బీజేపీకి కొంత ఊరట లభించినట్లయింది. మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భాగస్వామ్య పక్షాల్లో ఒక్కటైన అకాళీదళ్ తాము ఎన్డీఏతో ఉంటామని స్పష్టం చేయడం విశేషం. ఎన్డీఏలోని భాగస్వామ్య పక్షాలను సంతృప్తి పర్చేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. భాగస్వామ్య పక్షాలతో ఆయన నేరుగా సమావేశమై నాలుగేళ్లలో మోడీ సర్కార్ సాధించిన ప్రగతిని వివరిస్తున్నారు.నాలుగేళ్ల ప్రగతితో పాటు భవిష్యత్ ప్రణాళిక, భారతదేశానికి మోడీ మరోసారి ప్రధాని అయ్యే అవసరాన్ని ఆయన మిత్రపక్షాలకు గుర్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు అకాళీ దళ్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ తో అమిత్ షా భేటీ అయ్యారు. అకాళీదళ్ కూడా అనేక అంశాల్లో బీజేపీని ఇటీవల కాలంలో వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అమిత్ షాతో భేటీ అనంతరం బాదల్ మీడియాతో మాట్లాడుతూ తాము ఎన్డీఏతో ఉంటామని, విభేదాలను పక్కనపెట్టి విపక్షాలను సమర్థవంతంగా ఎదుర్కొనాలని ఆయన పిలుపునివ్వడం విశేషం.ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఎన్డీఏ మిత్రపక్షాలు దూరమవుతున్నాయి. ఇప్పటికే బలమైన మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకుని వెళ్లిపోయింది. అలాగే శివసేన కూడా బీజేపీకి రాం రాం చెప్పేసింది. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేతో సమావేశమైన అమిత్ షా పార్టీ, ప్రభుత్వం గురించి ఆయనకు వివరించినా, వచ్చే ఎన్నికలలో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది. దీతో అమిత్ షా చర్చలు సఫలం కాలేదని చెబుతున్నారు. కాని అకాళీదళ్ మిత్రపక్షంగా కొనసాగుతామని స్పష్టం చేయడంతో కొంత ఊరట లభించినట్లయింది. భవిష్యత్తులో మిత్రపక్షాలన్నీ తమతోనే కలసి వస్తాయని కమలనాధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.