YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పీకల్లోతు కష్టాల్లో బెజవాడ..

 పీకల్లోతు కష్టాల్లో బెజవాడ..

విజయవాడ,  సెప్టెంబర్  3
ఆగస్టు 30 నుంచి నిన్నటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థమైంది. ఆకస్మిక వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వగా.. పీకల్లోతు నీటిలో ఉన్నవారందరినీ రెస్క్యూ బృందాలు బోట్లు, ట్రాక్టర్ల సహాయంతో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భారీ వర్షానికి విజయవాడ పరిస్థితి దయనీయంగా మారింది. వర్షాలు తగ్గినా.. బుడమేరు కట్ట తెగడంతో సింగ్ నగర్, రాణిగారితోట, ఆ పరిసర ప్రాంతాలు వరదముంపుకు గురయ్యాయి. అక్కడి నివాసితులంతా ఇళ్లను వదిలేసి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.మరోవైపు.. ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తడంతో అధికారులు 70 గేట్లను ఎత్తి వరద నీటిని సముద్రంలోకి వదిలారు. విజయవాడను కృష్ణమ్మ పరవళ్ల నుంచి కాపాడేందుకు కట్టిన రిటైనింగ్ వాల్ కూడా వరద తాకిడికి ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణలంక ప్రాంతం ఇప్పటికే నీటిలో నానుతోంది. రిటైనింగ్ వాల్ కట్టను తెంచుకుని కృష్ణమ్మ దారితప్పితే కృష్ణలంక కూడా వరదనీటిలో పూర్తిగా మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. స్థానికులు ఇసుక కట్టలతో వరద తాకిడికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదికి వస్తున్న వరదను గడిచిన 121 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదంటున్నారు అధికారులు. 1903 అక్టోబర్ లో 10 లక్షల 60వేల 830 క్యూసెక్కుల వరద రాగా.. ఆ తర్వాత 106 సంవత్సరాలకు 2009 అక్టోబర్ లో 10 లక్షల 94 వేల 422 క్యూసెక్కుల వరద నదికి పోటెత్తింది. ఈసారి వచ్చిన వరద ఆ రికార్డును దాటేసింది. ఏకంగా 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. 11.36 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి 500 క్యూసెక్కుల నీటిని పంట కాల్వల్లోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద నది నీటిమట్టం 24.2 అడుగుల వద్ద ఉండగా.. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.కృష్ణమ్మ ఉగ్ర రూపాన్ని చూసిన ప్రజలు.. అమ్మా !శాంతించమ్మా.. అంటూ పూజలు చేస్తున్నారు. కృష్ణమ్మ ఉరకలు చూసి భయాందోళనకు గురవుతున్నారు. వరద మరింత పెరిగితే మరిన్ని లోతట్టు ప్రాంతాలు, చుట్టుపక్కల గ్రామాలు వరద ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.బ్యారేజీ గేట్లన్నీ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండగా.. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మను చూసేందుకు విజయవాడ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఘాట్ కు పర్యాటకులు పోటెత్తుతున్నారు. లేక్ వ్యూ పాయింట్ పార్క్ లోకి వరద నీరు ఎదురు వస్తుండటంతో పార్క్ ను క్లోజ్ చేశారు. సందర్శకులెవరూ రావొద్దని పోలీసులు వారిస్తున్నా.. జనం వినకుండా నది వద్దకు చేరుకుంటుండటంతో వారిని కంట్రోల్ చేయడం పెద్ద టాస్క్ గా మారింది. ప్రకాశం బ్యారేజీ వద్ద పిల్లర్ నంబర్ 69కి బోట్లు కొట్టుకు రావడంతో.. పిల్లర్ పాక్షికంగా డ్యామేజ్ అయినట్లు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వచ్చే ట్రైన్ మార్గం మధ్యలో మహబూబాబాద్ వద్ద ట్రాక్ కొట్టుకుపోవడంతో.. ఆ మార్గంలో వచ్చే రైళ్లను గుంటూరు మీదుగా దారి మళ్లించిన విషయం విధితమే. అవన్నీ కృష్ణానది రైల్వే బ్రిడ్జిని దాటి విజయవాడ స్టేషన్ మీదుగా గమ్యస్థానానికి చేరుకావాల్సినవి. ఈ క్రమంలో బ్రిడ్జి మీది నుంచి వెళ్లే రైళ్లలో ఉండే ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. నదికి, ట్రాక్ కు కొంచెం గ్యాప్ మాత్రమే ఉండటంతో ఏ క్షణానైనా ట్రాక్ మునిగిపోయే ప్రమాదం ఉందంటున్నారు. దీంతో విజయవాడ నుంచి, విజయవాడ మీదుగా ఆ బ్రిడ్జి నుంచి వెళ్లే రైళ్లను రైల్వే శాఖ అధికారులు తాత్కాలికంగా క్యాన్సిల్ చేశారు.ఆగస్టు 31న రాత్రి సికింద్రాబాద్ నుంచి బయల్దేరి.. 8-9 గంటల్లో గమ్యస్థానాలను చేరుకోవాల్సిన బీదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, సింహపురి ఎక్స్ ప్రెస్ రైళ్లు.. 25 నుంచ30 గంటల తర్వాత గమ్యస్థానాలను చేరుకున్నాయి. విజయవాడ నుంచి వయా వరంగల్ సికింద్రాబాద్ వెళ్లాల్సిన రైళ్లు సైతం ఆలస్యమయ్యాయి. హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని రైల్వే అధికారులు, ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.

Related Posts