న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3,
అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. రైతులకు సంబంధించిన 7 కీలక నిర్ణయాలు తీసుకుంది. వివిధ పథకాలకు రూ.13,966 కోట్లు కేటాయించింది. ఈ క్రమంలోనే రైతులకు సత్వరంగా లోన్లు ఇచ్చేందుకు పథకాన్ని ప్రకటించింది. కేవలం 20 నిమిషాల్లోనే రైతులకు రుణాలు అందించేలా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కేంద్రం తీసుకువస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇందులో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌కు రూ.2,817 కోట్లు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ రంగానికి టెక్నాలజీని అనుసంధానం చేయడంలో భాగంగానే ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌ను తీసుకువచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.మొత్తం వ్యవసాయ రంగానికి సంబంధించి 7 పథకాలకు కేంద్ర ప్రభుత్వం రూ.13,966 కోట్లను కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం కల్పించిందని అశ్వినీ వైష్ణవ్ వివరించారు. రూ.2,817 కోట్ల డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ పథకం.. క్రాప్ సైన్స్ కోసం రూ.3,979 కోట్లు కేటాయించింది. వ్యవసాయ విద్య, నిర్వహణను బలోపేతం చేసేందుకు రూ.2,291 కోట్ల విలువైన కార్యక్రమానికి ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. పశువుల సుస్థిర ఆరోగ్యం, వాటి ఉత్పత్తి కోసం రూ.1,702 కోట్లతో స్కీమ్‌కి సైతం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఉద్యానవనాల సుస్థిర అభివృద్ధికి రూ.860 కోట్లతో మరో బృహత్తర పథకానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. దీంతోపాటు వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలను బలోపేతం చేసేందుకు రూ.1,202 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. అదే సమయంలో సహజ వనరుల నిర్వహణకు సంబంధించిన పథకానికి రూ.1,115 కోట్లు వెచ్చించనున్నారు.దేశంలో వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తూ రైతులకు మరింత మేలు చేసేలా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ తీసుకువచ్చినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ద్వారా 20 నిమిషాల్లోనే రైతులు రుణాలు పొందే కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తుందని తెలిపారు. అంతేకాదు 2047 నాటికి వాతావరణ పరిస్థితులను తట్టుకుని పంటలు పండించేలా రైతులను సిద్ధం చేయడం వంటి కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ బలోపేతానికి రూ.2,291 కోట్లతో ప్రణాళిక రచించింది. ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా పరిశోధనలు చేయాలని సూచించింది.