YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గులాబీకి గ్రాఫ్ టెన్షన్ కొత్త పథకాలతో కేసీఆర్

గులాబీకి గ్రాఫ్ టెన్షన్ కొత్త పథకాలతో కేసీఆర్
2019 ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కారు ఎంత వేగంతో దూసుకుపోతుంది? మాట్లాడితే 100కు పైగా సీట్లు వ‌స్తాయ‌ని ఎంతో ధీమాగా చెప్పే గులాబీ బాస్ కేసీఆర్.. ఇంత హ‌డావుడిగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌పై వ‌రాలు ఎందుకు ప్ర‌క‌టిస్తున్నారు? దీని వెనుక ఉన్న మ‌త‌ల‌బు ఏమిటి? అనే సందేహాలు అంద‌రిలోనూ వ‌స్తున్నాయి! ప్ర‌స్తుతం తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు అంతా బాగానే ఉంద‌ని అనిపిస్తున్నా.. నేత‌లంద‌రూ మేక‌పోతు గాంభీర్యం న‌టిస్తున్నార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నా యి. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలు నెర‌వేర్చింది ఒక్క టీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మేన‌ని గ‌ర్వంగా ప్ర‌క‌టించు కున్న కేసీఆర్‌లోనూ.. భ‌యం మొద‌లైంద‌ట‌. వ‌చ్చే ఎన్నికల్లో `కారు` ప్ర‌యాణం ఏ మాత్రం స‌జావుగా ఉండ‌ద‌నే విష‌యం టీఆర్ఎస్ నేత‌ల్లో గుబులు రేపుతోంది. దాదాపు 39 స్థానాల్లో టీఆర్ఎస్‌కు ఎదురుగాలి వీస్తోందంటూ కేసీఆర్ ప్ర‌క‌టించ‌డం ఇప్పుడు స‌ర్వ‌త్రా చర్చ‌నీయాంశంగా మారింది. ఏపీలోని టీడీపీతో పోల్చుకుంటే తెలంగాణ‌లో టీఆర్ఎస్ ప‌రిస్థితి కొంత మెరుగ్గా ఉంద‌నే అభిప్రాయాలు అక్క‌డ‌క్కడా వినిపిస్తున్నాయి. 2019 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ గట్టెక్కేస్తుంద‌ని గులాబీ నేత‌లు చాలా ధీమాగా ఉన్నారు. సీఎం కేసీఆర్ కూడా ఇదే మాట ప‌దేప‌దే చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో మ‌రోప‌క్క రైతుల‌తో పాటు అన్ని వ‌ర్గాల‌ను త‌మ వైపు తిప్పుకొనేందుకు జ‌నాక‌ర్ష‌క ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతూనే ఉన్నారు. అయితే ఇదంతా ఎన్నిక‌ల స్టంట్‌లో భాగ‌మేనంటు న్నారు విశ్లేష‌కులు. స‌ర్వేల్లో 100కి పైగా సీట్లు వ‌స్తాయని కేసీఆర్ చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి మాత్రం అందు కు పూర్తి భిన్నంగా ఉన్నాయనే సంకేతాలు వెలువడ్డాయి. సాక్ష్యాత్తూ సీఎం కెసీఆరే అధికార పార్టీకి చెందిన 39 మంది నియోజ కవర్గాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని..దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే అంతే సంగతులు అని హెచ్చరిక లు జారీ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. టీఆర్ఎస్ గత ఎన్నికల సమయంలో కేవలం 63 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాజకీయ పునరేకీకరణ పేరుతో ఫిరాయింపులను దాదాపు 27 మంది ఎమ్మెల్యేల‌ను కారెక్కించేశారు. దీంతో టీఆర్ఎస్ బ‌లం 90కి పెరిగింది. కేసీఆర్ లెక్క‌ల ప్ర‌కారం.. టీఆర్ఎస్ సొంత బలం 63.. ఇందులో 39 మందికి గెలుపు ఛాన్స్ తక్కువ ఉంద‌ట‌. అంటే టీఆర్ఎస్ ఫిగర్ 24కు పడిపోతుంది. పోనీ 90 మందితో లెక్కిస్తే 51కి పడిపోతుంద‌ని తెలుస్తోంది. ఏ లెక్కన చూసుకున్నా వచ్చే ఎన్నికలు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయనే విషయాన్ని తాజా సర్వేలు తేల్చిచెప్పినట్లు వెల్లడవుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన `రైతు బంధు` పథ‌కం ప్రారంభించిన తర్వాత సర్వేలోనూ ఈ ఫలితాలు రావటం అధికార పార్టీ నేతలను విస్మయానికి గురిచేస్తోంది.కేసీఆర్ అసలు పరిస్థితి గ్రహించే వరస పెట్టి స్కీమ్ లు ప్రకటిస్తూ రైతులు.. ప్రజలను ఆకర్షించే పనిలో ప‌డ్డార‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. అయినా పరిస్థితుల్లో మార్పు రావ‌డం లేద‌ట‌. రైతు బంధు పథకంతో గ్రామీణ ప్రాంతాల్లోని పేద రైతుల కంటే సంపన్న రైతులకు ఎక్కువ ప్రయోజనం చేకూరటం, అసలైన వ్యవసాయదారులుగా ఉన్న కౌలు రైతులను ఏ మాత్రం పట్టించుకోకపోవటం సర్కారుకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇంత కాలం వంద సీట్లకు పైగా సాధిస్తామని చెబుతున్న కేసీఆర్ కు తాజా పరిణామం గొంతులో వెల‌క్కాయ ప‌డిన‌ట్లు మారింద‌ట‌. ఇప్ప‌టికే ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌లేద‌ని అటు యువ‌త‌, నిరుద్యోగుల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రోప‌క్క ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఏక‌తాటిపైకి చేరుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు ర‌చిస్తారోన‌నే అంశం ఆస‌క్తిక‌రంగా మారింది.

Related Posts