సినిమా హీరోగా రజనీకాంత్ ఇమేజ్ వేరు, రాజకీయ నేతగా రజనీకాంత్ వేరు. హీరోగా రజనీకాంత్‌ను అభిమానించే వాళ్లంతా రాజకీయాల్లోనూ ఆయనను సమర్థించాలని లేదు. సమర్థించాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇప్పుడు రజనీకాంత్.. కాస్త అటూఇటూ దశలో ఉన్నాడు. రాజకీయాల్లోకి వచ్చేసినట్టే.. అనేది రజనీకాంత్ మాట. అలాగని రజనీ రాజకీయానికి ఒక రూపు లేదు. ఎన్నికలనాటికి వస్తా.. అన్నట్టుగా రజనీకాంత్ సాగుతున్నాడు. ఈ అటూఇటూ కాని ప్రయాణం అంతిమంగా ‘కాలా’ సినిమా మీద కూడా పడేలా ఉంది. ట్రేడ్ నిపుణులు ఈ మాట చెబుతూ ఉన్నారు. రజనీకాంత్ పొలిటిక్ ఎంట్రీ కాలా సినిమా వసూళ్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు. తమిళనాట సినీ అభిమానాలే కాదు, రాజకీయ అభిమానాలు కూడా తీవ్రంగానే ఉంటాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని కొంతమంది అభిమానులు ఎంతగా కోరుకుంటున్నారో.. రజనీకి రాజకీయాలు వద్దు అని కూడా మరికొందరు అంతే తీవ్రంగా కోరుకొంటూ ఉన్నారు. తమిళనాడు ఇప్పటికే పలు పార్టీలున్నాయి. ఆ పార్టీలకు హార్డ్ కోర్ అభిమానులు ఉన్నారు. ఇన్నాళ్లూ రాజకీయాలకూ రజనీకి సంబంధం లేదు. అప్పుడు రజనీ అందరివాడు. ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తానంటూ రజనీ కొందరివాడు అవుతాడా? అనేది ఆసక్తిదాయకమైన ప్రశ్న. ఈ విషయంపై ట్రేడ్ నిపుణులు స్పందిస్తూ.. రజనీ పొలిటికల్ ఎంట్రీ ప్రభావం తమిళనాట ఈ సినిమాపై నెగిటివ్ ఇంపాక్ట్‌ను చూపించే అవకాశం ఉందని వారు అంటున్నారు. దేన్నైనా తీవ్రంగా తీసుకునే నైజం ఉంటుంది తమిళులకు. ఆయన పాలిటిక్స్‌లోకి రావడం ఇష్టం లేని వారు.. ఈ సినిమాను చూడటానికి రాకపోవడంలో పెద్దగా ఆశ్చర్యం లేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ విషయాన్ని ఇప్పుడే డిసైడ్ చేసేయలేమని.. రెండు మూడు రోజుల్లో ఈ ప్రభావం ఎంతో చెప్పవచ్చని వారు విశ్లేషించారు.