బస్తర్
చత్తీస్-ఘడ్ బస్తర్ డివిజన్ లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలకు,మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందగా భారీగా ఆయుధాలు మరియు పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బీజాపూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దు బైరాంఘడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం ఏర్పాటు చేశారని సమాచారంతో భద్రతా బలగాలు ఈరోజు ఉదయం సుమారు ఏడు గంటల సమయంలో మావోయిస్టులు ఉన్న ప్రాంతంలోకి ప్రవేశించారు.
దీంతో పోలీసుల రాకను గుర్తించిన మావోయిస్టులు కాల్పులకు దిగడంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు.
దాదాపు నాలుగు గంటల పాటు ఇరువురు మధ్య కాల్పులు జరిగిన అనంతరం ఘటనా స్థలంలో 9 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యం కాగా SLR,303,12 బోర్ ఆయుధాలతోపాటు భారీగా పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నామని ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని,ఘటన స్థలంలో సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతుందని,బస్తర్ డివిజన్ ఐజి సుందర్ రాజ్ మరియు దంతెవాడ ఎస్పి గౌరవ్ రాయ్ వెల్లడించారు.