విజయవాడ, ఆగస్టు 31
విజయవాడ. ... ఆంధ్రుల ఆర్థిక రాజదాని. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోనూ బెజవాడ స్థానం అదే. ఏపీ రాజకీయాల్లో ఎన్నో కీలక మలుపులకు విజయవాడ కేంద్రం అయింది. అంత గొప్ప చరిత్ర ఉన్న విజయవాడ నుండి ఎంపీ గా గెలవడం అంటే మాటలు కాదు. బెజవాడ ఎంపీలు ఏపీలో చాలా పవర్ ఫుల్ అనే స్ధాయిలో పాలిటిక్స్ నడిపారు. అయితే అంత పెద్ద రాజకీయ నాయకులకూ బెజవాడ ఎంపీ స్థానం పవర్ తో పాటు ఒక శాపాన్ని కూడా ఇస్తుందా అనిపిస్తుంది వాళ్ల చరిత్ర చూస్తుంటే. బెజవాడ ఎంపీగా పనిచేసిన వాళ్ళలో చాలామంది ఆ తరువాత రాజకీయాలకు గుడ్ బై కొట్టేయడమే దానికి కారణం. వడ్డే శోభనాధ్రీశ్వర రావు.. లగడపాటి రాజ గోపాల్.. కేశినేని నాని...లాంటి పాపులర్ పొలిటీషియన్ లు కూడా బెజవాడ ఎంపీగా చక్రం తిప్పి తరువాత రాజకీయ సన్యాసం తీసుకున్న వారే కావడం గమనార్హం. అంతే కాదు వీరంతా విజయవాడ నుండి రెండేసి సార్లు ఎంపీగా గెలవడం మరో విశేషం.
వడ్డే శోభనాధ్రీశ్వర రావు
ఈ జనరేషన్ వాళ్ళకి తెలుసో లేదో కానీ ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒక వెలుగువెలిగిన వ్యక్తి వడ్డే శోభనాధ్రీశ్వర రావు. 1978 లో తొలిసారి ఎమ్మెల్యే గా ఉయ్యూరు నుండి గెలిచిన ఆయన ఆ తరువాత 1984,1991 ల్లో రెండు సార్లు విజయవాడ నుండి ఎంపీ గా గెలిచారు. జాతీయ రాజకీయాల్లో గట్టి పాత్ర పోషించారు. అందుకే ఆయనకు 1997-99 మధ్య కాలం లో ఢిల్లీ లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి దక్కింది. 1999 లో మైలవరం నుండి ఎమ్మెల్యే గా గెలిచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఆ తరువాత రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ప్రస్తుతం రైతు సమస్యలపై స్వచ్చందంగా మాట్లాడుతూ కనపడుతుంటారు తప్ప యాక్తివ్ పాలిటిక్స్ జోలికి వెళ్ళడం లేదు.
లగడపాటి రాజ గోపాల్
వైఎస్ఆర్ మరణం తర్వాత 2009 నుండి 2014 వరకూ ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకమైన వ్యక్తి ఎవరూ అంటే గుర్తుకు వచ్చే నాలుగైదు పేర్లలో లగడపాటి ఒకరు. సమైక్యాంధ్ర ఉద్యమానికి ఆయనే ముఖచిత్రం . వ్యాపార వేత్తగా రాజకీయాల్లోకి వచ్చిన లగడపాటి 2004, 2009 ఎన్నికల్లో రెండు సార్లు బెజవాడ నుండి ఎంపీగా గెలుపొందిన ఆయన తెలంగాణ ఉద్యమం ఉదృతంగా ఉన్నప్పుడు సమైక్యాంధ్ర వాయిస్ ను బలంగా వినిపించారు .ఒకానొక దశలో కేసీఆర్ తో ఢిల్లీ స్థాయిలో సై అంటే సై స్థాయిలో రాజకీయాలు నడిపారు. అప్పట్లో ఎన్నికల ఫలితాలపై సర్వేలు చేయించి వాటి ఫలితాలు ముందుగానే చెప్పేవారు.చాలాసార్లు ఇవి నిజం కావడం తో లగడపాటిని ఆంధ్రా ఆక్టోపస్ అని పిలిచేవారు.అయితే పార్లమెంట్ లో తెలంగాాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పాస్ అయితే రాజకీయ సన్యాసం చేస్తానని శపథం చేసిన రాజ గోపాల్ ఆమాటకు కట్టుబడి 2014 లో రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అడపా దడపా ఆయన పేరు రాజకీయాల్లో వినిపిస్తున్నా ..లగడపాటి మాత్రం యాక్టివ్ పాలిటిక్స్ వైపు చూడడం లేదు
కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని
గత పదేళ్లు గా విజయవాడ అంటే కేశినేని నాని అనే స్ధాయిలో స్థానికంగా పేరు తెచ్చుకున్నారు కేశినేని శ్రీనివాస్ . ఉమ్మడి ఏపీలో కేశినేని ట్రావెల్స్ పేరుతో రవాణా రంగం లో ఒక చక్రం తిప్పిన ఆయన 2014,2019 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా గెలిచారు. 2019లో అయితే ఆయన పోటీచేసిన పార్టీ ఘోరంగా ఓడిపోయినా ఆ పార్టీ నుండి గెలిచిన ముగ్గురు ఎంపీల్లో కేశినేని నాని ఒకరు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే నైజం కేశినేని నాని సొంతం.అయితే అదే ఆయనకు మైనస్ కూడా అయ్యింది అంటారు ఎనలిస్ట్ లు.చిన్న చిన్న కారణాలకు సైతం కోపం తొందరగా తెచ్చుకునే ఆయన తమ్ముడి తో ఉన్న విభేదాలతో పార్టీ మారి చివరకు తమ్ముడు కేశినేని శివనాథ్ చేతిలో ఓడిపోయారు. దానితో రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించి పొలిటికల్ గా సైలెంట్ అయిపోయారు .
