ఆంధ్రా ఆక్టోపస్ మళ్లీ ఏపీ రాజకీయాల్లోకి రావాలని భావిస్తోందా? విభజనతో తీవ్ర మనస్థాపానికి గురైన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారా? తనకు అచ్చొచ్చిన సీటు నుంచి బరిలోకి దిగుదామని భావించినా.. అది కుదరకపోవడంతో ఎలాగైనా రాజ్యసభ కోటాలో అయినా ఎంపీ పదవి కొట్టేసే పనిలో పడ్డారా? టీడీపీ అధినేత చంద్రబాబుకు దగ్గర అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కొద్ది రోజులుగా ఏపీలో సర్వేలు నిర్వహిస్తూ.. టీడీపీకి మంచి మార్కులేస్తున్న ఆయన.. బాబును ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని తెలుస్తోంది. ఆయన ఇటీవల చంద్రబాబును కలిసి తన సర్వే ఫలితాలను ఆయనకు అందించారు. అయితే సర్వేల పేరుతో బాబుకు దగ్గరయ్యేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సర్వే పేరు చెబితే రెండు రాష్ట్రాల్లో ముందుగా గుర్తొచ్చే పేరు లగడపాటి రాజగోపాల్! ఎగ్జిట్ పోల్స్ అంత కరెక్టుగా ఇవ్వడం.. ఆయనకు సాధ్యమైనంతగా మరెవరికీ సాధ్యం కాదేమో! కచ్చితమైన సమాచారంతో ఆయన చేసే సర్వేలపై రాజకీయ నాయకులు ఆధారపడుతుంటారనడంలో సందేహం లేదు. విభజన సమయంలో తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన లగడపాటి.. పెప్పర్ స్ప్రే జల్లి ఫేమస్ అయ్యారు. విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన.. 2019లో మళ్లీ రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నారని తెలుస్తోంది. టీడీపీలో చేరేందుకు ఆయన సుముఖంగానే ఉన్నా.. సీటు విషయంలోనే కొంత ఆలోచిస్తున్నట్లు సమాచారం. లగడపాటి గతంలో విజయవాడ నుంచి ఎంపీగా గెలుపొందారు. దీంతో ఆయనకు ఆ ప్రాంతంలో మంచి పట్టు ఉంది. ప్రస్తుతం టీడీపీలో చేరితే ఆయన మళ్లీ విజయవాడ టికెట్ నుంచి పోటీచేయాలని భావిస్తున్నారట. ఇదే విషయాన్ని అధినేత చంద్రబాబుకు చెప్పినా.. ఆయన అందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది.ప్రస్తుతం విజయవాడ నుంచి కేశినేని నాని ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకే సీటు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఆయన్ను కాదని వేరే వ్యక్తికి సీటు అప్పగించే సాహసం చంద్రబాబు చేయకపోవచ్చని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో లగడపాటి రాజ్యసభకు అయినా పంపాలని చంద్రబాబును పదే పదే కోరుతున్నట్టు తెలుస్తోంది. లగడపాటి లాంటి వ్యక్తిని ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యసభకు పంపితే పార్టీలో అసంతృప్తి మరింత ఎక్కువయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే గత మూడు టర్మ్‌లలోనూ ఓ ప్రధాన సామాజికవర్గం వాళ్లే రాజ్యసభకు వెళుతున్నారు. గత టర్మ్ లో అయినా బీసీ, ఎస్సీలను రాజ్యసభకు పంపుతారని అనుకుంటే చంద్రబాబు వారి ఆశలను అడియాసలు చేసేశారు. కనకమేడల లాంటి ఎవ్వరూ ఊహించని వ్యక్తులను రాజ్యసభకు పంపారు. విజయవాడ లోక్‌సభ సీటు అంటే ఎంతో మక్కువతో ఉన్న లగడపాటి అక్కడ పోటీ చేసేందుకు ఏ మాత్రం స్కోప్ లేకపోవడంతో ఇప్పుడు రాజ్యసభ కోసమే బాబు చుట్టూ ఎక్కువ చక్కెర్లు కొడుతున్నట్టు టీడీపీ వర్గాల్లోనే చర్చలు నడుస్తున్నాయి. ఈ విషయంపై బాబు ఎటూ తేల్చకపోవడంతో సర్వేల పేరుతో ఆయనకు దగ్గరవ్వాలని చూస్తున్నారట.ఇటీవల చంద్రబాబును కలసిన లగడపాటి.. తాను చేసిన సర్వే ముందుంచారట. ఆయన ఇచ్చిన సర్వే రిపోర్టు ఎక్కడ తెలుగుదేశం వీక్ గా ఉంది? ఎక్కడ బలంగా ఉంది ? తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి ? ఎక్కడ కేండిడేట్ లను మార్చాలి ? వంటి వాటితో కూడిన రిపోర్టు అని తెలుస్తోంది. ఇందులో టీడీపీకి 130 సీట్లు వస్తాయని సర్వేలో తేలిందని తెలుగుదేశం వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఇది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపింది. పనిలో పనిగా బాబు కూడా సంతోషిస్తారు. తన రాజ్యసభ సీటు కోసం ఇవన్నీ ఇచ్చి.. బాబును ప్రసన్నం చేసుకునేందుకు పెద్ద స్కెచ్ వేశారంటున్నారన్నది టీడీపీ వర్గాల్లోనే వినిపిస్తోన్న టాక్?