కాకినాడ, ఆగస్టు 31,
సాధారణంగా మున్సిపల్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా వాగ్వాదాలకు దారి తీస్తూంటాయి. అతి తక్కువగా దాడుల వరకూ వెళ్తూంటాయి. కానీ అధికారులు ఎప్పుడూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న సందర్భాలు లేవు. ఇంకా ప్రజా ప్రతినిధులు అధికారులపై మండిపడటం సహజమే కానీ..దాడి చేయడం కూడా ఉండదు. కానీ పిఠాపురంలో మాత్రం ఇద్దరు అధికారులు ఒకరిపై ఒకరు దాడి చేసి కొట్టేసుకున్నారు. సమావేశానికి హాజరైన కౌన్సిలర్లంతా ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయారు. పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి కౌన్సిలర్లు , ప్రజా ప్రతినిధులు... అధికారులు అందరూ హాజరయ్యారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లింపులు విషయమై కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ కనకరావు సమాధానం ఇచ్చారు. అయితే ఆయన సమాధానం డి.ఈ.ఈ గా ఉన్న భవానీ శంకర్ కు కోపం తెప్పించింది. ఎందుకంటే ఆయననే తప్పు పడుతూ సమాధానం ఇచ్చారు. దీంతో వెంటనే డీఈఈ భవానీ శంకర్ లేచి.. కమిషనర్ కనకారావుపై ప్రత్యారోపణలు చేశారు. మెల్లగా వివాదం ముదిరింది. మొదట తిట్టుకున్నారు. తర్వాత నెట్టుకున్నారు. ఆ తర్వాత పిడిగుద్దులు గుద్దుకున్నారు. అధికారులు కొట్టుకోవడం ప్రారంభించడంతో కౌన్సిలర్లు అవాక్కయ్యారు. వెంటనే కొంత మంది తోటి ఉద్యోగులతో పాటు.. కౌన్సిలర్లు వారిని విడదీసి బయటకు పంపే ప్రయత్నం చేశారు. చాలా సేపటి వరకూ వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేశారు. నిజానికి ఈ ఇద్దరు అధికారుల మధ్య ఆధిపత్య పోరాటం చాలా కాలంగా నడుస్తోందని చెబుతున్నారు. మొదటి నుంచి పిఠాపురంలో పని చేస్తున్న వీరిద్దరూ అధికార పార్టీ సాయంతో హవా చెలాయిచేవారు. అయితే తర్వాత వారి మధ్య వివాదాలు వచ్చాయి. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో కీలక అధికారులు సెలవులు పెట్టి వెళ్లిపోయారు. వారిలో కమిషనర్ కూడా ఉన్నారు. ఎన్నికలు అయిన తర్వాత మళ్లీ విధుల్లో చేరినప్పటికీ.. కమిషనర్ కనకరావు, డి.ఈ.ఈ భవాని శంకర్ ఒకరినొకరు సహకరించుకోవడం లేదు. ఎవరికి వారు కలెక్టర్ కు రిపోర్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వివాదం ముదిరి ఏకంగాకౌన్సిల్ సమావేశంలోనే దాడులకు దిగడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఇరువురిపై చర్యలు తీసుకునే అవకాశాల్ని పరిశీలిస్తున్నారు .