకి ఇన్సాస్ రైఫిల్స్‌ను మరో ఆధునిక రైఫిల్‌తో భర్తీ చేయాలని సైన్యం చాలా కాలంగా అనుకుంటోంది. ఇందులో భాగంగానే, ఇటీవల 66 వేల 400 ఎస్ఐజీ   716 రైఫిళ్లను సైన్యం అందుకుంది. ప్రస్తుతం, వీటిని తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలలో పాల్గొన్న ఫ్రంట్‌లైన్ దళాలకు అందించారు. అలాగే, రష్యన్ ఏకే -203 రైఫిల్స్‌కు సంబంధించి బుల్ లైసెన్స్ తయారీకి అవసరమైన భారీ అవసరం ఉన్న తరుణంలో.. ఏకే-203 ఒప్పందంలో ఎక్కువ జాప్యం జరుగుతున్నందు వల్ల, సైన్యం ఎస్ఐజీ-716 రైఫిళ్లను తిరిగి కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ఎస్ఐజీ 716 రైఫిల్స్ కొంత మేరుకు ఉండటం సైన్యానికి బలం చేకూరస్తుందనే ఆలోచనలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.సిగ్ 716 రైఫిల్స్ ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర సైనిక దళాలు కూడా ఉపయోగిస్తున్నాయి. యూఎస్ మిలిటరీ, స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్‌తో సహా చాలా దేశాలు వాడుతున్న ఈ సిగ్ సాయర్ రైఫిల్‌ వాటి ఖచ్చితత్వం, నాణ్యత, విశ్వసనీయతను తెలియజేస్తున్నాయి. పోర్చుగల్, థాయ్‌లాండ్, వియత్నాం వంటి దేశాల్లోని భద్రతా దళాలు కూడా సిగ్ సాయర్ రైఫిల్స్‌ను ఇష్టపడుతున్నాయి. ఇలాంటి రైఫిల్ కంపెనీతో భారత్ చేసుకున్న ఈ భాగస్వామ్యం.. సిగ్ సాయర్ బ్రాండ్‌పై ప్రపంచ నమ్మకాన్ని నొక్కి చెప్పడంతో పాటు భారత సైన్యం అంతర్జాతీయ సైనిక ప్రమాణాలను కలిగిఉండటాన్ని హైలైట్ చేస్తుంది. ఇక, భారత్ అమెరికాతో తన రక్షణ సంబంధాలను బలోపేతం చేయడం కొనసాగిస్తున్న తరుణంలో.. ఈ అదనపు రైఫిల్స్ కొనుగోలు కేవలం వ్యూహాత్మక నిర్ణయంగా మాత్రమే కాకుండా.. ప్రపంచ వేదికపై భారత్ కీలక ప్లేయర్‌గా తన స్థానాన్ని బలోపేతం చేసే వ్యూహాత్మక చర్యగా తెలుస్తోంది.ఇటీవల అమెరికా పర్యటన నుండి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తిరిగి వచ్చిన తర్వాత ప్రకటించిన ఈ కొనుగోలు అంశం కీలకమైన సమయంలో జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్‌లో అమెరికాను సందర్శించనున్న తరుణంలో.. ఎస్ఐజీ-716 రైఫిల్స్ కొనుగోలు నిర్ణయం భారత్, అమెరికా మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తున్నాయని రుజువు చేస్తోంది. ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం.. భవిష్యత్ సహకారాలకు మార్గం సుగమం చేస్తుంది. అలాగే, భారత్ చుట్టూ పెరుగుతున్న భద్రతా సవాళ్ల నేపథ్యంలో భారతదేశం సైనిక పరంగా పూర్తిగా సంసిద్ధతతో ఉండటాన్ని సూచిస్తోంది. అయితే, అమెరికా నుండి కొంటున్న ఎస్ఐజీ -716 రైఫిల్స్… గతంలో రష్యా నుండి కొనుగోలు చేసిన ఏకే-203తో సరితూగుతాయా అన్నది మాత్రమే ఇప్పుడు కొంత చర్చకు దారితీసింది.

Related Posts