చెన్నుపాటి విద్య
ప్రముఖ హేతువాది గోరా (గోపరాజు రామచంద్ర రావు కుమార్తె చెన్నుపాటి విద్య కూడా విజయవాడ నుండి రెండుసార్లు ఎంపీ గా గెలుపొందారు. 1980లో తొలిసారి 1989లో రెండోసారి బెజవాడ ఎంపీ గా గెలిచిన ఆమె స్త్రీ సంక్షేమం కోసం పాటుబడ్డారు. తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా జరిగిన ఆమె సమాజ సేవ లోనే కాలం గడిపారు.
పర్వతనేని ఉపేంద్ర
1996,1998 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ గా పనిచేసిన పర్వతనేని ఉపేంద్ర ఏపీ రాజకీయాల్లో బలమైన ముద్రే వేశారు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తొలిరోజుల్లో ఆయనకు అండగా ఉన్న వ్యక్తుల్లో ఉపేంద్ర కూడా ఒకరు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రిగా పనిచేసిన ఉపేంద్ర ప్రసార భారతి బిల్లు ను తేవడం లో కీలక పాత్ర పోషించారు. తరువాత కాంగ్రెస్ లోకి మారి విజయవాడ నుండి రెండు సార్లు ఎంపీగా గెలిచి ఆపై రాజకీయాలకు దూరంగా అంటూ వచ్చారు. 2009 లో చిరంజీవి ప్రజారాజ్యం లో చేరారు కానీ అదే ఏడాది చివరిలో మరణించారు.
KL రావు
బహుశా విజయవాడ నుండి ఎన్నికైన అతిగొప్ప ఎంపీ డా.కానూరి లక్ష్మణ రావు అలియాస్ KL రావు. నాగార్జున సాగర్ సృష్టికర్త. ప్రముఖ ఇంజనీర్ కమ్ పొలిటీషియన్. 1962,1967,1972 ఎన్నికల్లో వరుసగా బెజవాడ నుండి ఎంపీ గా గెలిచిన వ్యక్తి. నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ ల ప్రభుత్వాల్లో పదేళ్ళ పాటు కేంద్ర నీటిపారుదల శాఖ , విద్యుత్ శాఖ ల మంత్రిగా పనిచేశారు. నాగార్జున సాగర్ సహా అనేక నీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. పరక్కా,హీరాకుడ్, కోసి, చంబల్, శ్రీశైలం, మాలంపూయ,దిగువ భవానీ, తుంగ భద్ర ప్రాజెక్టులు వచ్చాయంటే అది KL రావు కృషి మాత్రమే. ఆయన సేవలకు గుర్తుగా పులిచింతల ప్రాజెక్టు కు ఆయన పేరే పెట్టింది ప్రభుత్వం. అయితే 1980 నుండి రాజకీయాలకు దూరంగా ఉన్న KL రావు ఆరేళ్ల తర్వాత 1986లో మరణించారు. మూడుసార్లు రాష్ట్రపతి పురస్కారం తో పాటు పద్మ భూషణ్ బిరుదు నూ పొందిన మహనీయుడు అయన.
గద్దె రామ్మోహన్ ఒక్కరే మినహాయింపు
అయితే విజయవాడ ఎంపీ గా పోటీ చేసి ఆ తరువాత కూడా రాజకీయాల్లో కొనసాగుతున్న వ్యక్తి గా గద్దె రామ్మోహన్ రావు ను చెప్పుకోవచ్చు. 1994 లో గన్నవరం ఎమ్మెల్యే గా గెలిచిన గద్దె 1999లో విజయవాడ ఎంపీ గా లోక్ సభ కు వెళ్లారు. ఆతరువాత 2014,2019 ,2024 ఎన్నికల్లో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గా గెలిచారు. బెజవాడ ఎంపీ గా పనిచేసి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్న వ్యక్తి ప్రస్తుతానికి ఒక్క గద్దె రామ్మోహన్ మాత్రమే కావడం విశేషం