YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చివరి దశకు పోలవరం డయాఫ్రమ్ వాల్

చివరి దశకు పోలవరం డయాఫ్రమ్ వాల్
పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చివరి దశకు వచ్చింది. మరో వారం రోజుల్లోగా ఈ నిర్మాణం పూర్తికాకపోతే మరో వేసవి సీజన్ వరకు అంటే ఇంకో ఏడాది ఆగాల్సిందే. చివరి 20 మీటర్ల డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని ఇంజినీర్లంతా దృష్టి కేంద్రీకరించడంతో ఉత్కంఠభరితంగా మారింది. వేసవిలో గోదావరిలో నీటి పరిమాణం తక్కువగా ఉంటుంది. దీనితో వారం వారం లక్ష్యాలు నిర్దేశించుకుని, డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసుకుంటూ వస్తున్నారు. డయాఫ్రం వాల్ నిర్మాణానికి విలక్షణ రీతిలో కాంక్రీటును భూమి గర్భంలోంచి వేసుకుంటూ రావాలి. గోదావరి నది కుడి గట్టు వైపు నుంచి చేపట్టిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రస్తుతం ఎడమ గట్టు వైపు దేవీపట్నం మండలం అంగుళూరు వద్దకు చేరుకుంది. ఇప్పటివరకు నీటి పరిమాణం కాస్త తక్కువగా ఉండటంతో గోదావరికి అడ్డుకట్టలు వేసి నీటి ప్రవాహాన్ని మళ్ళిస్తూ పనులు చేసుకుంటూ వచ్చారు. ఇక చివరి 20 మీటర్ల నిర్మాణం పూర్తికావాల్సి వుంది. ఒకవైపు గోదావరి నదిలో నీటి లభ్యత పెరుగుతోంది. మరో వైపు వర్షాల సీజను మొదలైంది. ఇంకోవైపు గోదావరి డెల్టాలకు ఖరీఫ్ సాగు నిమిత్తం కాటన్ బ్యారేజి నుంచి నీటి విడుదల మొదలైంది. అంటే నదిలో నీటి ప్రవాహం పెరగడంతోపాటు, నీటి అవసరం కూడా పెరగడంతో వస్తున్న నీటిని ఎక్కువ కాలం ఆపే అవకాశం లేదు. దీనితో తక్కువ నీరు ఉన్నపుడే ఈ పనులు నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తిచేయాలనేది ఇంజినీర్లకు సవాల్‌గావుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీజన్‌లోనే పూర్తిచేయకపోతే మిగిలిన 20 మీటర్ల పనికోసం మళ్లీ ఒక వేసవి సీజన్ కోసం ఎదురు చూడాల్సిందే. అందుకే ముందుగా వేసుకున్న రోజువారీ పని కార్యాచరణ మేరకు పనులు జరుగుతున్నప్పటికీ, నీటి పరిమాణం పెరిగితే పనులు అర్ధాంతరంగా నిలపాల్సివస్తుందేమోననే ఆందోళన అందరిలోనూ నెలకొంది. అయితే ప్రస్తుతంవున్న పరిస్థితుల రీత్యా చివరి దశ 20 మీటర్ల డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కచ్చితంగా వారంలోగా పూర్తికానుందని ఇంజినీర్లు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఈ నిర్మాణం జరుగుతున్నప్పటికీ డెల్టాలకు సాగు నీటి విడుదలలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అడ్డుకట్ట దిగువన తూరలు ఏర్పాటు చేయడం ద్వారా నీటి ప్రవాహాన్ని విడిచి పెడుతున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పొడవు మొత్తం 1397 మీటర్లు. ఇందులో మిగిలిన 20 మీటర్లు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తయితే ఇక వచ్చే వేసవి సీజన్ వరకు ఆగాల్సిన పనిలేదు. మిగిలిన పనులన్నీ చక చకా జరిగిపోయే అవకాశంతో ముందుకెళ్ళిపోవచ్చు. ఒక ప్రత్యేక తరహాలో ఈ ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియ జరుగుతోంది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కూడా ఒక ప్రత్యేక నిర్మాణంగానే చెప్పొచ్చు. ఏ ప్రాజెక్టుకైనా నదీ ప్రవాహ మార్గంలోనే డ్యామ్, స్పిల్‌వే గేట్లు నిర్మిస్తారు. కానీ పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన ఎర్త్‌కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ గోదావరి నది సహజ మార్గంలో నిర్మిస్తూ స్పిల్ వే మాత్రం నదీ ప్రవాహాన్ని పక్కకి మళ్ళించి ఆ మళ్ళింపు మార్గంలో నిర్మించడం ప్రత్యేకతగా చెప్పవచ్చు. ప్రపంచంలోనే ఏ నీటిపారుదల ప్రాజెక్టుకు లేని అత్యంత పొడవైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఈ ప్రాజెక్టు మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు.

Related Posts