విజయవాడ, సెప్టెంబర్ 3,
ఆంధ్రప్రదేశ్‌కు వాయుగండం ముప్పు తొలగిపోయిందని ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇంతలో మరో ముప్పు ఏపీని వెంటాడుతోంది. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నెల 5, 6 తేదీల్లో బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్ ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకొని ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మళ్లీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. ఒకవేళ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం మెల్లిగా బలపడి తుఫాన్‌గా మారి విశాఖపట్నం, ఒడిశా దిశగా ప్రయాణించి తీరం దాటే అవకాశం ఉన్నట్లు మరో అంచనా వేస్తున్నారు. బుధవారంలోపు ఈ అల్పపీడనంపై పూర్తిగా క్లారిటీ వస్తుందంటున్నారు.ఈ అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 6, 7 తేదీల్లో కోస్తాలోని పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు.. అక్కడక్కడ మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ నెల 7న ఉమ్మడి తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. వాయుగుండం ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే మరో అల్పపీడనం ఇప్పుడు అందరిని టెన్షన్ పెట్టిస్తోంది.అంతేకాదు రాజస్థాన్‌లోని జైసల్మేర్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా మచిలీపట్నం వరకు రుతుపవన ద్రోణి ఆవరించబోతున్నట్లు మరో అంచనా ఉంది. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం హారాష్ట్రలోని తూర్పు విదర్భ, తెలంగాణ పరిసరాల్లో కొనసాగుతోంది. ఈ వాయుగుండం రాబోయే 12 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుందని తెలిపింది వాతావరణశాఖ. ఈ ప్రభావంతో ఏపీలో రాబోయే ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెబుతున్నారు.వచ్చే రెండు, మూడు రోజుల్లో కృష్ణానదికి వరద ప్రవాహం మళ్లీ పెరిగే అవకాశం ఉందంటున్నారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి.. ఇప్పటికే కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలకు వరద పెరుగుతుందని ఓ అంచనా ఉంది. ప్రస్తుతం ఉన్న వరద మంగళ, బుధవారాల్లో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద కాస్త తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం బ్యారేజీ దగ్గర 9.40 క్యుసెక్కుల వరద ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇవాళ మరికొంత వరద తగ్గే అవకాశం ఉంది.